మెప్పించాలని తపన పడ్డాను

Exclusive InterViews With Raja Goutham

రాజా గౌతమ్, చాందిని చౌదరి హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘మను’. నిర్వాణ సినిమాస్ సమర్పణలో క్రౌడ్ ఫండెడ్‌గా నిర్మితమైన ఈ చిత్రానికి ఫణీంద్ర నార్‌శెట్టి దర్శకుడు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో రాజా గౌతమ్ విలేకరులతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
మూడు సంవత్సరాలు పట్టింది…
నేను చాలా షార్ట్ ఫిలింస్ చూశాను. అందులో మధురం, బ్యాక్ స్పేస్ షార్ట్ ఫిలింస్ నాకు బాగా నచ్చాయి. బాగా చేశావంటూ దర్శకుడు ఫణీకి ఫోన్ చేసి ప్రశంసించాను. ఆతర్వాత మేమిద్దరం ఓ కాఫీ షాప్‌లో కలుసుకున్నాం. అప్పుడు అతను ‘మను’ గురించి నాకు 15 నిమిషాలు చెప్పాడు. అయితే ఓ రోజు ‘మను అనే పాత్రను మీరే చేస్తున్నారు’ అంటూ నాకు మెసేజ్ పెట్టాడు. ఆరోజు నుండి నేటికి అంటే సినిమా రిలీజ్‌కు మూడు సంవత్సరాలు పట్టింది.
115 మంది సపోర్ట్…
ఈ చిత్రాన్ని క్రౌండ్ ఫండింగ్ ఫ్లాట్‌ఫామ్‌లో చేశాం. దాదాపు 115 మంది మా సినిమాకు సపోర్ట్ చేశారు. ఈ ఫ్లాట్‌ఫామ్ సక్సెస్ అయితే ఇంకా టాలెంటెడ్ డైరెక్టర్స్ వస్తారని భావించాం. అందుకనే మూడేళ్లు నిరంతరంగా కృషి చేశాం.
నాన్నకు తెలుసు…
వీడు తనకు నచ్చిన సినిమా ఏదో చేస్తున్నాడని నాన్న (బ్రహ్మానందం)కు తెలుసు. మిగతా విషయాలు ఆయన అడగలేదు… నేను చెప్పలేదు. ఏదో సినిమా చేసేయాలని కాకుండా ఏదో కొత్తగా చేసి ప్రేక్షకులను మెప్పించాలని తపన పడ్డాను. అంతే తప్ప కావాలని ఎక్కువ సమయం తీసుకోలేదు.
డైరెక్టర్‌పైన నమ్మకంతోనే…
‘మను’ ఒక రొమాన్స్ మిస్టరీ. ఈ కథను నిర్మాతల వద్దకు తీసుకెళ్లాం. అయితే మరీ ప్రయోగాత్మకంగా ఉన్నారనుకున్నారేమో వెనకడుగు వేశారు. దీంతో ఫణి క్రౌడ్ ఫండింగ్‌తో సినిమా చేయాలని ఓ రోజు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. నాలుగు రోజుల్లో కోటి రూపాయలు వచ్చాయి. అంత డబ్బులు వచ్చాయంటే కేవలం డైరెక్టర్‌పైన నమ్మకమే.
నా పాత్ర నచ్చుతుంది…
సినిమాలో నేను పెయింటర్‌గా కనిపిస్తాను. తక్కువగా మాట్లాడతాను. సందర్భానుసారం కొన్ని ఎమోషన్స్‌ను వ్యక్తంచేస్తుంటాను. అదేంటో సినిమాలో చూడాల్సిందే. సినిమా చూసిన వారందరికీ నా పాత్ర తప్పకుండా నచ్చుతుంది.