మహాభినిష్క్రమణ

కొండయ్య తన కూతురికి పెండ్లి సంబంధం వచ్చిందని చెప్పడానికి పొద్దున్నే వచ్చిండు “మామా? మీ మనవరాలిని చూడడానికి ఓ పిల్లగాడు వచ్చిండు జరరాయే” అభ్యర్థిస్తూ అడిగాడు కొండయ్య. నేను ఆసక్తి పట్టలేక “ ఏ ఊరు? ఏం చదువుకున్నాడట? అని అడిగినాను. “పిల్లగాని సదువు ఏంటిదో నాకు తెల్వదు మామా! టివిలో వార్తలు సదువుతాడట! ఊరు ఎములాడ దగ్గర హన్మాజిపేట” చెప్పిండు కొండయ్య. “సరే నువ్వెల్లు అరగంటలో వచ్చేస్తా! ఆయన్ని పంపించేశా. నేను రెడీ అయ్యి వెళ్లేసరికి […]

కొండయ్య తన కూతురికి పెండ్లి సంబంధం వచ్చిందని చెప్పడానికి పొద్దున్నే వచ్చిండు “మామా? మీ మనవరాలిని చూడడానికి ఓ పిల్లగాడు వచ్చిండు జరరాయే” అభ్యర్థిస్తూ అడిగాడు కొండయ్య. నేను ఆసక్తి పట్టలేక “ ఏ ఊరు? ఏం చదువుకున్నాడట? అని అడిగినాను. “పిల్లగాని సదువు ఏంటిదో నాకు తెల్వదు మామా! టివిలో వార్తలు సదువుతాడట! ఊరు ఎములాడ దగ్గర హన్మాజిపేట” చెప్పిండు కొండయ్య. “సరే నువ్వెల్లు అరగంటలో వచ్చేస్తా! ఆయన్ని పంపించేశా.

నేను రెడీ అయ్యి వెళ్లేసరికి అందరూ ఎదురు చూస్తూన్నట్లుగా అక్కడి వాతావరణాన్ని బట్టి నా కనిపించింది. ఏమైంది అన్నా! అందరూ మౌనంగా ఉన్నారు. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అన్నాను.” “అన్నా! నీ కోసమే ఎదురు చూస్తున్నామే” అన్నాడు లక్ష్మణ్. అయ్యో! నా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు? మీరు మాట్లాడక పోయారా?” అన్నా. “మీరు చదువుకున్నోల్లు! మళ్ళీ టీచర్ కదా? పిల్లవాడి సదువు సందె గురించి, జీతం ఎంత? పిల్లని సాదగల్గుతడా?! గివన్ని మీరైతే మంచి గడుగుతరు.” అంది ఓ ఆడపడుచు. “సరేసరే! అందరు చాయలు తాగిండ్రా?!”అన్నాను. అందరం తాగినం! మీరే తాగాలి. పోరీ లచ్చిమి. సార్‌కి చాయ్ గరమ్ జేసుకరా!” పెద్దమ్మ మాటకి లక్ష్మి వంటగదిలోకి చాయపెట్టి పట్టుకొచ్చింది. చాయ్ తాగుతూ అబ్బాయితో షేక్‌హాండ్ ఇచ్చి నన్ను నేను పరిచయం చేసుకున్నాను.
సార్! నేను సిటికేబుల్‌లో న్యూస్ రీడర్‌గా చేస్తున్నాను. చదివింది కమ్యూనికేషన్. జర్నలిజంలో మాస్టర్ డిగ్రీ చేసినా! పెండ్లి అయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి ఏదైనా టివి ఛానల్‌లో చేరతాను.” స్పష్టం గా చెప్పాడు తను.

