మాదకమత్తులో యువత

దేశంలో మత్తు మందు పదార్ధాల వాడకం నానాటికీ పెరుగుతుండడం ఆందోళన కలిగించే ఒక పరిణామం. 2005 సంవత్సరంలో మత్తు పదార్ధాలకు అలవాటు పడిన యువత సంఖ్య ప్రతి లక్ష జనాభాకు 28 మంది మాత్రమే వుండగా నేడు ఆ సంఖ్య 250 కి పెరిగింది. పంజాబ్, హరియాణాలలో జాతీయ సగటుకు మూడింతలుగా అంటే 840 మంది యువత మత్తు పదార్ధాలకు అలవాటుపడినట్లు జాతీయ సాంఘిక న్యాయ సాధికార మంత్రిత్వ శాఖ తాజా గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో నేడు […]


దేశంలో మత్తు మందు పదార్ధాల వాడకం నానాటికీ పెరుగుతుండడం ఆందోళన కలిగించే ఒక పరిణామం. 2005 సంవత్సరంలో మత్తు పదార్ధాలకు అలవాటు పడిన యువత సంఖ్య ప్రతి లక్ష జనాభాకు 28 మంది మాత్రమే వుండగా నేడు ఆ సంఖ్య 250 కి పెరిగింది. పంజాబ్, హరియాణాలలో జాతీయ సగటుకు మూడింతలుగా అంటే 840 మంది యువత మత్తు పదార్ధాలకు అలవాటుపడినట్లు జాతీయ సాంఘిక న్యాయ సాధికార మంత్రిత్వ శాఖ తాజా గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో నేడు పెచ్చు పెరుగుతున్న ఒక కొత్త సామాజిక సమస్యకు ఇది అద్దం పడుతోంది. 746 మందితో గోవా, 621 మందితో మహారాష్ట్ర తర్వాతి స్థానాలలో వున్నాయి. పంజాబ్, హరియాణాలలో యువతలో 75 శాతం జీవితంలో ఒక్కసారైనా డ్రగ్స్ రుచి చూసినవారేనని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తమ సామాజిక భద్రతా అధ్యయన నివేదికలలో తెలియ జేశారు.

దేశం వ్యాప్తంగా నిఘా విభాగం జరుపుతున్న తనిఖీలలో వందల కిలోల హెరాయిన్, బ్రౌన్ షుగర్, గంజాయి పట్టుబడుతున్నాయి. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్, ఇరాక్, నైజీరియా వంటి దేశాల నుండి జల, వాయు, రోడ్డు మార్గాలలో మన దేశానికి నిరాటంకం గా మత్తు పదార్ధాలు సరఫరా అవుతునట్లు నిఘా వర్గాల నివేదికలు తెలియజేస్తున్నాయి. భద్రతా వ్యవస్థలో లోపాలు, అధికారుల అవినీతి, డ్రగ్స్ సరఫరా ముఠాలకు మన రాజకీయ నాయకుల అండదండలు ఇత్యాది కారణాల వలన దేశంలో వివిధ ప్రాంతాలకు మత్తు పదార్ధాల సరఫరా నిర్విఘ్నంగా సాగుతోంది. ఈ సంవత్సరంలో వివిధ ప్రాంతాలలో పట్టుబడిన మత్తు పదార్ధాల వివరాలను చూస్తుంటే అంతర్జాతీయ విపణిలో మన దేశానికి ఎంత విలువ వుందో ఇట్టే అర్ధం అవుతుంది.

గుజరాత్ తీరంలో ఒక మర పడవలో 200 పాకెట్ల హెరాయిన్ పట్టుబడింది. దీని విలువ 600 కోట్లు. శంషాబాద్ విమానాశ్రయంలో 200 కిలోలు, ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు దఫాలలో 800 కిలోలు, చండీఘర్ సరిహద్దు వద్ద నాలుగు సంఘటనలలో 200 కిలోలు, హైదరాబాద్ నగరంలో వివిధ తనిఖీలలో 800 కిలోలు, ఒడిశాలో 56 వేల కిలోలు, తెలుగు రాష్ట్రాలలో 79 వేల కిలోల గంజాయి పట్టుబడింది. వీటి విలువ మూడు వేల కోట్ల పై మాటే.

2017 సంవత్సరంలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ముంబై, గోవా, చండీఘర్ నగరాలలో విదేశాల నుండి అక్రమంగా దిగుమతి అవుతున్న అయిదున్నర వేల కోట్ల విలువ గల గంజాయిని కస్టమ్స్ అధికారులు తనిఖీలలో పట్టుకున్నారు. దొరకని పదార్ధాల విలువ ఈ మొత్తానికి మూడింతలు వుండవచ్చునని నిఘా వర్గం అధికారులే స్వయంగా అంగీకరిస్తున్నారు. ఇది కాకుండా దేశంలో మారుమూల ప్రాంతాలలో, అడవులలో, మన్యం ప్రాంతాలలో సుమారుగా లక్ష ఎకరాలలో గంజాయిని అక్రమంగా సాగు చేస్తునట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. తమిళనాడు, కేరళ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలలో వేల ఎకరాలలో సాగు చేయబడుతున్న వందల కోట్ల విలువ గల గంజాయి పంటను అధికారులు ఇటీవల ధ్వంసం చేశారు. ఇది అసలు సాగులో పది శాతం లోపేనని ఎక్సైజ్ అధికారుల అంచనాలు. ఇటీవల ముంబయిలో పోలీసులకు పట్ట్టుబడ్డ ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి, తమ అపార్ట్‌మెంట్‌లోని 15వ అంతస్థులో నవీన వ్యవసాయ పద్ధతుల ద్వారా గంజాయి మొక్కలు పెంచుతున్న వైనం అధికారులను నివ్వెరపరచింది. ఒకప్పుడు చౌక రకం మత్తు పదార్ధం కింద జమకట్టి గంజాయి నేడు దేశంలో వేల ఎకరాలలో సాగు చేయబడుతూ వేల కోట్ల రూపాయల వ్యాపారానికి కారణమౌతోంది. విమానాశ్రయాలలో వుండే స్కానర్లు మాదక ద్రవ్యాలను గుర్తించే స్థితిలో లేకపోవడం కూడా మాదక ద్రవ్యాల నిరాటంక సరఫరాకు ఒక ముఖ్య కారణం.

