మాంసంతో మస్కా

Residential contractors are magical waters

రెసిడెన్షియల్ కాంట్రాక్టర్ల మాయాజాలం
నాణ్యత లేమితో అనారోగ్యం బారిన పడుతున్న విద్యార్థులు
పట్టించుకోని అధికారులు

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లుగా తయారైంది గురుకుల విద్యార్థుల పరిస్థితి. ఉత్తమ బోధనే కాదు అత్యుత్తమంగా విద్యార్థులకు ఆహార పదార్థాలను అందించాలనే ప్రభుత్వ లక్షానికి కాంట్రాక్టర్లు తూట్లు పొడుస్తున్నారు. గురుకుల పాఠశాలలు, కళాశాలలకు కూరగాయలు, చికెన్, మటన్, పాలు, గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్లు నాణ్యత లేమితో సరఫరా చేస్తుండడంతో విద్యార్థులు అనారోగ్య భారినపడుతున్నారు. కాంట్రాక్టర్ల విషయంలో అధికారులు నోరు మెదపకపోవడం విద్యార్థులకు శాపంగా మారింది.

మన తెలంగాణ/ఖమ్మం : రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేయడంతో పాటు వసతుల కల్పన బోధన, ఆహార పదార్థాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. గురుకుల పాఠశాలలకు కూరగాయలు, చికెన్, మటన్, పాలు, గుడ్లు అందించేందుకు టెండర్లు పిలిచారు. వీటితో పాటు కస్తూర్బా బాలికల విద్యాలయాలకు ఇదే నిబంధనలు అమలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో సోషల్ వెల్పేర్ గురుకుల పాఠశాలలు ఐదు, బిసి గురుకుల పాఠశాలలు ఆరు, మైనార్టీ గురుకులాలు ఏడు, మోడల్ స్కూల్స్ రెండు, కస్తూర్బా పాఠశాలలు 14 ఉన్నాయి. ఇందులో మూడు జూనియర్ కళాశాలలు కూడా ఉన్నాయి. పైన పేర్కొన్న విద్యాలయాలకు కూరగాయలు, ఇతరత్రా సరఫరా చేసేందుకు టెండరు పొందిన కాంట్రాక్టర్లు నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. ముఖ్యంగా మాంసం విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న మేకలు, గొర్రెల మాంసాన్ని సరఫరా చేస్తున్నారని కొందరు మరణించిన జంతువుల మాంసాన్ని కూడా సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఇక కూరగాయల విషయం మరీ గోరం. మార్కెట్‌లో అతి తక్కువ ధర కలిగిన నాణ్యత లేని వాటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. చికెన్ విషయంలోనూ ఇదే జరుగుతున్నదనే ఆరోపణ. నెలలో రెండు సార్లు మాంసం, నాలుగు సార్లు చికెన్ వడ్డించాల్సి ఉంది. కొందరు ఉన్నతాధికారులు కాంట్రాక్టర్లతో చేతులు కలపడంతో గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్ ఏం మాట్లాడలేకపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని నాణ్యమైన ఆహార పదార్థాలను అందించేవిధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.