“మీ కుటుంబ నేపథ్యం ఏమిటి?” అడిగాను నేను. అమ్మానాన్న చిన్నప్పుడే పోయారు. పెద్దమ్మ దగ్గర పెరిగా! నాకు పెద్దగా ఆస్తిపాస్తులేం లేవు. నా చదువే నాకున్న ఆస్తి! అమ్మాయి నచ్చింది. కట్నకానుకల పట్టింపులేదు. ప్రభుత్వ ఉద్యోగమే కావాలంటే సంవత్సరం టైమివ్వండి గ్రూప్స్‌కి ప్రిపేర్ అయి జాబ్ సంపాదిస్తాను.” సూటిగా తన మనసులోని మాట చెప్పాడు అబ్బాయి. మళ్ళీ తనే మాట్లాడుతూ “నాకు పత్రికారంగం అన్నా విలేకరి అన్నా చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. దీంట్లో కూడా మంచి జీతాలు, మంచి గౌరవం, హోదా ఉంటుంది” నేను అడగడానికి ఏమి లేదు! అన్ని తనే అరటిపండు ఒలిచినట్లు చెప్పిండు. కొండయ్య! నీ బిడ్డ అభిప్రాయం తెల్సుకో!” అన్నాన్నేను. “ఆమె నేంది తెలుసుకునేది మామ!మన మెట్ల అంటే గట్లనే” అన్నాడు కొండయ్య. అలా అనుకోవద్దు. వాళ్ళకు మనసు వుంటుంది. వాళ్ళకి కొన్ని సొంత అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు ఉంటాయి. వాటిని గౌరవించడం మన ధర్మం! అన్నాన్నేను. ఆయన మాటలకేం సారు! నేను ఆమెని తెల్సుకుంట మీరాగుండి, జరంత!” ఓ పెద్దావిడ అమ్మాయి దగ్గరకు వెళ్ళింది. ఐదు నిముషాల తర్వాత “అమ్మాయికి ఇష్టమేనట”! చెప్పింది పెద్దావిడ.

“తాతా మేమైతే మతంల ఉన్నం. పెండ్లి మా ఆచారం ప్రకారం జరగాలి” కొండయ్య కొడుకు ప్రశాంత్ అన్నాడు. ముందు కట్నకానుకలు వరపూజ ఇవన్నీ గాని బాబు! ఎంగేజ్‌మెంటు రోజు పెళ్ళి ఎక్కడ ఏ ఆచారం ప్రకారం చేసుకునేది మాట్లాడుకుందాం.” సరేనా అన్నాను. “సరే తాతయ్య? కాదనను. ఏదున్నా ముందే మాట్లాడుకుంటే మంచిది అని నా ఉద్దేశ్యం!” అన్నాడు ప్రశాంత్. “పెండ్లి అయిన తర్వాత మా పిల్ల మా మతంలోనే ఉంటుంది. పిల్లవాడు అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టకూడదు.

