మోసాలకు చెక్ పెట్టండి

Public sector banks with Private sector CEOs

మొండి బకాయిలను సత్వరమే పరిష్కరించాలి
లేకపోతే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది
బ్యాంక్ సిఇఒలకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ హెచ్చరిక

న్యూఢిల్లీ: రూ.50 కోట్లు దాటిన మొండి బకాయిలు లేదా ఎన్‌పిఎల్లో మోసాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వరంగ బ్యాంకుల సిఇఒ(చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)లను ప్రభుత్వం హెచ్చరించింది. లేకపోతే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ బ్యాంకులకు తెలిపింది. నిధులను మళ్లించారనే ఆరోపణల మేరకు భూషణ్ స్టీల్‌కు చెందిన ప్రమోటర్ నీరజ్ సింగాల్‌ను ఎస్‌ఎఫ్‌ఐఒ(సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్) అరెస్టు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం. ఎన్‌పిఎ ఖాతాల్లో మోసాల గురించి తెలియజేయకపోతే, లేదా విచారణ సంస్థలు తర్వాత మోసాలను గురిస్తే సెక్షన్ 120బి కింద బ్యాంకర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. దివాలా చట్టం కింద అనేక కంపెనీలు బ్యాంకుల పరిశీలనలో ఉన్నాయి. నిధుల మళ్లింపు సహా మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడిన సంస్థలపై పరిశోధన సంస్థ విచారణ జరుపుతున్నాయి.

బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు రూ.8.9 లక్షల కోట్లకు చేరాయి. 2017 డిసెంబర్ ముగింపు నాటితో పోలిస్తే మొత్తం విలువ 10.11 శాతం పెరిగింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్థూల ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తులు) రూ.7.7 లక్షల కోట్లకు చేరాయి. బ్యాంకుల్లో మోసాల సంఖ్య పెరగడం కూడా తీవ్రం ఆందోళన కలిగిస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, ఆయన సన్నిహితులు రూ.14 వేల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిన తర్వాత అనేక స్కామ్‌లు వెలుగులోకి వచ్చా యి. కొన్ని స్టీలు తయారీ, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో లొసుగులు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. గత ఐదేళ్ల లావాదేవీల వివరాలను తెలియజేయాలని బ్యాంకు లు కోరాయి, అవసరమైతే బ్యాంకులు కూడా ఫోరెన్సిక్ ఆడిట్ కిందకు వస్తాయని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.2000 కోట్ల రుణాలను మళ్లించారనే ఆరోపణలపై ఎస్‌ఎఫ్‌ఐఒ ఇటీవల సింగాల్‌ను అరెస్టు చేసింది. కాగా మొండి బకాయిలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) కఠినంగావ్యవహరిస్తోంది.

నిరర్థక ఆస్తులను వెంటనే గుర్తించి, ఇచ్చిన గడువులోగా రిసొల్యూషన్ ప్లాన్ అమలు చేయాలని బ్యాంకులకు సూచించింది. ఈ విషయంలో విఫలమైతే బ్యాంకులపై జరిమానా పడనుంది. నిరర్థక ఆస్తుల సమస్య పరిష్కారం కోసం దివాలా చట్టం కింద ఇప్పటివరకు ఇచ్చిన అధికారాలతో బ్యాంకులు ఏమీ తేల్చలేకపోవడంతో ఆర్‌బిఐ తీవ్రంగా పరిగణించింది. కొత్త విధానాల ద్వారా మొండి బకాయిలను బ్యాంకులు వేగంగా గుర్తించి చర్యలు తీసుకోవచ్చని ఆర్‌బిఐ పేర్కొంది. నిబంధనల ప్రకారం, బ్యాంకులు మొండి బకాయిలున్న ఖాతాలను వెంటనే గుర్తించి, వాటిపై రిజల్యూషన్ ప్లాన్(ఆర్‌పి) అమలు చేయాలి. గడువులోగా రిజల్యూషన్ ప్లాన్ పూర్తి కాకపోతే ఆయా బ్యాంకులు దివాలా కేసు కింద నమోదు చేయవచ్చు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ బ్యాంక్‌లు పెద్ద మొత్తంలో మొండి బకాయిలను రద్దు చేశాయి.  ఆర్‌బిఐ అంచనాల ప్రకారం, మొత్తం 21 బ్యాంకులకు గాను 9 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల(ఎన్‌పిఎ) విలువ 15 శాతానికి పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. మరో 14 పిఎస్‌బిల స్థూల నిరర్థక ఆస్తులు 12 శాతానికి పైగా పెరిగాయి.