ముగ్గురి మధ్య నలుగుతున్న అధ్యక్ష పీఠం

తేలని డిసిసి వ్యవహారం వర్గపోరులో సతమతమవుతున్న కాంగ్రెస్ చిక్కుముడిగా మారిన ఖమ్మం జిల్లా అధ్యక్షుని నియమాకం ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రాజకీయ పార్టీలు సమాయత్తమవుతుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం వర్గపోరులో సతమతమవుతుంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠం ముగ్గురి నేతల మధ్య నలిగిపోతుంది. రాష్ట్రంలో అన్ని డిసిసిలకు అధ్యక్షులను ప్రకటించినా ఖమ్మం పై మాత్రం చిక్కుముడి వీడడం లేదు. కాంగ్రెస్ నేతలు మల్లు భట్టివిక్రమార్క, గారపాటి రేణుకాచౌదరి, పొంగులేటి సుధాకర్‌రెడ్డిల మధ్య ఇప్పుడు మూడు ముక్కలాటలా మారింది.  […]

తేలని డిసిసి వ్యవహారం
వర్గపోరులో సతమతమవుతున్న కాంగ్రెస్
చిక్కుముడిగా మారిన ఖమ్మం జిల్లా అధ్యక్షుని నియమాకం

ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రాజకీయ పార్టీలు సమాయత్తమవుతుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం వర్గపోరులో సతమతమవుతుంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠం ముగ్గురి నేతల మధ్య నలిగిపోతుంది. రాష్ట్రంలో అన్ని డిసిసిలకు అధ్యక్షులను ప్రకటించినా ఖమ్మం పై మాత్రం చిక్కుముడి వీడడం లేదు. కాంగ్రెస్ నేతలు మల్లు భట్టివిక్రమార్క, గారపాటి రేణుకాచౌదరి, పొంగులేటి సుధాకర్‌రెడ్డిల మధ్య ఇప్పుడు మూడు ముక్కలాటలా మారింది. 

మన తెలంగాణ/ఖమ్మం :  నేతలు మారినా కాంగ్రెస్‌లో వర్గపోరు మాత్రం పోవడం లేదు. ఆ వర్గపోరే జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష నియమాకానికి అడ్డంకిగా మారింది. ఖమ్మంజిల్లా అధ్యక్షుని నియమాకం చిక్కుముడిగా మారింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసిన అయితం సత్యం ఆకస్మిక మృతితో అధ్యక్ష పదవీ ఖాళీ అయింది. రాష్ట్రంలో మిగిలిన జిల్లాలో ప్రస్తుతం ఉన్న వారినే అధ్యక్షులుగా తిరిగి నియమించింది. ఖమ్మంకు ఆ పరిస్థితి లేదు. జిల్లా కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ముగ్గురు నేతల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. ఒకరు చూపిన వ్యక్తిని మరొకరు అడ్డుకునే పనిలో ఉన్నారు. డిసిసి విషయం తెల్చేందుకు ఇటీవల ఒక ప్రయత్నం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ పేరు తెరపైకి వచ్చింది. చంద్రశేఖర్ కూడా ఉన్న ఈ సమావేశంలో మరో నేత అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. వార్డుకు కూడా గెలవని నువ్వు ఐదు సార్లు ఎంఎల్‌ఎ అయినా నన్ను అడ్డుకుంటావా అంటూ చంద్రశేఖర్ ఆగ్రహాం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ముగ్గురు నేతలు కులాల వారీగా తమ అనుచరులను అధ్యక్ష పీఠం కోసం సిద్దం చేశారు. కానీ ఒకరంటే ఒకరికి పడడం లేదు. నేతల వ్యవహార శైలిపై కార్యకర్తల్లో  ఆగ్రహాం వ్యక్తమవుతుంది. బలమైన అధికార పార్టీని ఢీకొనాల్సిన సమయంలో ఈవిధంగా నేతలు వ్యవహారించడం సరికాదన్న భావన వ్యక్తమవుతుంది. వర్గపోరు కారణంగానే పలుమార్లు కాంగ్రెస్ పార్టీ నష్టపోయిందని ఎన్నికల ముందు ఈ వర్గపోరు ఇబ్బందికరంగా మారిందని నియోజక వర్గ కాంగ్రెస్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. నియోజక వర్గాల్లోనూ ఇదే పరిస్థితి వర్గాలుగా విడిపోయి పనిచేస్తూ ఒకరికి చెక్ పెట్టేందుకు మరోకరు ప్రయత్నిస్తున్నారు. కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు, యడవల్లి కృష్ణ మధ్య వర్గపోరు అందరికీ తెలిసిందే. ఒకరు మల్లు భట్టివిక్రమార్క పక్క నిలవగా మరోకరు రేణుకా వర్గంలో ఉన్నారు. సత్తుపల్లిలో సంభాని చంద్రశేఖర్, మానవతారాయ్ మధ్య పోటాపోటీగా ఉంది. నిన్నటి వరకు పినపాక నియోజక వర్గంలో వర్గపోరు లేదు. అనుకున్న ఇప్పుడు అక్కడ చిచ్చుపుట్టింది. ఇక వైరా, ఖమ్మంలో పోటీ చేసే నేతల హడావుడి చాలా ఎక్కువగా ఉంది. సిట్టింగ్ శాసన సభ్యులు మల్లు భట్టివిక్రమార్కకు ఎదురు లేకుండా ఉంది. మొత్తంగా ఎన్నికల వేళ వర్గపోరు నుంచి కాంగ్రెస్ బయటపడలేకపోతుంది. పార్టీ జిల్లా అధ్యక్షుని నియమాకపు విషయంలోనే ఏకాభిప్రాయం సాధించకుండా జనంలోకి ఎలా వెళ్తారనే ప్రశ్నా ప్రస్తుతం నాయకులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. వర్గ నేతలు తమ వర్గ ప్రయోజనాలకు విరామం ఇస్తారా లేక అంతే పట్టుదలతో ఉంటారా అన్నది కొద్ది రోజుల్లోనే తేలనుంది.

Related Stories: