ముద్ద ముద్దకు బిస్మిల్లా అంటెట్ల.?

ఇల్లు కట్టుకోవాల్నని ఎప్పటినుంచో అనుకుంటాంటె..మా బామ్మర్ధి వుండి, యిగో గీ మేస్త్రీతోని కట్టియ్యిబావ మంచిగ గడుతడు..అనిచెప్పి పట్టుకొచ్చిండు వందల ఇండ్లు కట్టిన వో మేస్త్రీ పెద్దమనిషిని. ఇగో మల్ల ఆయినకు ముందే చెప్పు ఎట్టగావాల్నో నడుమ నడుమ ఇదిట్ట అదట్ట అని సతాయించకు మల్ల ఆ మేస్త్రీకి నచ్చదు..వొదిలిపెట్టినా వొదిలిపట్టి పోతడు నడుమ. యెందుకంటే నీకత తెల్సుకావట్ట ముందలనే చెప్తాన బావ…అన్నడు మా బామర్ది. ఎవలయితేంది.. మనం చెప్పినట్టు కడుతె సరిపాయె అని అనుకోని.. కింద పెడితె […]

ఇల్లు కట్టుకోవాల్నని ఎప్పటినుంచో అనుకుంటాంటె..మా బామ్మర్ధి వుండి, యిగో గీ మేస్త్రీతోని కట్టియ్యిబావ మంచిగ గడుతడు..అనిచెప్పి పట్టుకొచ్చిండు వందల ఇండ్లు కట్టిన వో మేస్త్రీ పెద్దమనిషిని. ఇగో మల్ల ఆయినకు ముందే చెప్పు ఎట్టగావాల్నో నడుమ నడుమ ఇదిట్ట అదట్ట అని సతాయించకు మల్ల ఆ మేస్త్రీకి నచ్చదు..వొదిలిపెట్టినా వొదిలిపట్టి పోతడు నడుమ. యెందుకంటే నీకత తెల్సుకావట్ట ముందలనే చెప్తాన బావ…అన్నడు మా బామర్ది. ఎవలయితేంది.. మనం చెప్పినట్టు కడుతె సరిపాయె అని అనుకోని.. కింద పెడితె మీద మీద పెడితే కింద అటు ఇటు బేరమాడి..నా మేధావి తనాన్ని అంతా రంగరించి..మాట్లాడిన..“ యే.. మీరే యేమన్న మాట్లాడుకోర్రి అని ఆడికొచ్చిన నలుగుట్లె నా సంగతి తెలిసిన ఇద్దరు లేశపోంగ.. పోంగ వున్న ఇద్దరి ముందలనే అన్ని తీర్ల మాట్లాడి బయాన కాయితం రాయించుకోని గుత్తకిచ్చిన. మెటీరియల్ గిటీరియల్ అంతా మేస్త్రీ బాధ్యతే.. మనదేం లేదు. మనం పైసలిత్తం ఆయన ఇల్లుగట్టియ్యాలె గంతె. తేడా వొస్తే వూకోను ముందే చెప్తాన..అని మాట్లాడి యింత అడ్వాన్స్ గూడ ఇచ్చిన..మూర్తం సూసుకోని మొదలు పెట్టిండు మేస్త్రీ.. నా సంగతి తెలుసుకోని బయపడుకుంట బయపడుకుంటనే.

పంతులునయితి.. ఎండకాలం. నాకు బల్లె సెలవులొచ్చినయి యిగ పుర్సత్ దొరికింది. అంతానాకే తెలుసుననే ధోరణి నాకు యెందుకో చిన్నప్పటినుంచి అలువాటయ్యింది. మా నాయిన మా మేనమామలకాంచి మేధావులుగా చలామణి కావడమే అందుకు కారణమేమో. ఆల్లు నెరీ నా అంతకాదు .మనం జర వోవరేనంటరు జనం..కని నాకట్ల అనిపియ్యదు..జనమే తెల్విలేనోల్లని నా భావన. యెందుకంటే నాను నీనే మేధావిని అని అనుకుంటాన గదా..అదన్నమాట. నాకు చిన్నప్పటిసందే ఈ మేధావితనం అనే దుల అలువాటున్నది…ఇంకా అందుల పంతులనయిన కాంచి మరింతెక్కువయింది.
నా దుల’లు వాటులో ముఖ్యమైనది.. పక్కనోడు పనిచేత్తాంటె యీనె సరిగ్గ చేత్తడో లేడోనని అనుమానం. బాధ్యతలు అప్పగిచ్చనంక ఎదుటోడు చేసేది పురాగ సూడకముందే…అట్ల చెయ్యి ఇట్ల చెయ్యి అని శెప్తుంటి. నాగురించి తెల్సినోడేమో యీనగట్లెనే చెప్తడుతీయ్..అని ఆనిపని ఆడు చేసుకుంట పోయేటోడు. తల్వనోడయితెనోమో.. ఈనెతోని యెవ్వడు పెట్టుకుంటడని నడుమలనే వూడబీక్కోని పోయేటోడు.

