ముందుమాటలే సాహిత్య వారధులు

literary

నయనాల ముంగిట నాట్యమాడుతున్న అక్షర కుసుమాలు పలికిన భావాలనే కాదు, కనురెప్పల గొడుగు నీడలో, తెరవెనుక దాగిన మర్మాన్ని గ్రహించి, రచయిత ఆత్మలోకి పరకాయ ప్రవేశం చేసి విశ్లేషించినపుడే అది పరిశీలనాత్మక, శాస్త్రీయతతో కూడిన విలువైన అభిప్రాయం అవుతుంది. అంటే రచయిత కోణంలో నుండి ప్రపంచాన్ని చూడగలిగినపుడే అది సాహిత్య వికాసానికి బాటలు పరుస్తుంది. మాట, అణువణువునా పదునును దట్టించుకున్న చురకత్తి. మనిషి ఉన్నత విలువలకు వారు పలికే మాటలే నిలువెత్తు ప్రతిబింబాలు. ఒక్క మాటతో బంధాలను ఆలింగనం గావించవచ్చు, కఠినాత్మకంగా మనుసుని విరిచేయనూవచ్చు. ఒకే మాటతో మనిషి ఆశయాలకు నిచ్చెనగా మారి, ఆకసానికి వారథిగా మారనూవచ్చు, ఆశలపై నిర్లిప్తతా జల్లులు కురిపించి అచేతనులుగా మార్చనూవచ్చు. ఒక్క మాటతో చరిత్రలో యుద్ధాలూ జరిగాయి, ఒకే మాటతో చరిత్రలూ మారాయి. మాటకున్న విలువని అక్షరాల్లో బంధించుట అనితర సాధ్యం. సాహిత్య రంగంలోనూ ముందుమాటకున్న ప్రాధాన్యం అటు వంటిదే. అనుభవజ్ఞుల ముందుమాట ముం దు తరానికి ప్రస్తుత తరానికి మధ్య ఉన్న వారధి.
తెలుగు సాహిత్య కళామతల్లి ఒడిలో ఓలలాడి, దశాబ్దాలుగా ఆ తల్లి సేవలో పునీతమవుతున్న అనుభవజ్ఞులు, పండితుల నుండి ఇపుడిపుడే సాహిత్య పూదోటలో మొగ్గలై విచ్చుకుంటున్న యువరచయితల వరకూ, తమ హృదయం చిలికించిన భావాలకు అక్షర రూపమిచ్చి, ఆ భావాలని సమాజంలో విత్తనాలుగా చల్లి తమ వంతు సాహితీ వ్యవసాయాన్ని చేయాలన్న తపనతో, వారు వేసిన నారు, పంటై సంఘంలో మార్పుని తెస్తాయన్న ఆశతో తమ భావాలకు పుస్తక రూపమిచ్చి, సంఘంలో భావ పరంపరను ఒలికిస్తున్నారు. చిన్న వయసులోనే తమ ప్రతిభను చాటుకుంటూ సాహితీ క్షేత్రంలో నవయుగంగా, భవిష్యత్తు నిర్మాతలుగా వ్యవహరిస్తుండడం, తెలుగు భాషకిది శుభపరిణామమే.
సహజంగానే యువత తమ రచనలపై అనుభవజ్ఞుల అభిప్రాయాలూ, సూచనలకై తమ రచనలపై ముందుమాటలు కోరడం జరుగుతుంది. దాదాపు ప్రసిద్ధ సాహితీకారులు అందరూ వివిధ రచనలపై ముందుమాటలు రాస్తూ, ఎన్నో సభలకి అధ్యక్షత వహించి తమ వంతు సేవలో పునీతమవడం ఆహ్వానించదగిన పరిణామం. వయసును సైతం లెక్క చేయక ప్రతీ రోజు సాహిత్య సభలకి హాజరవుతున్న సాహితీపిపాసులూ ఉన్నారు.
