మెడికల్ దందా

Selling private individuals with name of pharmacists

వైద్యుల చీటీలు లేకుండా మందుల విక్రయాలు
ఫార్మసిస్టుల పేరుతో ప్రైవేటు వ్యక్తుల అమ్మకాలు
శాంపిల్స్‌ను సైతం ధరలకు అంటగడుతున్న వ్యాపారులు
జనరిక్ మందులపై తప్పుడు ప్రచారం
కొరవడిన నిఘా

మన తెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం : చిన్న పాటి సుస్తీ చేసినా… మందులు మింగే కాలం ఇంది. దీనిని ఆసరాగా చేసుకున్న మెడికల్ షాపులు వారి దందాను సాగిస్తున్నారు.  రోగుల అవసరం వారికి కాసులు కురిపిస్తోంది. కనీస నిబంధనలు సైతం పాటించకుండా ఆడిందే ఆటా పాడిందే పాటగా సాగుతోంది. జిల్లాలో సిండికేట్‌గా ఏర్పడ్డ మెడికల్ షాపుల యజమానులు అధికారులకు నెలవారీ మామూళ్లు అంటగట్టి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుని లాభాలు గడిస్తున్నట్లు పలు ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా సుమారు 450 వరకు మెడికల్ షాపులు ఉన్నాయి. ఇందులో హోల్ సేల్ షాపులు సుమారు 40 నుండి 50 వరకు ఉంటాయి. వీటి అనుసంధానంగా జిల్లా వ్యాప్తంగా మెడికల్ దందా పెద్ద ఎత్తున సాగుతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నిబంధనలు పాటించాల్సిన సంబంధిత వ్యాపారాలు వీటిని ఎక్స్‌పైరీ చేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే వాదన బలంగా ఉంది. సాధారణంగా మెడికల్ షాపుల్లో మందులు అమ్మాలంటే వైద్యులు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అమ్మాలి. కానీ కొందరు మెడికల్ షాపుల వారు ప్రిస్క్రిప్షన్లు లేకుండానే మందులను ఇష్టానుసారంగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రులకు అనుసంధానంగా ఉన్న మెడికల్ షాపుల్లో సైతం ఇదే చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే ఆస్పత్రికి అనుసంధానం లేకుండా కేవలం ఆర్‌ఎంపి ల మీద నడిచే మెడికల షాపుల్లో జరిగే చోద్యం అయితే అంతా ఇంతా కాదు. అంతే కాకుండా మెడికల్ షాపుల్లో లాంగ్ ఎక్సైపైరీ, షార్ట్ ఎక్స్‌పైరీ తేదీలు ఉన్న మందుల వివరాలు లిస్టు తయారు చేసి ఉంచాలి. అంతే కాకుండా కోల్డ్ స్టోరేజీలో ఉంచాల్సిన మందులను సైతం సాథారణ ఫ్రిజుల్లో పెట్టి అమ్మేస్తున్నట్లు, స్టాక్ నిర్వహణ వివరాలు కూడా అధ్వాన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఫార్మసిస్టులు ఉండరా? : జిల్లాలో ఉన్న దాదాపు 70 శాతానికి పైగా మెడికల్ షాపుల్లో ఫార్మసిస్టులు లేకుండానే మందుల విక్రయాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా మెడికల్ షాపులు నిర్వహించాలంటే ఫార్మసీ పూర్తి చేసి ఉండాలి. వారు మాత్రమే వైద్యుల చీటీలకు అనుగునంగా డ్రస్‌కోడ్ పాటిస్తూ మందులు అమ్మకాలు సాగించాలి. కానీ ఎక్కడా ఆ తంతు కంటికి కూడా కనిపించదు. మెడికల్ షాపులు నిర్వహణ కోసం ఫార్మసీ పూర్తి చేసిన వారి వద్ద నుండి ధృవీకణ పత్రాలు అద్దెకు తెచ్చుకుని నెలవారీ చెల్లింపులు చేస్తుంటారు. ఈ క్రమంలో ఎలాంటి అర్హతలు లేకుండా పదో తరగతి పాస్/ఫెయిల్ అయిన వారు కూడా మెడికల్ షాపులు నిర్వహిస్తున్నట్లు పలువురు అంటున్నారు. ఇక మెడికల్ షాపుల్లో సాధారణంగా నెల వారీ జీతాలు వచ్చే కుర్రవాళ్లను, చదువుల కోసం డబ్బులు అవసరమైన విద్యార్థులను పెట్టుకుని మందుల అమ్మకాలు సాగిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో వైద్యులు రాసిన ఇంగ్లీష్ మందుల రాతలు అర్థం కాక మొదటి ఇంగ్లీష్ అక్షరాన్ని గుర్తుపెట్టుకుని, పైన రాసి ఉన్న మందుల కాంబినేషన్‌ను అవగాహన చేసుకుని ఏదో ఒకటి ఇస్తేస్తున్నట్లు తెలుస్తోంది. తీరా మందులు కొనుక్కుని ఎలా వాడాలో చెప్పించుకునేందుకు ఆస్పత్రి వర్గాలను సంప్రదిస్తే ఈ మందులు మారాయి, రాసిందే తెచ్చుకోండీ అంటూ తప్పి పంపిన సందర్భాలు కో కొల్లలు, మరో ప్రక్క డాక్టర్ రాసిచ్చిన మందులు కాకుండా మెడికల్ షాపుల వారికి అధిక లాభాలు మిగిల్చే అదే కాంబిషన్‌లో ఉండే మందులను సైతం అంటగడుతున్నట్లు, అలాంటి మందుల వల్ల 50 శాతం వరకు లాభం ఉంటున్నట్లు పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

