మెరుగైన భవితకు ‘గేట్’ వే

B.Tech dream fulfilled by the gate to be done in IITs

ఇంజనీరింగ్ పిజి, డైరెక్ట్ పిహెచ్‌డి తప్పనిసరి
ప్రణాళికాబద్ధంగా శ్రమిస్తేనే మంచి స్కోర్ సొంతం
సెప్టెంబర్ 1 నుంచి దరఖాస్తులు
2019 ఫిబ్రవరి 2, 3, 9, 10 తేదీల్లో పరీక్షలు

ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ పిజి, నేరుగా పిహెచ్‌డి చేయాలంటే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్) తప్పనిసరి. ఐఐటిల్లో బి.టెక్ చేయాలనే కలలు విఫలమైనవారు మరో రూపంలో వాటిని గేట్ ద్వారా నెరవేర్చుకోవచ్చు. అత్యున్నత విద్యా సంస్థలైన ఐఐఎస్‌సి, ఐఐటిలలో ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్/సైన్స్ విభాగాల్లో పిజి, డాక్టోరల్ కోర్సుల్లో చేరి, ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకు గేట్ మంచి మార్గం. వీటితోపాటు ప్రభుత్వ రంగ సంస్థలైన మహారత్న, నవరత్న, మినీరత్న హోదా కలిగిన కంపెనీలు, కీలకమైన ఉద్యోగాలను గేట్ స్కోరును ప్రామాణికంగా తీసుకుని భర్తీ చేస్తున్నాయి. ఈ పరీక్షకు సెప్టెంబర్ 1 నుంచి గేట్ దరఖాస్తులు ప్రారంభం కానుంది. దేశంలో నిర్వహించే ప్రతిష్టాత్మక పరీక్షల్లో ఒకటైన గేట్ పరీక్షకు ఏటా సుమారు పరీక్షకు సుమారు 9 లక్షల మంది హాజరవుతారు. గేట్ ప్రశ్నాపత్రం స్థాయి ఐఐటిలకు పేరు ప్రతిష్టలకు అనుగుణంగానే ఉంటుంది. అందువల్ల ఈ ప్రవేశ పరీక్ష రాయదలుచుకున్న విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా శ్రమిస్తేనే ఇందులో మంచి స్కోర్ సాధించగలుగుతారని నిపుణులు చెబుతున్నారు.

దరఖాస్తుకు అర్హతలు
ఇంజనీరింగ్/టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ.
ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్ డిగ్రీ.
నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ (బీఎస్)/బిఎస్‌సి(రీసెర్చ్)
సైన్స్/మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్/కంప్యూటర్ అప్లికేషన్స్ / తత్సమాన విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ.
ఇంజనీరింగ్/టెక్నాలజీలో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ (పోస్ట్ బిఎస్‌సి).
ఇంజనీరింగ్/టెక్నాలజీలో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ లేదా డ్యూయల్ డిగ్రీ.
అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్‌సి లేదా ఇంటిగ్రేటెడ్ బీఎస్‌సి/ఎంఎస్‌సి. (లేదా) తత్సమాన అర్హతలు ఉన్నవారు గేట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
నిబంధనల మేరకు కోర్సులో చివరి సంవత్సరం లేదా ఇతర సంవత్సరాల్లో ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ప్రక్రియ
గేట్ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్‌ను ఉపయోగించి దరఖాస్తును ఆన్‌లైన్‌లో నింపాలి. ముందుకు సరైన ఇమెయిల్, మొబైల్ నెంబర్‌తో గేట్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దరఖాస్తుల్లో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తగా నింపాలి. అభ్యర్థులు తమ ఫొటో, సంతకం, సంబంధిత సర్టిఫికెట్లను దరఖాస్తుతో పాటు అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు ఫీజు రూ.1,500, ఎస్‌సి,ఎస్‌టి, వికలాంగులు రూ.750 చెల్లించాలి.

పరీక్ష విధానం
గేట్- 2019ను మొత్తంగా 24 సబ్జెక్టుల్లో ఆన్‌లైన్‌లోనే పరీక్షలు ఐఐటీ మద్రాస్ నిర్వహిస్తుంది. అన్ని పేపర్లకూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సిబిటి) ఉంటుంది. గేట్ పరీక్షలో ఇంజనీరింగ్, టెక్నాలజీకి సంబంధించిన పేపర్లతో పాటు ఇంజనీరింగ్ సైన్స్, లైఫ్ సెన్సైస్ సబ్జెక్టు పేపర్లు కూడా ఉంటాయి. ఈసారి గేట్‌లో స్టాటిస్టిక్స్ పేపరును కూడా ప్రవేశ పెట్టారు. ప్రతి విద్యార్థి ఒకే పేపరులో పరీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్షలో మొత్తం 65 ప్రశ్నలుంటాయి. వీటికి 100 మార్కులు కేటాయిస్తారు. మూడు గంటల వ్యవధిలో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. తప్పనిసరి విభాగమైన జనరల్ ఆప్టిట్యూడ్ (జిఎ) నుంచి 10 ప్రశ్నలు, 15 మార్కులకు ఉంటాయి. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుంచి 55 ప్రశ్నలు (కొన్ని పేపర్లకు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది) 85 మార్కులకు ఉంటాయి.

