ముగిసిన క్రీడా సంగ్రామం

2018 Asian Games ceremony ended Sunday

పక్షం రోజులుగా ఇండోనేషియా వేదికగా సాగుతున్న ఆసియా క్రీడల మహా సంగ్రామం ఆదివారం ముగిసింది. జకార్తాలోని గెలారొ బంగ్ కర్నా స్టేడియంలో ముగింపు ఉత్సవ వేడుకలు కనుల పండవగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక, సాహాస కార్యక్రమాలు అభిమానులను కట్టి పడేశాయి. ముగింపు వేడుకల్లో భారత బృందానికి మహిళా హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ సారథ్యం వహించింది. ఆమె వెంట ఇతర క్రీడాకారులు నడిచారు. ముగింపు వేడుకల్లో నిర్వహించిన ఫైర్ వర్క్, సాంస్కృతిక కార్యక్రమాలు చిరకాలం గుర్తుండి పోతాయి. పోటీలను విజయవంతంగా నిర్వహించిన ఇండోనేషియా ఔరా అనిపించింది.

పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు ఏ లోటు లేకుండా చూసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండానే పోటీలు ముగిసాయి. ఈ క్రీడల్లో ఆసియాకు చెందిన 46 దేశాలు క్రీడల్లో పాల్గొన్నాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా చైనా 289 పతకాలతో ఎవరికి అందనంత ఎత్తులో నిలిచింది. చైనా 132 స్వర్ణాలు, 92 రజతాలు, 65 కాంస్య పతకాలు సాధించింది. జపాన్ 205 పతకాలతో రెండో, దక్షిణ కొరియా 177 పతకాలతో మూడో స్థానంలో నిలిచాయి. ఆతిథ్య ఇండోనేషియా గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 98 పతకాలు గెలుచుకుని నాలుగో స్థానంలో నిలిచింది. ఇండోనేషియా 31 స్వర్ణాలు, 24 రజతాలు, మరో 43 కాంస్య పతకాలు సాధించి పెను ప్రకంపనలు సృష్టించింది. ఉజ్బెకిస్థాన్ ఐదో, ఇరాన్ ఆరో, చైనీస్‌తైపి ఏడో స్థానంలో నిలిచాయి. భారత్ 69 పతకాలతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. భారత్ 15 స్వర్ణాలు, 24 రజతాలు, మరో 30 కాంస్య పతకాలు సాధించింది.

Comments

comments