రజత సింధు సత్తా చాటిన రిలే జట్టు ఆర్చరీలో రెండు రజతాలు టిటిలో కాంస్యం ఆసియా క్రీడల్లో భారత్‌కు పతకాల పంట
జకార్తా: ఆసియా క్రీడల్లో మంగళవారం పదో రోజు భారత ఆటగాళ్లు పతకాల పంట పండించారు. అథ్లెటిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. పురుషుల 800 మీటర్ల పరుగులో మంజీత్ సింగ్ పసిడి పతకం సాధించాడు. భారత్‌కే చెందిన మరో అథ్లెట్ జిన్సన్ జాన్సస్ రెండో స్థానంలో నిలిచి రజతం సాధించాడు. దీంతో ఈ విభాగంలో భారత్‌కు స్వర్ణం, రజతం దక్కాయి. అంతేగాక 4*400 మీటర్ల రిలేలో కూడా మిక్స్డ్ టీమ్ రజతం సొంతం చేసుకుంది. కాగా, బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో తెలుగుతేజం పి.వి.సింధు ఫైనల్లో ఓటమి పాలైంది. ఈ ఓటమితో సింధు రజతంతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. ఆర్చరీ ఫైనల్లో కూడా భారత జట్లు పరాజయం పాలై రజత పతకాలతో సంతృప్తి పడ్డాయి. కాగా, పురుషుల టిటి టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ కాంస్య పతకాన్ని గెలుచుకుని సంచలనం సృష్టించింది. ఇక మహిళల కురష్ రెజ్లింగ్‌లో భారత్‌కు రజత, కాంస్య పతకాలు లభించాయి. 52 కిలోల విభాగంలో పింకి బల్హరా రజతం, మలప్రభ జాదవ్ కాంస్యం సాధించారు. పురుషుల హాకీలో భారత్ తన జైత్ర యాత్రను కొనసాగిస్తూ ఆఖరి మ్యాచ్‌లో 200 గోల్స్ తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది.
చరిత్ర సృష్టించిన మంజీత్..
పురుషుల 800 మీటర్ల పరుగులో భారత స్టార్ అథ్లెట్ మంజీత్ సింగ్ స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన పోరులో మంజీత్ ఒక నిమిషం 46.16 సెకన్లలో లక్ష్యాన్ని అందుకుని స్వర్ణం సొంతం చేసుకున్నాడు. ప్రారంభం నుంచే అసాధారణ నైపుణ్యాన్ని కనబరిచిన మంజీత్ తన కెరీర్లోనే అత్యుత్తమ టైమింగ్‌తో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నాడు. మరోవైపు ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్‌కే చెందిన మరో స్టార్ స్పింటర్ జిన్సన్ జాన్సన్ 1:46.35 సెకన్లలో గమ్యాన్ని చేరి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. దీంతో ఈ విభాగంలో స్వర్ణంతో పాటు రజతం కూడా భారత్‌కే లభించింది.
మిక్స్డ్ రిలేలో రజతం..
మరోవైపు 4×400 మిక్స్డ్ రిలేలో కూడా భారత్ రజతం సాధించి సంచలనం సృష్టించింది. అసాధారణ నైపుణ్యాన్ని కనబరిచిన భారత బృందం రెండో స్థానంలో నిలిచింది. మహ్మద్ అనస్, పూవమ్మ రాజు, హిమదాస్, అరోకియా రాజీవ్‌లతో కూడిన భారత జటు 3:11.89 నిమిషాల్లో గమ్యాన్ని చేరి రజతం సొంతం చేసుకుంది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత జట్టు దాన్ని నిలబెట్టుకుంటూ దేశానికి పతకం అందించింది. ఈ విభాగంలో బహ్రెయిన్‌కు పసిడి లభించింది. భారత్ కంటే కాస్త మెరుగ్గా రాణించిన బహ్రెయిన్ ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది.
