మళ్లీ పాత కథే..

India lost the fourth Test against England

తీరు మారని టీమిండియా

మన తెలంగాణ/ క్రీడా విభాగం: విదేశి గడ్డపై పేలవమైన ప్రదర్శనను టీమిండియా మరోసారి బహిర్గతం చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఘోర పరాజయం చవిచూసింది. ఈ ఓటమితో ఒక టెస్టు మిగిలివుండగానే సిరీస్‌ను కోల్పోయింది. బౌలర్లు అసాధారణ పోరాట పటిమతో భారత్‌కు మ్యాచ్‌లో మెరుగైన స్థితిలో ఉంచారు. అయితే ఎప్పటిలాగే బ్యాటింగ్ వైఫల్యం టీమిండియాను వెంటాడింది. పేలవమైన ఆటతో గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా చేజార్చుకుంది. అంతేగాక సిరీస్‌ను కూడా కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమికి బ్యాటింగ్ వైఫల్యం ప్రధాన కారణంగా చెప్పాలి. రెండు రోజుల ఆట ఉన్న సమయంలో 245 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడం కష్టమేమి కాదు. అయితే భారత ఆటగాళ్లు నిర్లక్షంగా ఆడి మ్యాచ్‌ను గెలిచే అరుదైన అవకాశాన్ని చేజార్చుకున్నారు. తొలి టెస్టులో కూడా స్వల్ప లక్ష్యాన్ని సైతం చతికిల పడిన కోహ్లి సేన నాలుగో టెస్టులోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించింది. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో అవమానకర రీతిలో పరాజయం పాలై కోట్లాది మంది అభిమానులను నిరాశలో ముంచెత్తింది. భారత జట్టు ప్రదర్శనపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యర్థిని తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసే అవకాశం లభించినా దాన్ని సద్దినియోగం చేసుకోవడంలో బౌలర్లు విఫలమయ్యారు. వందలోపే ఆరు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ తర్వాత మరో 150 పరుగులు చేసింది. దీనికి చివరి వికెట్లను తీయడంలో భారత బౌలర్ల వైఫల్యం మరోసారి కొట్టోచ్చినట్టు కనిపించింది. త్వరత్వరగా వికెట్లు తీసి ఉంటే ఇంగ్లండ్ ఒత్తిడికి గురయ్యేది. అయితే చివరి వరుస వికెట్లను తీయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. దీంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో గౌరవప్రద స్కోరును అందుకుంది.

అదే తడబాటు..
బ్యాటింగ్‌లో మరోసారి భారత్ బలహీనత బయటపడింది. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన ఆనందాన్ని బ్యాట్స్‌మెన్ నీరుగార్చారు. చటేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లి తప్ప మిగతావారు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో భారత బ్యాటింగ్ లైనప్ మరోసారి తక్కువ స్కోరుకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యాన్ని సాధించి ఇంగ్లండ్‌ను ఒత్తిడికి గురి చేసే అవకాశాన్ని భారత్ చేజేతులా కోల్పోయింది. నిలకడలేని బ్యాటింగ్‌తో భారత్‌కు ఈ పరిస్థితి నెలకొంది. ఓపెనర్లు శిఖర్ ధావన్, కెఎల్.రాహుల్‌లు పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచారు. మెరుగైన శుభారంభం అందించడంలో విఫలమయ్యారు. వీరి వైఫల్యం జట్టును వెంటాడింది. వీరిద్దరూ మెరుగైన ఆరంభాన్ని అందించి ఉంటే మ్యాచ్‌లో భారత్ పరిస్థితి మరోలా ఉండేది. అయితే రాహుల్, ధావన్‌లు ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి ఎదురు నిలువలేక పోయారు. జట్టుకు శుభారంభం అందిస్తారని భావించిన ఇద్దరు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరి నిరాశే మిగిల్చారు. వైస్ కెప్టెన్ అజింక్య రహానె తన పేలవమైన ప్రదర్శనను మరోసారి కొనసాగించాడు. జట్టుకు అండగా నిలువడంలో విఫలమయ్యాడు. రహానె వైఫల్యం జట్టుపై తీవ్ర ప్రభావాన్నే చూపింది. పుజారా అజేయ శతకం సాధించి ఉండక పోతే తొలి ఇన్నింగ్స్‌లో భారత్ మరింత తక్కువ స్కోరుకే పరిమితం అయ్యేదని చెప్పడంలో సందేహం లేదు. పుజారా అసాధారణ బ్యాటింగ్ వల్లే భారత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకుంది. కోహ్లి కూడా మెరుగ్గానే ఆడినా భారీ ఇన్నింగ్స్ నమోదు చేయలేక పోయాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఆల్‌రౌండర్లు అశ్విన్, హార్ధిక్ పాండ్యలు కూడా విఫలమయ్యారు. టాప్ ఆర్డర్, మిడిలార్డర్ చేతులెత్తేయడంతో ఇంగ్లండ్‌పై భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించడంలో టీమిండియా విఫలమైంది.

అదే తీరు…
రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఓపెనర్లు ధావన్, రాహుల్‌లు మరోసారి చేతులెత్తేశారు. ఇద్దరు చెత్త ప్రదర్శనను కొనసాగిస్తూ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. ఈ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు మెరుగైన ఆరంభాన్ని ఇస్తారని ఆశిస్తే నిరాశే మిగిలింది. చెత్త ఆటతో ఆశలపై నీళ్లు చల్లారు. ఇటు రాహుల్, అటు ధావన్‌లు వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో భారత్‌కు మరోసారి పేలవమైన ఆరంభం దక్కింది. ఇక, తొలి ఇన్నింగ్స్‌లో అజేయ శతకంతో జట్టుకు అండగా నిలిచిన మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా చెత్త ఆటతో నిరాశ పరిచాడు. అతను తక్కువ స్కోరుకే ఔట్ కావడం భారత్ విజయవకాశాలను ప్రభావితం చేసింది. ఈ దశలో కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రహానెలు నిలకడైన బ్యాటింగ్‌ను కనబరచడంతో భారత్ మళ్లీ గాడిలో పడినట్టే కనిపించింది. కానీ, వీరిద్దరూ కీలక సమయంలో ఔట్ కావడంతో జట్టు సమస్య మళ్లీ మొదటి కొచ్చింది. పాండ్య, పంత్, అశ్విన్, షమి తదితరులు తక్కువ స్కోరుకే ఔట్ కావడంతో భారత్‌కు ఘోర పరాజయం తప్పలేదు.

విమర్శల వెల్లువ..
గెలిచే మ్యాచ్‌లో ఓటమి పాలుకావడంతో టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విదేశాల్లో గెలవలేమనే చెత్త రికార్డును భారత్ మరోసారి మూట గట్టుకోవడంపై నెటెజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లి, రాహుల్, ధావన్, హార్దిక్, పుజారా, రహానె, రిషబ్, అశ్విన్ తదితరులతో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియా స్వల్ప లక్ష్యాన్ని సైతం అందుకోలేక పోవడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. చెత్త ఆటతో దేశ పరువును తీశారని దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదే సమయంలో ప్రధాన కోచ్ రవిశాస్త్రిపై సైతం విమర్శలు చేశారు. జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో శాస్త్రి పూర్తిగా విఫలమయ్యాడని, అతన్ని తప్పించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.

Comments

comments