ఇటువంటి మేధావినైన నాతోని.. సుతారి మేస్త్రీ కూలోల్లను పిలిపిచ్చుకోని సురుచేసిండు ఇల్లుకట్టుడు పని. గుంతలు తీసడు కాంచి అండ్ల పిల్లర్లు లేపి సెంట్రింగ్ కొట్టి స్లాబు యేసుడు కాంచి సెంట్రింగు పీకుడు టక టక ఇటుక కట్టుడు సురు చేసేటప్పటికి నా విశ్వరూపం అర్తమయ్యింది. మా మేస్త్రీకి ఆయనకిందోల్లకు. అప్పటికి పెద్దగనిలవడి చేసే పనులేమీ వుండయికావట్టి ..అదట్ల ఇదిట్ల అని నీను చెప్తాంటె…అట్లగాదు సార్ మీం చేత్తంగని మీరు వూకోండ్రి అని సముదాయించుకుంటనే వచ్చిన్రు..వోపికతోని… నారోకు కిందికి మీదికి సూసుకుంట.

మనకో దులలువాటుండె పాడయ్.. ఇగ మనకు వూకోబుద్దిగాదాయె. గటికోపాలి మేస్త్రీ కాడికి పోయి సిమెంటు మంచిగ కలుపుతాండ్రా…ఇసికె యింకిన్ని తట్టలెక్కువెయ్యి.. అగో అగో ఆడ జర తాపె ఆడియ్యలేదు సరిగ్గా…ఎర్రగున్నది…యీడ జర ఎత్తెక్కువయిందని… అనుకుంట పనిచేసేటోల్లకు వూపిరి మెసలకుంట చెప్పుకుంట పోతున్న. ఆడ పనిచేసే పనోల్లు.. ఆల్లు మనం ఎట్ల చెప్తే అట్ల పనిచేయమంటె చెత్తరాను..దానికో పద్దతుంటది ఆల్లు దాన్ని పట్టే పోతరు. చూసిండ్రు చూసిండ్రు…వోనాడు ఆగలేకపోయిన్రు. ఇగో సారూ..మీరు వూకె మమ్ముల సతాయించకురి… మీం చేస్తుంటం గని మీరట్ల కూసోర్రి..మీం చేసేది పురాగ అయిపోయినంక సూడ్రాదురి.. చేసెటోని కాల్లల్ల కట్టెలు పెట్టకురి..మీకు యేమి తెల్వది గని. మీకు అసలు వోపికే లేదేవున్రి..పంతులే గని.” అని అనుడు సురు చేసిన్రు యేగలేక…మేస్త్రీలే కాదు కూలోల్ల కాంచి.

వాల్లెంత చెప్తే యేంది…మనం మేధావుల మైతిమి.. ఎదుటోనికి ఎంత అనుభవమున్నా.. యెంత నిజాయితీ వున్నా..ఆయన చేసే పట్ల ఎంత చిత్తశుద్ది వున్నా..అయ్యన్నీ మనకు అవుపడవు.. యెందుకంటే మేధావులమైతిమి.. మనకు మతిల వొక అనుమానం వుంటదిగదా… వీల్లు అత్తర బుత్తర చేసి అవుతల పడుతరు.. మనం గట్టిగ చెప్పంది కాదు అనే వొక దులలువాటున్నదని చెప్తినగదా… అగో ఆ అలవాటెమ్మడి చెప్పుకుంట పోతనే వున్న.. సక్కగ పనిచేసెటోల్లకు
అట్లగాదు ఇట్ల అని నాలుగైదు సార్లు కట్టినయే కూల గొట్టిచ్చిన.. ఇగపాయె..అనుకున్న టైముకంటే దాటిపోతాంది మేస్త్రీకి ఇల్లుకట్టనీకి. అప్పటికే నాలుగైదు సార్లు చెప్పిండు…సార్ జర మీరు మాకు అదీది అని యేమి చెప్పుకురి.. మీకెందుకు నీనున్నగా మీరు అనుకున్నట్టే ఇల్లుకట్టిచ్చే బాధ్యత నాది…నమ్ముకం వుంచున్రి జర.. ఇప్పటికే మీరు చేయవట్టి నాకు కూలోల్ల లాసు వస్తాంది..” అని చెప్తనే వున్నడు మేస్త్రీ.

