మాజీ ఎంపి మణెమ్మ కన్నుమూత

మణెమ్మ మృతికి కెసిఆర్ సంతాపం

ప్రజా ప్రతినిధిగా విశేష సేవలందించిన మణెమ్మ,ముషీరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం
నేడు మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

Manemma
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అంజయ్య సతీమణి మణెమ్మ మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని ప్రార్థించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మణెమ్మ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. మణెమ్మ సికింద్రాబాద్ ఎంపీగా రెండు సార్లు ఎంపికయ్యారు. 2008లో ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. మణెమ్మ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు.

మన తెలంగాణ / ముషీరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య సతీమణి సికింద్రాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ముషీరాబాద్ మాజీ శాసనసభ్యురాలు టి.మణెమ్మ ఆదివారం ఉదయం 11ః37 గంటల సమయంలో మృతి చెందారు. ఆమె వయస్సు 75 సంవత్సరాలు. ఆమెకు నలుగురు కూతుర్లు, ఒక కుమారుడు. రక్తహీనత, జ్వరంతో పాటు మరికొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గత నెల 27వ తేదీన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి ఆమెకు చికిత్సను అందిస్తున్నారు.

ఆమె ఆరోగ్యం క్షీణించి ఆదివారం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె భౌతికకాయాన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, కెవిపి రాంచందర్‌రావు, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, పి.శంకర్‌రావు, మాజీ ఎంపి కెఎస్.రావు, ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డి దంపతులు సందర్శించి నివాళులర్పించారు. బండారు దత్తాత్రేయ, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్.కె.లక్ష్మణ్‌లు ఫోన్‌లో కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు. 1986లో సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులుగా ఉన్న భర్త టి. అంజయ్య మృతి చెందడంతో ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన మణెమ్మ విజయం సాధించారు.

అనంతరం 1989లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రెండవ సారి ఎంపిగా తెలంగాణలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. ఆ తర్వాత 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముషీరాబాద్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో మణెమ్మను నిలబెట్టి గెలిపించారు. అనంతరం 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ముషీరాబాద్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది 2014 వరకు కొనసాగారు. ఎమ్మెల్యేగా ముషీరాబాద్ నియోజకవర్గంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు మణెమ్మ. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఇక్కడి ప్రజలతో విడదీయలేని అనుబంధం ఆమెకు ఉంది. గత మూడు సంవత్సరాలుగా మణెమ్మ వయోభారం, అనారోగ్యంతో ఇంటికే పరిమితమయ్యారు. ఆమె అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.

మణెమ్మ మృతికి సిపిఐ సంతాపం

ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి టి అంజయ్య సతీమణి, మాజీ శాసనసభ్యురాలు మణెమ్మ మృతి పట్ల సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి సంతాపం తెలిపారు. మణెమ్మ ముషీరాబాద్ ఎంఎల్‌ఎగా గెలిచిన తర్వాత ఆరోగ్యం సహకరించక పోయినా నియోజకవర్గ ప్రజల కోసం పని చేశారని, ముఖ్యంగా మహిళల అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ఆమె మృతి మహిళా ఉద్యమానికి తీరని లోటని, వారి కుటుంబానికి సానుభూతిని తెలిపారు.

Comments

comments