సింధుకు మళ్లీ నిరాశే…
ఇక, మహిళల బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధిస్తుందని భావించిన భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పి.వి.సింధు మరోసారి ఫైనల్లో నిరాశ పరిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో చైనీస్ తైపి క్రీడాకారిణి తై జుయింగ్ చేతిలో ఓటమి పాలైంది. ఫైనల్లో తన బలహీనతను మరోసారి పునరావృతం చేసిన సింధు రజతంతో సంతృప్తి పడింది. ఏకపక్షంగా సాగిన సింధు 1321, 1621 తేడాతో ప్రపంచ నంబర్‌వన్ తై జు చేతిలో కంగుతింది. ప్రారంభం నుంచే తైజు తన మార్క్ ఆటతో చెలరేగి పోయింది. సెమీస్‌లో సైనాను ఓడించిన తైజు ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించింది. ఇంతకుముందు జరిగిన మ్యాచ్‌లో అగ్రశ్రేణి క్రీడాకారిణి యమగూచిను ముప్పతిప్పలు పెట్టిన సింధు ఫైనల్లో మాత్రం ఆ సంప్రదాయాన్ని కొనసాగించలేక పోయింది. ప్రత్యర్థి క్రీడాకారిణి జోరుకు ఎదురు నిలువలేక పోయింది. ప్రారంభం నుంచే తైజు ఆధిపత్యాన్ని చెలాయించింది. ఫైనల్ ఫొబియా ఈ మ్యాచ్‌లోనూ సింధును వెంటాడింది. తీవ్ర ఒత్తిడిలో కనిపించిన సింధు వరుస తప్పిదాలకు పాల్పడింది. ఏ దశలోనూ తైజుకు కనీస పోటీ ఇవ్వలేక పోయింది. మరోవైపు చివరి వరకు దూకుడును ప్రదర్శించిన తైజు అలవోకగా మ్యాచ్‌ను గెలిచి స్వర్ణం సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఓడినా సింధు చరిత్ర సృష్టించింది. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఆసియా క్రీడల్లో రజతం సాధించిన తొలి మహిళ షట్లర్‌గా అరుదైన రికార్డును నెలకొల్పింది. ఆసియా క్రీడల్లో భారత్‌కు మహిళల విభాగంలో ఇది రెండో పతకం. మరో షట్లర్ సైనా ఇంతకుముందు సింగిల్స్ విభాగంలో కాంస్యం సాధించిన విషయం తెలిసిందే.
ఆర్చరీలో రెండు రజతాలు..
ఆర్చరీ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ రెండు రజతాలు సాధించింది. మంగళవారం జరిగిన మహిళలు, పురుషుల కంపౌండ్ విభాగం టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత జట్లు ఫైనల్లో ఓటమి పాలయ్యాయి. రెండు ఫైనల్స్‌లోనూ భారత జట్లు తీవ్రంగా పోరాడినా పరాజయం తప్పలేదు. మహిళల విభాగంలో భారత జట్టు 228231 తేడాతో దక్షిణ కొరియా చేతిలో ఓటమి పాలైంది. విజయం కోసం తీవ్రంగా శ్రమించిన భారత్ కొద్ది తేడాతో ఓడింది. ఈ పరాజయంతో భారత్‌కు రజతం లభించింది. ఇక, పురుషుల విభాగంలో భారత అసాధారణ ఆటను కనబరిచినా రజతంతోనే సరి పెట్టుకోవాల్సి వచ్చింది. దక్షిణ కొరియాతో జరిగిన ఫైనల్లో భారత్ సమంగా నిలిచినా నిబంధనల ప్రకారం రెండో స్థానంతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. షాట్ల ఎంపికలో కొరియా కాస్త మెరుగైన స్థితిలో నిలువడంతో భారత్‌కు రజతం మాత్రమే లభించింది. కొరియా పసిడిని సొంతం చేసుకుంది. ఇక, పురుషుల టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్‌కు కాంస్యం లభించింది. సెమీ ఫైనల్లో ఓటమి పాలైన భారత పురుషుల జట్టు టీమ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యంతో సరిపెట్టుకుంది.