నాగ్గూడ మేస్త్రీ చెప్పేది నిజమే కదా అని అనిపిస్తది కని..ఎదుటోల్లను నమ్మలేమాయె.. మన మెదడునిండ మేధావి తనముండె యేం చేయాలె. అటోఇటో నా బాధలను బరించుకుంట ప్లాస్టరింగు అయితే చేసిన్రుగని..యిగ మిగతా పనులు అయతలేవాల్లతోటి..అయితలేదంటే పనిరాక కాదు. నా మేధావితనంతోటి వాల్లు అయోమయంలో పడిపోయేది..ఆకాడికి మూడునాలుగు దుక్కుల్ల తేడా చేసిన్రు పని..నా మాటలిని. యేమయిందో యేంపాడో గని.. తెల్లారి బందుచేసిండు పని సుతారి మేస్త్రీ. నాకేమో జల్దీ జల్దీ అయిపోవాలనే ఆలోచనాయె..ఫోన్ చేత్తే పోన్ లేప్తలేడు..యెట్లచేయాలె అని మా బామ్మర్దికి పిలిచి చెప్పిన.. మేస్త్రీ రాట్లేడని.

ఇగ అందుకున్నడు మావోడు..
బా.. అనుకుంటనే వున్న. నీను ముందుగాలనే చెప్పిన, నీ మేధావితనానికి పనోల్లు వొక్కడు మిగలడని.. నువ్వు ఎవ్వల్ని నమ్మవు బావ. నీవెంత మేధావివైతే మాత్రం నీకు సదువు చెప్పొత్తదేమోకాని., ఇల్లుగట్టుడేమెర్క.? అన్నీట్లేలు బెడుతవ్.. ఆ మేస్త్రీ అసలె ఇది. బతిలాడి బతిలాడి పిలుసుకొచ్చిన. ఎన్నితిప్పలు పెట్టినవో యేం పాడో పీక్కోని పోయిండు. అంత గట్టోడే పీక్కోని పోయిండంటే నీవెంత మేధావివో బావ నాకర్తమైతలేదు. నీనేమన్నరా.. పనిమంచిగ చేయమని చెప్పిన.. తప్పా” అన్న నీను.

తప్పా వొప్పా అని కాదు బావా..అన్నీ ఆలోచించే వొక పని అప్పచెప్పితిమి..వొకపాలి అప్పచెప్పినంక పనిచేసోటోనిమీద భరోసా వుంచాలె. చేసేటోన్ని చేయనీయాలె.. మొత్తం అయిపోయినంక తేడా వస్తే అప్పుడు అడుగాలె గని…నీకేదో అనుమానం వున్నదని కట్టే మేస్త్రీని అడుగడుగునా అడ్డం పడుతే యెట్ల..చేసోటోని కాల్లల్ల కట్టెలు పెడితె ఎట్ల.? అట్ల యెవ్వడు పనిచేయడు…నమ్ముకం కుదిరినంకనే మేస్త్రీకి పని అప్పచెప్పితివి..మల్ల అనుమానమేంది బావ నాకు తెల్వక అడుగుతా.. మొదటి ముద్ద పెట్టుకుంటానప్పుడే అల్లా బిస్మిల్లా అని దేవునికి మొక్కి తింటం… అంతే గానీ ముద్ద ముద్దకు బిస్మిల్లా అంటమా.? యేపనయినా గంతే..నమ్మినం అంటే ముందల పడిచేసేటోనిమీద వొదిలిపెట్టాలె. అని క్లాసు పీకుడు సురుచేసిండు మా బామర్ది. అంతేనంటవారా…అన్న..నీను.

అంతేకాకుంటే యేంది బావ .. మీ మేధావులందరూ అట్లనే వుంటరా యేంది. అన్నీ మీకు చెప్పే చేయాలె.. మిమ్ముల అడిగే చేయాలె..లేకుంటె గంటకొట్టుకుంట కూసుంటరా ఇట్ల మందిమీద పడి.. యెవ్వల్నీ నమ్మకుంట.. అన్నడు కోపంగ నమ్ముకం కాదురా.. యేమన్న కరాబైతదేమోనని..” అని చిన్నగ గులిగిన..అసలే కోపం మీదున్నడు..మల్లేమంటడో అని.
కరాబుచేసోటైడనే ఆ మేస్త్రీకి వందల మంది అప్పచెప్పిన్రా పని ఇండ్లు కట్టుమని..నీ వొక్కని ఇల్లే కడుతాండా దేశంల. వూకో బావ..మీ మేధావి గుణం తీరు పోనిచ్చుకోరు తీయ్…అని ఇసురుకున్నడు.