ఓ ఆడపడుచు లేచి కల్పించుకుంది. “ముందుగా అబ్బాయి బాప్తిజం తీసుకోవాలి? ఆ తర్వాతే పెళ్ళి! ఓ భక్తురాలి నమ్మకం. అబ్బాయి అందరి మాటలు విన్నాడు. తన అభిప్రాయం చెప్పాడు. ఆమెకి నచ్చిన మతాన్ని ఆమె అనుసరించడానికి నాకు ఎలాంటి ఆక్షేపణ లేదు. కాని పెండ్లి ఏ ఆచారం ప్రకారం జరగాలనేది మేము కొంత విచారించుకుంటాం! మా మిత్రులు, బంధువుల్ని అడిగి చెబుతా! ఎందుకంటే తరతరాలుగా ఇందులో కల్సిపోయినం. కష్టనష్టాలన్ని భరించినం! బయటికి రావాలంటే కొంత ఇబ్బందిగానే ఉంటుంది”అన్నాడు.
“అబ్బాయి కూడా పెండ్లి తర్వాత మా మతాచారాన్ని పాటించాలి ..ఆయన కిష్టమేనా?”? సూటిగా అన్నాడు ప్రశాంత్. అనుభంలేని కుర్రాడి మాటలు అలానే ఉంటాయి. ‘ప్రశాంత్!ఏ మతాచారాన్ని పాటించాలో ఆయన వ్యక్తిగతం. ఆయనని శాసించే అధికారం నీకు లేదు. నీవు పుట్టినపుడు ఏ మతం? ఏ కులం? మీ తల్లిదండ్రులు చెబితేనేకదా తెలిసింది. అలాంటప్పుడు మీ సంఘం నుండి సంబంధం వెతుక్కోవల్సింది. ఇపుడు మా మతంలోకి మారాలనడం మూర్ఖత్వం!”ఆవేశంగా అన్నాన్నేను. తాతయ్య! నేను ముందు అలానే అన్నాను మన మతానికి చెందిన సంబంధాలనే చూడమన్నాను. కాని అన్నయ్య ఫ్రెండ్! మంచి వాడు అని వీళ్లే అమ్మాయి జోక్యం చేసుకుంది. చివరికి ఇలా మతాచారం అంటూ మనసు విరిచేస్తున్నారు. తన ఆవేదన వెలిబుచ్చింది అమ్మాయి.
“పెండ్లి ఎలా జరిగితేనేం కల్సి ఉండడం ముఖ్యం గాని’ నేను జోక్యం చేసుకోక తప్పలేదు. ఇంకా “ఓ ప్రముఖ క్రికెటర్, ఓ సినీనటుడు రెండు మత సంప్రదాయాల ప్రకారం పెళ్ళిల్లు చేసుకున్నారు. వాళ్ళకు ఏ గొడవ రాలేదు. మనుష్యుల్ని, మనసుల్ని కలిపేది సమాజ హితం కోరేది మతం గాని, విడగొట్టేది, సమాజంలో చిచ్చుపెట్టేది మతం ఎంత మాత్రం కాదు” ఆవేశంతో అన్నాను.
“సార్!! చిన్నప్పుడు మీరు కూడా చర్చికి వెళ్ళినట్లు గుర్తు”ఓ అక్కయ్య అంది. “అవునక్కా! నేను టెన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు చర్చికి వెళ్ళినాను. ఇంటర్‌లో ఉన్నపుడు ముస్లిం మిత్రులతో ఖురాన్ చదివిన. డిగ్రీలో చదువుతున్నప్పుడు మెహర్‌బాబా సెంటర్‌కి వెళ్ళేవాణ్ణి. శనివారం వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్ళి భజన చేసేవాన్ని. గురువారం సాయిబాబా గుడికి వెళ్ళేవాన్ని. మంచిని చెప్పేవాళ్ళంతా దేవుళ్ళు అయినారు. అంతెందుకు ప్రతాపరుద్రుడు అనే రాజును ఎదిరించి తమ గూడెంని కాపాడిన గిరిజన వనితలు సమ్మక్క సారలమ్మలు ఇప్పుడు ఎంతో మందికి ఆరాధ్యదేవతలు. మహాత్ములు అనబడేవారు అనుసరించిన మార్గమే మతం. మనం ఆ మతాన్ని అవలంబిస్తున్నామంటే వారు ఏర్పర్చిన నియమాలు, కట్టుబాట్లు, ఆచారసాంప్రదాయాలు తూ.చ. తప్పకుండా పాటించాలి. ఏ మతంలో ఉందా?! తోటి వారిని హింసించండి, చంపండి, కొట్టుకోండి అని. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించండి అన్నాడు ఏసుక్రీస్తు. కానీ మనం అన్యమతస్తుల్ని ద్వేషిస్తున్నారు. తల్లిదండ్రుల్ని ప్రేమించని, సేవించని వాడు దేవుని పూజకు అనర్హుడు అని అభిప్రాయం. మతం అంటే ఓ మార్గం ఒక నియమం. దేవుని చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అవే ఈ మతాలు. చెట్టు ఉంది. దానికి కాండం, వేళ్ళు, కొమ్మలు, ఆకులు ఇవన్నీ ఉంటాయి. అన్నీ ఉంటేనే దాన్ని చెట్టు అంటాం. దేవుడు చెట్టు అయితే శాఖోపశాఖలు మతాలు అంతే…”నా ఉపోద్ఘాతానికి ఖిన్నుడై అబ్బాయి లేచివచ్చి కరచాలనం చేసి కౌగిలించుకున్నాడు. “వండర్ ఫుల్ సార్! అద్భుతంగా చెప్పారు. నా అభిప్రాయం కూడా ఇదే? మతానికి కాదు మనిషికి, మానవత్వానికి మనం, తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. గుడిమెట్ల మీద అన్నార్తులకి 10 పైసలు విదల్చని భక్తుడు దేవుని హుండిలో పదివేల కట్టలు వేస్తే ఏం ప్రయోజనం సార్!?”

