ముస్తాబవుతున్న ‘సామి’

Saamy

15 ఏళ్ల కిందట తమిళ్‌లో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది ‘సామి’. ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘సామి స్కేర్’ను రూపొందించారు. ఈ చిత్రం తెలుగులో ‘సామి’ అనే టైటిల్‌తో ఈనెల మూడో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న చియాన్ విక్రమ్ హీరోగా సింగం సిరీస్ సినిమాలతో పేరు తెచ్చుకున్న హరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో కీర్తిసురేష్ హీరోయిన్. శిబు థామీన్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, బాబీ సింహా, ప్రభు ముఖ్య పాత్రల్లో నటించారు. పుష్యమి ఫిలింమేకర్స్, ఎం.జి. ఔరా సినిమాస్ ప్రై.లిమిటెడ్ బ్యానర్‌లపై బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధంగా ఉంది ఈ చిత్రం. ఈ సందర్భంగా నిర్మాతలు బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ మాట్లాడుతూ “హీరో విక్రమ్, దర్శకుడు హరిలది పవర్‌ఫుల్ కాంబినేషన్. 15 సంవత్సరాల క్రితం వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సామి’ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘సామి స్కేర్’ చిత్రాన్ని తెలుగులో ‘సామి’గా విడుదల చేస్తున్నాము. విక్రమ్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, ప్రియన్-వెంకటేష్ అంగురాజ్‌ల సినిమాటోగ్రఫీ, కనల్ కణ్ణన్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణకానున్నాయి. ప్రస్తుతం సెన్సార్‌కు వెళ్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ మూడో వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం”అని అన్నారు.