పాపం ఇప్పటికే మా బామ్మర్ధికి నా మేధావితనం అలువాటు..అట్ల చానాసార్లు పనోల్లు ఎగ్గొట్టి పోయిన్రు నా మేధావి తనానికి యేగలేక.. నువ్వూకె పనోల్లను అదోటి ఇదోటి చెప్తివాంటే వాల్లు పనిచేయరు అని.. వాడన్నట్టే అయింది. మా బామర్ది అట్ల మొదలు పెట్టిండో లేదో.. ఇంతలెకే మా యామె వచ్చి చేరింది తమ్మునికి వొంతగొట్టుకుంట.. నన్ను తిట్టుదానికి. నామీద దీర్ఘాలు తీస్తాంది. ఆయినె అంతేరా తమ్మీ..ఎవలు చెప్తె ఇన్నడు ఎప్పుడు చెప్తె ఇన్నడురా..చేసేటోల్ల కాల్లల్ల కట్టెలు పెట్టమంటే మాత్రం ముందుగాలుంటడు.. యీనె అంత మేధావి ఈ లోకం లేనే లేడు అని ఆయన భావన అని..మొదలు పెట్టింది.నామీద కోపం అంతా తీర్సుకుందానికి.

ఇత లావం లేదు..ఈడ వుంటే..వీల్లకు తోడు.. మా పోరగాండ్లు గూడ జమై తిట్టుడు సురుచేస్తరేమోనని..శిన్నగ ఆనించి జారుకున్న రీడింగు రూముల జొరబడ్డ. యేందీకత…నా అలువాటు దగ్గట్టే వున్నదీల్ల కత..అని ఆలోచన చేసుకుంట.. ఎదురుంగ ఆంధ్రజ్యోతి పేపరు వుంటే అందుకోని సదువుడు సురుచేసిన పంద్రాగస్టు వార్తలేమొచ్చినయోనని. నాకు పస్టు ఎడిట్ పేజీ సదువుడు అలువాటుతోని అండ్లకు పోయిన. ఎడిటర్ రాసిన వో ఆర్టికల్ అవుపడ్డది. “ధర్మగంట లేని అభివృద్ధి ఎందుకు.?’ అని ఇంతపొడుగుంది. తెలంగాణ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి కేసీయార్ మీద రాసిండు. అసాంతం సదివినంక…యీ యెడిటర్ కత గూడ నావోతిగనే వున్నట్టున్నదిగా అనిపిచ్చింది.. నాకు.

“నువ్వెంత మంచిగ కడితే నాకేంది…నీను చెప్పినట్టు ఇనాలెగని..” అని నీనెట్టయితే పనిచేసే మేస్త్రీని పరేషాన్ చేసి ఆగం చేసిన్నో…మన ఎడిటర్ మేధావి కూడా ….“నీను చెప్పేది ఇనకుంటే నువ్వెంత అభివృద్ధి చేస్తే నాకెందుకు.?” అని అడుగుతాండు.. తెలంగాణ ముఖ్యమంత్రిని. నావోతిగెనే మేస్త్రీని పనిచేత్తోని కాల్లల్ల పెట్టినట్టే వున్నది యీనె ఆలోచనగూడ. యిగ అయిపోయింది..యీనె పనికూడా అనుకున్న…. వున్నదున్నట్టు మాట్లాడే మా బామ్మర్ధి అసొంటి సోషల్ మీడియా యాదికొచ్చి.. ఫేసుబుక్కు వోపెన్ చేసి చూసిన. వూకుంటరా మనోల్లు… మా బామర్దిని మించిన దాడులు మొదలు పెట్టిన్రు. వైరల్ అయ్యింది లొల్లి ఆర్టికల్ మీద.. తిట్టినోడేకాని తిట్టనోడు లేడు ఆర్టికల్ రాసిన ఎడిటర్‌ను. “అయ్యా యేదయ్యా ధర్మగంట.? మీ ఆంధ్రా మీడియా అధర్మ గంటలు సాల్తలేవా మమ్ముల ఆగం చేద్దానికి..యింకేం గంటలు కావాలె.?

తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నఅభివృద్ది చూసి అసూయ పుడుతున్నాది.. యేం విమర్శంచాల్నో తెల్వక…గంటమీద పడ్డావు నాయినా… అభివ్రుద్ది వొద్దుగని మీ దొంగమాటలు నమ్మాల్నా.? అనుకుంట అందుకున్నరు.. ఇగ. నీనంటే నా బామ్మర్ది పెండ్లాం పోరగాండ్ల నుంచి తప్పించుకుందానికి ఇవుతలి రూములకొచ్చిన నోరుమూసుకోని… గని.. యీ సోషల్ మీడియానుంచి తప్పించుకునుడు ఆ ఎడిటర్ మేధావికి ఎంత తిప్పలయితాందో పో.. అన్పిచ్చి మస్తు బాదయింది.. సహానుభూతితో.

                                                                                                                                                           రమేశ్ హజారి

Comments

comments