ఇక దేశీయంగా ఇంటర్‌నెట్, సాంఘిక మాధ్యమాల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా మత్తు పదార్ధాల అమ్మకం, కొనుగోళ్ళు సాగుతున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పని చేసే డార్క్ నెట్, వన్ డ్రైవ్, డీప్ వెబ్ లావాదేవీల ద్వారా వందల కోట్ల విలువ చేసే మత్తు పదార్ధాల క్రయవిక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. దేశంలో వివిధ నగరాలలో విద్యాభ్యాసం చేస్తున్న విదేశీయులు కొరియర్ వ్యవస్థల ద్వారా మత్తు పదార్ధాలను తెప్పించుకుంటూ తాము వాడుకుంటూ భ్రష్టు పట్టిపోవడమే కాకుండా సాటి భారతీయులకు అలవాటు చేసి వారిని కూడా నైతికంగా పతనం చేస్తూ మొత్తం సమాజానికి చీడపురుగుల్లా మారుతున్నారు. నగరాలు, మెట్రోలు, గ్రామా లు అనే తేడాలేకుండా మొత్తం దేశమంతటా ఈ మత్తు పదార్ధాల బెడద వ్యాపించడం చాలా ఆందోళనకర విషయం. దేశంలో వేల ఎకరాలలో గంజాయి అక్రమ సాగు జరుగుతుండగా మొత్తం నిఘా వ్యవస్థ, ఎక్సైజ్ అధికారులు, ప్రభుత్వం, పోలీసులు ఏం చేస్తున్నారని గత జనవరిలో సుప్రీం కోర్టు ఘాటుగా ప్రశ్నించింది. ఈ ఆగష్టు నెలాఖరులోగా దేశంలో మాదక ద్రవ్యాల వాడకం పై విధానపర మార్గ నిర్దేశాలను జారీ చెయ్యాలని కోర్టు కేంద్ర ప్రభుత్వానికి క్రితం జనవరిలోనే ఆదేశాలు జారీ చేసినా ఇంతవరకు ఈ అంశంలో ఎలాంటి కదలికా లేదు.

అక్షరాస్యులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, సెలబ్రిటీలు, సినిమా పరిశ్రమ, విద్యార్ధులు, ప్రభుత్వోద్యోగులు, క్రీడాకారులు ఇలా ఒకరేమిటి నేడు దేశం లో మత్తు పదార్ధాల బారినపడిన వారి లో ఎందరో వున్నారు. మత్తు పదార్ధాలు చాక్లెట్లు, అయిస్ క్రీంలు, పిప్పర్‌మెంట్లు, ఇంజెక్షన్లు ఇలా ఎన్నో రూపాలలో అందరికీ నేడు యధేచ్ఛగా లభ్యమయ్యే దౌర్భాగ్య పరిస్థితులు దేశంలో నెలకొనదం నిజంగా బాధాకరం. మత్తుమందు వ్యాపారం అక్రమ ధనార్జనతో చేసే మామూలు వ్యాపా రం కాదు. మద్యపానం కంటే వేల రెట్ల వేగంతో వాటికి అలవాటు పడిన వారిని జీవం లేని శవాలుగా మార్చేసి ఆఖరుకు వారిని జీవచ్చవాలుగా మార్చేసి, వారిపై ఆధారపడిన వారిని రోడ్లపైకి ఈడ్చేస్తుంది.

మత్తు పదార్ధాలకు అలవాటు పడిన వారిని ఏ రీహాబిలిటేషన్ కేంద్రాలు కూడా కాపాడలేవు. వారికి తిరిగి మెరుగైన ఆరోగ్యం అందించేందుకు ఏ దేశం లో కూడా చికిత్స లభించడం లేదు. క్షణం క్షణం నరకం అనుభవిస్తూ, తీసుకుంటూ ప్రాణాలు కోల్పోవడమే వారికి పట్టబోయే దుర్గతి. ఆ నేర తీవ్రతను గుర్తించిన అమెరికా, దక్షిణ కొరియా, ఫిలిప్పైన్స్, సౌదీ అరేబియా, ఇండోనేసియా వంటి దేశాలు మాదక ద్రవ్యాలను నిరోధించేందుకు పలు కఠినమైన చట్టాలను అమలు చేస్తూ మాదక ద్రవ్యాల ముఠాల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఆయా దేశాలలో రెండవ తప్పిదానికి మరణ దండనే ప్రాప్తం. కాగా మన దేశంలో మాత్రం ఇంకా ఈ సమస్య తీవ్రతను గుర్తించే దశలోనే మన ప్రభుత్వాలు వుండడం నిజం గా మన దురదృష్టం.