శాపింల్స్ కూడా అమ్మకానికి :- మందుల తయారీ కంపెనీలు వారు తయారు చేసిన ఔషదాన్ని మార్కెటింగ్ చేసుకునేందుకు సాధారణంగా వైద్యులను సంప్రదించి, మందు పనితనాన్ని పూర్తిగా వివరిస్తుంటారు. వాటిని వైద్యులు రాసిచ్చేలా వివరిస్తుంటారు. ఈ క్రమంలో వారి స్టాకును పెద్ద ఎత్తున మెడికల్ షాపుల్లో పెట్టి అమ్మకాలు సాగించేందుకు షాంపిల్స్ ఇవ్వడంతో పాటు ఆఫర్లను సైతం ప్రకటిస్తారు. ఇదే సందని భావించే మెడికల్ షాపుల వారు ఆ షాంపిల్ మందులను కూడా అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

జనరిక్స్‌పై జలసీ : జనరిక్ ఔషదాలు మాములు మెడికల్ షాపుల్లో లభించే మందుల కంటే తక్కువ ధరకు లభ్యం అవుతాయి. కానీ మెడికల్ షాపుల వ్యాపారులు మాత్రం జనరిక్ మందుల వల్ల రోగాలు తగ్గవని, అందులో మందు పవర్ ఉండనే ఉండదని, వాటి వల్ల ప్రయోజనం కంటే నష్టం ఎక్కువగా ఉంటుందని ప్రచారం చేస్తూ తమ వ్యాపారాన్ని పెంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పరంగా కొత్తగూడెం, భద్రాచలం ఏరియా ఆస్పత్రుల్లో జీవనధార మెడికల్ షాపులు ఉన్నాయి. అదే విధంగా ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ప్రధానమంత్రి ఔషద యోజన మెడికల్ షాపు ఉంది. బయటి మెడికల్ షాపుల్లో లభ్యమయ్యే పలు రకాల మందులు ఇక్కడ కనీసం 10 నుండి 30 శాతం వరకు తక్కువకు అందుబాటులో ఉంటాయి. వారి వారి వ్యాపారాలు పడిపోతాయనే అక్కసుతో ప్రైవేటు మెడికల్ షాపుల వ్యాపారులు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కొరవడిన నిఘా : జిల్లాలో మెడికల్ షాపుల్లో సాగుతున్న దందా పై నిఘా కొరవడం వల్లే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉన్న మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించి స్టాక్ రిజిష్ట్రర్‌తో పాటు అన్నిరకాల నిబంధనలు పరిశీలించాల్సిన అధికారులు మత్తునిద్రలో ఉండటంతో మెడికల్ వ్యాపారులు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోందని అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత డ్రగ్ అధికారులు జిల్లాలోని మెడికల్ షాపులపై నిఘా పెట్టి నిబంధనలు పాటించని వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

తనిఖీలు నిర్వహిస్తాం : వివేకానంద రెడ్డి, డ్రగ్ ఇన్స్‌పెక్టర్ :- జిల్లాలో జరుగుతున్న మెడికల్ అమ్మకాలు, నిబంధనలపై జిల్లా డ్రగ్ ఇన్స్‌పెక్టర్ వివేకానంద రెడ్డిని మన తెలంగాణ వివరణ కోరగా, తాను జిల్లాకు గత 15రోజుల క్రితమే బదిలీపై వచ్చానని, పూర్తి అవగాహన చేసుకుంటున్నారని అన్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఫిర్యాదులు అందిన 10 షాపుల్లో తనిఖీలు నిర్వహించామని, రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Comments

comments