సన్నద్ధత
గేట్ పరీక్షల్లో మంచి స్కోర్ సాధించాలంటే ప్రణాళికాబద్ధమైన ప్రిపరేషన్ అవసరం. సన్నద్దతలో పరిమాణం కంటే నాణ్యత చాలా ముఖ్యం. ప్రిపరేషన్‌లో భాగంగా మొదట సిలబస్‌ను క్షుణ్నంగా విశ్లేషించుకుని మంచి ప్రామాణిక పుస్తకాలను ఎంపిక చేసుకోవాలి. ఇంజనీరింగ్‌లో చదివిన సిలబస్ మొత్తం గేట్ ప్రిపరేషన్‌కు ఉపయోగపడదు. ఎంపిక చేసిన సబ్జెక్టులే ఉంటాయి కాబట్టి వాటిపై దృష్టిసారించాలి. ఫైనలియర్ విద్యార్థులు ఒకవైపు అకడమిక్‌గా ప్రాజెక్టువర్క్‌లు, పరీక్షలు, అసైన్‌మెంట్లకు సయయం కేటాయిస్తూనే గేట్‌కు ప్రిపరేషన్ కొనసాగించాలి. శిక్షణకు వెళ్లేవారు ఉదయం 8 గంటల లోపు క్లాసులు విని తర్వాత కాలేజీకి వెళ్లాల్సి ఉంటుంది. వీరు సాయంత్రం ఇంటికి వచ్చాక కనీసం 3 గంటలు గేట్ ప్రిపరేషన్‌కు కేటాయిస్తే మంచిది. గేట్ సిలబస్‌ను అకడమిక్స్‌తో అనుసంధానం చేసుకుంటూ అప్లికేషన్ విధానంతో పాటు పరీక్షకు సన్నద్దమైతే అకడమిక్స్‌గా, గేట్ ఎగ్జామ్‌లోనూ రాణించడానికి వీలుంటుంది. ప్రతివారం చదివిన అంశాలను విశ్లేషించుకోవాలి. గేట్ స్కోరుకు మూడేళ్ల వ్యాలిడిటీ ఉంటుంది. గేట్‌లో ప్రశ్నలు నేరుగా కాకుండా అప్లికేషన్ విధానంలో ఉంటాయి. అందువల్ల తొలుత ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. వాటికి సంబంధించిన ఫార్ములాలను అనువర్తిస్తూ సమస్యలు పరిష్కరించాలి.

నెగెటివ్ మార్కులతో జాగ్రత్త
గేట్‌లో ప్రతి తప్పు జవాబుకు 33.33 శాతం నెగెటివ్ మార్కులు ఉంటాయి. అంటే ఒక మార్కు ప్రశ్నలకు 1/3 వంతు, రెండు మార్కులకు 2/3వ వంతు మార్కులను మినహాయిస్తారు. కాబట్టి విద్యార్థులు సరైన సమాధానాలు తెలిసిన ప్రశ్నలకే సమాధానాలు ఎంపిక చేసుకోవాలి. న్యూమరికల ప్రశ్నలకు రుణాత్మక మార్కులు ఉండవు.

మాక్ టెస్ట్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలి
సమస్య పరిష్కార విధానంలో షార్ట్‌కట్ మెథడ్స్ నేర్చుకోవడం ముఖ్యం. దీనివల్ల తక్కువ సమయంలో, కచ్చితమైన సమాధానాలు రాబట్టొచ్చు. కోచింగ్ తప్పనిసరి కాకపోయినా సరైన గెడైన్స్, సందేహాల నివృత్తికి శిక్షణ ఉపయోగపడుతుంది. శిక్షణ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు మాక్‌టెస్ట్‌లు నిర్వహిస్తుండటం, సబ్జెక్టు నిపుణులు ఉండటం వల్ల ప్రిపరేషన్ సులువు అవుతుంది. జనవరి 1 నాటికి పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ పూర్తిచేయాలి. మిగిలిన సమయాన్ని రివిజన్, ప్రాక్టీస్‌కు ఉపయోగించుకోవాలి. గేట్ అకడమిక్‌గా అత్యున్నత స్థాయి పరీక్ష కాబట్టి ప్రిపరేషన్‌కు ప్రామాణిక పుస్తకాలు, సరైన మెటీరియల్‌ను ఉపయోగించుకోవాలి. మాక్‌టెస్టులకు అధిక ప్రాధాన్యమివ్వాలి. దీనివల్ల పరీక్ష విధానంపై పూర్తిస్థాయి స్పష్టత వస్తుంది. అదే విధంగా సమయపాలన అలవడుతుంది. మాక్‌టెస్టుల ఫలితాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. వాటిని తప్పనిసరిగా సమీక్షించుకుంటూ తప్పులు సరిదిద్దుకోవాలి.వర్చువల్ క్యాలికులేటర్‌ను ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. దీనికి ఆన్‌లైన్ మోడల్ టెస్టులు రాయడం దోహదపడుతుంది. పరీక్షల్లో ఎక్కువగా న్యూమరికల్ ప్రశ్నలు ఎదురవుతుంటాయి. వీటికి సమాధానాలు కచ్చితంగా గుర్తించేలా జాగ్రత్త పడాలి.