“థాంక్స్ బాబు! నా పిల్లలకి తొమ్మిదో తరగతి వరకు కులం అంటే ఏమిటో తెలియదు. ఎవరో అబ్బాయి వాళ్ళ స్కూల్‌లో మీరు ఎస్‌సిలు దూరంగా ఉండు అంటూ ఎగతాళి చేస్తే మా పాప ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది. అమాయకంగా “ఎస్‌సిలు అంటే ఏంటి డాడీ?! చింటుగాడు అందరిముందు నన్ను ఇన్‌సల్ట్ చేసిండు. మనం ఎవరిని టచ్ చేయొద్దా డాడి?! టచ్ చేస్తే ఏమవుతుంది?! “కన్నీళ్ళు జలజలా రాలుస్తూ ఆమె అడిగిన ప్రశ్నలకు నేను జవాబు చెప్పలేకపోయాను. అప్పటినుండి ఆమెకి అంబేద్కర్ విద్యార్థిగా పడిన అవమానాలు కష్టాలు విపులంగా చెప్పేవాడిని. “కులరహిత సమాజం కావాలి” డాడి అంటుంది ఇప్పుడు. ఆమె ఇప్పటికి కూడా ఏ గుడికి వెళ్ళదు తెలుసా!? కులం అడిగితే మానవ కులం అంటుంది’ ఇద్దరం కాసేపు నవ్వుకున్నాం. అందరు నిర్ఘాంతపోయి మమ్మల్నే చూస్తున్నారు. “సారీ తాతయ్యా!”ప్రశాంత్‌లో కొంత పశ్చాత్తాపం కనబడింది.
అబ్బాయి లేచి నిల్చున్నాడు. “నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఎవరికోసమో నేనీ పెళ్ళి చేసుకోవడం లేదు. నాకోసం నాకో తోడు కావాలని, కల్సి జీవించాలని ఈ పెండ్లి చేసుకుంటున్నాను. సంప్రదాయం ఏదైనా, మతాచారమేదైనా మా మనసులు కలవనిదే ఏ మతం, ఏ సంప్రదాయం మమ్మల్ని కలిపి ఉంచలేదు. నేను రిజిష్టర్ మ్యారేజి చేసుకోవాలనుకుంటున్నాను. అందరికి ఆదర్శంగా, ఏ ఖర్చు లేకుండా బాజాభజంత్రీలు, పూజారులు, పెళ్ళి మంత్రాలు ఇవేవి లేకుండా సింపుల్‌గా కోర్టులో దండలు మార్చుకుంటాం. ఈ పెండ్లికి అయ్యే ఖర్చు లెక్కించి అనాధపిల్లలకి అందచేస్తాం. వృధా ఖర్చు అరికట్టి నట్లవుతుంది. అనాధ పిల్లల్ని ఆదుకున్నట్లు ఉంటుంది. ఈ నా నిర్ణయం మీ అందరికి ఆమోదం అయితే నాకు ఫోన్ చేయండి సరిగ్గా 24 గంటలు టైం ఇస్తున్నాను. ఆ తర్వాత నా ఫోన్ స్విచ్‌ఆఫ్ అవుతుంది. అబ్బాయి స్థిరమైన నిర్ణయానికి అందరూ నోరెళ్ళబెట్టి అలానే చూస్తుండి పోయారు. అందరికి చేతులెత్తి వందనాలు చెబుతూ తన ఎడమకాలిని గడప బయటపెట్టి నిష్క్రమించాడు. ఆనాడు బుద్ద భగవానుడి మహాభినిష్క్రమణ ఘట్టాన్ని తలపింపచేస్తూ…!

మల్లారపు రాజు

9014925716

Comments

comments