ముంబై రైలు బోగీలు పెంచరా!?

The most crowded railroad department

అత్యధిక రద్దీ ఉన్నా చలనం లేని రైల్వే శాఖ
5 జిల్లాలకు కేంద్రం, రైలు ప్రయాణం నరకం
కిక్కిరిసిన రైలు ప్రయాణాలు
మహిళలు, వృద్ధులు గంటల తరబడి నిలబడి ప్రయాణం
దేశంలోని సగం రాజధానులకు రైలు సౌకర్యం
కొత్త రైలు బోగీల జాడలేవు

మన తెలంగాణ/కామారెడ్డి : రైలు బోగీలు, కొత్త రైలు నడపాలని ఏళ్ళ తరబడి కోరుతున్నా ఉత్తర తెలంగాణ జిల్లాలపై ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలపై రైల్వేశాఖ సవతితల్లి ప్రేమ చూపుతుంది. కామారెడ్డి నిజామాబాద్ మీదుగా హైదాదాబాద్, సికింద్రాబాద్, ముంబై, బెంగళూరు, ఒడిస్సా, జైపూర్, చెన్నై, భువనేశ్వర్, వైజాగ్, చతీస్‌ఘడ్, తిరుపతి, షిర్డీ, భోపాల్ తదితర నగరాలు, పుణ్యక్షేత్రాలకు రైళ్లు నడుస్తున్నాయి. ముంబై, తిరుపతి, షిర్డీ ప్రాంతాలకు రైళ్లు కిక్కిరిసి నడుస్తున్నాయి. అదనపు బోగీలు, కొత్త రైళ్లు ప్రారంభించాలని ఏళ్ల తరబడి ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. ముంబై, షిర్డీ, తిరుపతి, మన్మాడ్ రైళ్లకు తక్షణమే అదనపు బోగీలు, జనరల్ బోగీలు పెంచాలని కోరుతున్నారు. కామారెడ్డి నిజామాబాద్‌ల నుండి అత్యధికంగా సరుకుల రవాణా సాగుతుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలైన మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుండి ప్రతినిత్యం వేలాది మంది రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం వెళ్తుంటారు. ముంబయి రైలుకు 4 బోగీలు పెంచాలని కోరుతున్నారు. తిరుపతి, షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 4 చొప్పున అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని అనేక మార్లు ఉన్నతాధికారులకు విన్నపించినా ఫలితం ఉండడం లేదంటున్నారు. కిక్కిరిసిన రైలు ప్రయాణంతో వృద్ధులు మహిళలు, పిల్లలు నరకయాతన పడుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులకు ప్రజాప్రతినిధులకు రైల్వే సమస్యలపై పలుమార్లు విన్నవించారు. రైళ్లు పెంచాలి, బోగీలు పెంచాలని ఏళ్ళ తరబడి కోరుతున్నా రైల్వే అధికారులు సవతితల్లి ప్రేమ చూపుతున్నారని ప్రజలు వాపోతున్నారు. అత్యధికంగా ఈ స్టేషన్లలో సరుకుల రవాణా జరుగుతుందని, ఎరువులు, పంట ఉత్పత్తులు, విత్తనాలు పురుగుల మందులు, ఇంధనం ఇతర వస్తువులు రవాణా అవుతూ అధిక ఆదాయం వస్తున్నా అభివృద్ధి పనులు, సౌకర్యాల కల్పనలో శీతకన్ను చూపుతున్నారని తెలిపారు. ఇచ్చిన విన్నపాలు బుట్టదాఖలు అవుతున్నాయని, ప్రాంత సమస్యలు అసలు లెక్కలోకి తీసుకోవడం లేదని రైల్వే ప్రయాణికుల సంఘం నేతలు విమర్శిస్తున్నారు. ఈ జిల్లా నుండి కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల ప్రజలు వేలాది మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. రైల్వే గూడ్స్ విభాగం వందల మంది ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. డబుల్ రైల్వే మార్గాలను నిర్మించాలని కోరినా, సర్వేలు, నిధులు లేవని చెబుతున్నారు. పాతరాజంపేట గేటు వద్ద గంటల తరబడి వెయిటింగ్ చేస్తున్నా రైల్వే ఓవర్ బ్రిడ్జి కోసం విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ప్రజలు వాపోతున్నారు. ఉత్తర, దక్షిణ భారతదేశ రాష్ట్రాలను కలిపే ఓఖా రామేశ్వరం రైలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆపాలని కోరుతున్నా రైల్వే శాఖ నిద్ర మత్తు వీడడం లేదంటున్నారు. ప్రతినిత్యం వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు ప్రయాణించే సికింద్రాబాద్ నిజామాబాద్ స్టేషన్ల మధ్య ఇంటర్‌సిటీ రైలు ప్రారంభించాలని, తద్వారా ఉద్యోగులు, విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని కోరుతున్నారు. సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి ప్రాంతాల నుండి కామారెడ్డి, నిజామాబాద్‌లకు ప్రతినిత్యం వేలాది మంది ఉద్యోగులు రాకపోకలు సాగిస్తారు. ఇంటర్‌సిటీ రైలు కోసం పోరాటాలకు ఇక్కడి ప్రజలు సిద్దమవుతున్నారంటే సమస్య తీవ్రతను అర్ధం చేసుకోవాలని కోరుతున్నారు. స్టేషన్లకు కనీసం మంచినీరు, మరుగుదొడ్ల వసతులు కూడా లేవు, మూత్రశాలలు లేక మహిళలు తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నా రైల్వే అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదు. వృథాగా ఉన్న స్థలాలు, ప్రదేశాల్లో దుకాణాలు నిర్మిస్తే, ఆదాయం చేకూరి పలువురికి ఉపాధి లభిస్తుందని వారి దృష్టికి తీసుకెళ్ళినా ప్రయోజనం లేదని విమర్శలు వస్తున్నాయి. కామారెడ్డి, నిజామాబాద్, డిచ్‌పల్లి ప్రముఖ వ్యాపార కేంద్రాలు ఈ స్టేషన్లలో ఖాళీ ప్రదేశాల్లో దుకాణాలు నిర్మించాలని కోరుతున్నారు. రైల్వేకు లక్షల ఆదాయం వస్తుంది, యువత, వ్యాపారస్తులకు వ్యాపార అవకాశాలు లభిస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దర్శన్ టాకీసు ప్రియా టాకీసు మధ్యగల రైలు మార్గంపై మరో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని, దీంతో కామారెడ్డి పాత కొత్త పట్టణానికి మధ్య దూరం తగ్గుతుందని పట్టణవాసులు కోరుతున్నారు. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేక ఇటీవల పట్టాలు దాటుతూ, గూడ్స్‌రైలు ఢీకొని ముగ్గురు అమాయక మహిళలు చనిపోయారు. ప్రియా టాకీసు మార్గంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాల్సిన అవసరం చాలా ఉందని సీనియర్ సిటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.