ఇవి గుర్తుంచుకోండి
గేట్ స్కోర్ పిజి ప్రవేశానికి మూడు సంవత్సరాలు చెల్లుబాటు అవుతుంది. ఆన్‌లైన్ పరీక్ష విధానంలో కంప్యూటర్ మైస్‌ను ఉపయోగించి ఆప్షన్లను గుర్తించాలి. న్యూమరికల ప్రశ్నలకు ఆప్షన్లు ఇవ్వరు. ఈ ప్రశ్నలకు వర్చువల్ కీ బోర్డును ఉపయోగించి సమాధానాలు రాయాలి. పరీక్షా కేంద్రంలోకి కాలిక్యులేటర్, మొబైల్స్‌ను అనుమతించరు. అభ్యర్థులు ఆన్‌లైన్ క్యాలికులేటర్‌ను ఉపయోగించుకోవచ్చు.

గేట్‌తో ప్రయోజనాలెన్నో..
మనదేశంలో అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో పిజి కోర్సుల్లో ప్రవేశంతో పాటు ఉపకార వేతరం కూడా లభిస్తుంది. ఈ స్కోర్ డాక్టోరల్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు కూడా ఉపయోగపడుతుంది. ఈ ప్రవేశాలతోపాటు ఎన్నో మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయి. ఇస్రో, డిఆర్‌డిఒ, బాబా ఆటామిక్ రీసెర్చ్ సెంటర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సైంటిస్టు ఉద్యోగంతో పాటు బిహెచ్‌ఇఎల్, గెయిల్, హెచ్‌ఎఎల్, ఐవొసిఎల్, ఎన్‌టిపిసి, ఒఎన్‌జిసి, వంటి ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. విదేశాల్లో ఉన్నతవిద్యకు కూడా గేట్ ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. సింగపూర్, జర్మనీలోని వివిధ యూనివర్సిటీలు గేట్‌లో మంచి స్కోరు పొందిన వారికి స్వాగతం పలుకుతున్నాయి. గేట్ స్కోరుతో అత్యున్నత ప్రమాణాలు కలిగిన విద్యాసంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సి), బెంగళూరులో చేరే అవకాశం లభిస్తుంది. ఆ తర్వాత విద్యార్థులు ఐఐటీలు, ఎన్‌ఐటీలను ప్రాధాన్య క్రమంగా ఎంపిక చేసుకోవచ్చు. వీటితోపాటు డీమ్డ్ యూనివర్సిటీలు, రాష్ట్రాల్లోని క్యాంపస్ కాలేజీల్లో ప్రవేశం పొందవచ్చు. మన రాష్ట్రంలో నిర్వహించే పిజిఇసెట్ ర్యాంకుల కంటే గేట్ విద్యార్థులకే ప్రాధాన్యం ఉంటుంది.

సెప్టెంబరు 1 నుంచి దరఖాస్తులు
గేట్ పరీక్షకు సెప్టెంబరు 1 నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించేలా ఐఐటీ మద్రాసు షెడ్యూలు జారీ చేసింది. విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు వెబ్‌సైట్‌ను (http://gate.iitm.ac.in) అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం నల్లగొండ, వరంగల్‌లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి.

ఇదీ గేట్ షెడ్యూలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : సెప్టెంబరు 1, 2018
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 21, 2018
దరఖాస్తు రుసుం: రూ. 1,500, ఎస్‌సి, ఎస్‌టి, వికలాంగులు,
మహిళలకు రూ.750
ఆలస్య రుసుము రూ.500తో స్వీకరణ: అక్టోబరు 1వరకు
నవంబరు 16 వరకు: పరీక్షల కేంద్రాల మార్పునకు అవకాశం
2019 జనవరి 4: వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు
2019 ఫిబ్రవరి 2, 3, 9, 10 తేదీల్లో: గేట్ ఆన్‌లైన్ పరీక్షలు, ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.
ఫలితాలు: మార్చి 16, 2019
వెబ్‌సైట్: http://gate.iitm.ac.in