అయితే సాహితీ సభలకి హాజరవడం, ముందుమాటలు రాయడం వరకే ఎందరో అనుభవజ్ఞుల పాత్ర ముగిసిపోవడం అత్యంత విచారకరం. వారి అనుభవాలు యువతకు జ్ఞాన సోపానాలు అన్న విషయం విస్మరించరాదు. ఎందరో పండితుల పరిజ్ఞానం, సాహిత్యం వారి వరకే పరిమితమవుతుండడం లేదా కొద్ది మందికే చేరడం విచారించతగ్గదే. సభలు, ఆవిష్కరణలు, సన్మానాలకే ప్రస్తుత సాహితీ సభలు పరిమితమవడాన్ని విమర్శకులు, రచయితలూ గ్రహించి, సాహిత్య అభివృద్ధిపై, యువకులను ఉన్నతంగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతయినా ఉన్నది. ఇక్కడ మరొక చింతించాల్సిన విషయమేటంటే కొందరు రచయితలు సన్మానాల కోసం వారి ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టడం, బిరుదుల కోసం పాకులాడడం. ఇలా తెలుగు సాహిత్య రంగంలో పాతుకుపోయిన సమస్యలెన్నో.
ఇప్పుడు వస్తున్న పుస్తకాలలోని ముందుమాటలని చూస్తుం టే, చాలా వరకు ఏదో తమకి తోచిన అభిప్రాయాలను ముందుమాటలుగా వెలిబుచ్చినట్టుగా అనిపిస్తుంది. కొందరు అయితే కేవలం అరగంట సేపట్లో రచనలను చదివి, పది నిమిషాల్లోనే ముందుమాటలు రాయడం నిజంగా సాహిత్యానికి చేటు చేసేదే. అంటే ఒక రచయిత భావాలకి తగిన గౌరవం లభించినట్లే. తగిన సమయం లేనపుడు ముందుమాటలు రాసి రచయిత మనోభావాలను దెబ్బతీయడం దేనికి? సభలు, సమావేశాలకు హాజరయ్యే శ్రద్ధ ముందుమాటలు విశ్లేషించడంపై ఎందుకు ఉండదు? ఎంతమంది తమతమ అభిప్రాయాలను, సూచనలను ఆయా రచయితలకి అందిస్తున్నారు? ముఖ్యంగా కొందరు విమర్శకుల శైలి ప్రమాదకరంగాను ఉన్నది.
విమర్శించడంపైనే వారి దృష్టి కేంద్రీకృతమైంది కానీ, సాహిత్యంలో ఉన్నత విలువలు గల సాహిత్యాన్ని సమాజంలోకి తీసుకురావడంలో లేదు. విమర్శకు గల కారణాలను బాధ్యతగా భావించి వెల్లడించడం లేదు. దీని వల్ల యువ రచయితలకు, విమర్శకులకు మధ్య అంతు లేని అగాధం ఏర్పడుతుంది. విమర్శని గౌరవించలేని స్థితి వస్తోంది. దీని వలన ఆ విమర్శకి, విమర్శకుడికీ తగిన గౌరవం దక్కకపోవచ్చు.
ఇది శుభ పరిణామం కాదు. విమర్శన హేతుబద్ధంగా ఉండాలి. అయితే పొగడ్తలు, లేదంటే విమర్శలు.దీంతో యువత పొంగిపోయి నిత్యవిద్యార్థి అనే స్థానం నుండి పక్కకు మరలి, అంతా తమకే తెలుసనే స్థాయికి వెళ్తున్నారు. ఇక విమర్శకులు చేస్తున్న ఘాటైన విమర్శలకు, అపుడపుడే వెలుగుతున్న దీపాలు కాస్త, గాలిలో ప్రమిదలవుతున్నాయి. ఈ రెండు శైలులు సాహిత్యాభివృద్ధికి ప్రమాదకరమే. కేవలం సభలు, సమావేశాలు జరిపితే ఉపయోగముండదు, నైపుణ్యా న్ని నలుదిక్కులా వ్యాపించే కాంతిరేఖలు కావాలి, సన్మానాలు స్వేకరించడం కన్నా, మీ లాంటి పది మందిని తయారుచేయడమే నిజమైన గౌరవంగా భావించాలి, మీరు మాత్రమే సాహి త్య కళామతల్లి ముద్దు బిడ్డలుగా రాణిస్తే సరిపోదు, కళామతల్లికి మనుమళ్లని,మునిమనమళ్లని వరప్రసాదాలుగా అందించాలి. అదే అదే సాహిత్యాభివృద్ధికి ఆమోదయోగ్యం.

పరవస్తు విశ్వక్సేన్
8328384951