మాజీ ఎంఎల్ఎ తీరుపై మంద జగన్నాదం అసంతృప్తి

Mandha jagannadham is not unhappy with the former MLA
ఇటిక్యాల: ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఏనాడు జెండా పట్టకుండా పదవులను అనుభావించి ప్రస్తుత టిఆర్‌ఎస్ పార్టీలో చేరిన పక్షం రోజుల్లోనే పార్టీలో విభేధాలు సృష్టించి ఐక్యతకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తేలేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి డా. మంద జగన్నాదం అగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని కొండేరు గ్రామంలో బుధవారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజి ఎమ్మెల్యే అబ్రహం చేపడుతున్న వ్యవహార తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ఉద్వేగంతో మాట్లాడారు. పార్టీలో ఉన్న కార్యకర్తలనే మళ్ళి తిరిగి బలవంతంగా పార్టీలో చేర్పించి కండువాలు కప్పడం పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతుందన్నారు. నియోజకవర్గంలో ఎలాంటి పార్టీ కార్యక్రమాలు చేపట్టిన స్థానిక ఇంచార్జి, మండల అధ్యక్షులకు సమాచారం ఇవ్వకుండ ఇష్టానుసారంగా వర్గాలను ఉసిగొలుపుతున్నాడని మండిపడ్డారు. సీమ సంస్కృతి కలిగిన నడిగడ్డలో గత ఎన్నికలలోనే 40,000 ఓట్లు సాధించామని అప్పటి నుండి ప్రజలకు అందుబాటులో ఉంటు పార్టీ కార్యక్రమాలు చేపడుతూ బలోపేతం చేశామని అలాంటిది ఇప్పుడు పార్టీలో చేరి పార్టీ నియమావళికి భిన్నంగా వ్యవహరిస్తే పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. గత నాలుగు సంవత్సరాల నుండి పార్టీ అభ్యున్నతికి పాటు పడిన మేము భవిష్యత్తులో గులాబి జెండా ఎగురవేస్తామని ఇందులో సందేహం లేదని కొందరు మాత్రం పనిగట్టుకుని తమకే టిక్కెట్టు హామి లభించిందని అసత్య ప్రచారం చేయడం తగదన్నారు. తుమ్మిళ్ళ సాధనకు నిరంతర కృషి తమదేనని చెప్పుకొచ్చారు. ఆగస్టు చివరి నాటికి తుమ్మిళ్ళ నీళ్ళు వదిలేందుకు ముఖ్యమంత్రి వస్తారని అప్పుడే బస్‌డిపో, వంద పడకల ఆసుపత్రికి శ్రీకారం చూడతామన్నారు. నియోజకవర్గంలో వ్యతిరేఖ వర్గం అవలంభిస్తుందన్న తీరుపై అధిష్టాన దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. పార్టీ అభ్యున్నతికి పాటుపడిన తమతో కలిసి వచ్చి పార్టీ మరింత బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇటిక్యాల, మానవపాడు, అలంపూరు, ఉండవెళ్ళి టిఆర్‌ఎస్ పార్టీ మండలాల అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి, రోశన్న, మహేశ్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, పల్లయ్య తదితరులు పాల్గొన్నారు.