మళ్లీ జోరందుకుంది..

Foreign investors invest in the domestic capital market

భారత్ వైపు విదేశీ ఇన్వెస్టర్ల చూపు                                                                                                                        ఆగస్టులో భారీగా రూ.6700 కోట్ల పెట్టుబడులు
ఏప్రిల్ జూన్‌లో రూ.61 వేల పెట్టుబడులు వెనక్కి                                                                                                    జూన్ నుంచి పుంజుకున్న పెట్టుబడుల ప్రవాహం
మెరుగైన స్థూల గణాంకాలు, క్యూ1 ఫలితాలే కారణం                                                                                                    రెండో త్రైమాసికంపైనా ఇన్వెస్టర్లు బుల్లిష్

న్యూఢిల్లీ : విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌పై ఎంతో ఆశాభావంతో ఉన్నారు. దేశీయ మూలధన మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఆగస్టు మొదలు ఇప్పటి వరకు రూ.6700 కోట్లు మేరకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐ) ఇన్వెస్ట్ చేశారు. స్థూల ఆర్థిక గణాంకాలు, తొలి త్రైమాసిక(క్యూ1) ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ భారత్‌లో పెట్టుబడుల వైపు మొగ్గుచూపుతున్నారు. అయి తే గత నెల జూలైలో ఈక్విటీ, డెబిట్ మూలధన మార్కెట్లలో రూ.2,300 కోట్లకు పైగా విదేశీ పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు ఏప్రిల్ జూన్ కాలంలో రూ.61 వేలకు పైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఇన్వెస్టర్లు ప్రస్తుతం భారత్ పట్ల ఆసక్తితో ఉన్నారు. తాజా గా డిపాజిటరీ గణాంకాల ప్రకారం, ఈ నెల 1 నుంచి 24వరకు ఈక్విటీల్లో విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,048 కోట్లు, డెబిట్ మార్కెట్లోకి రూ.4,662 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, మొత్తం విలువ రూ.6,710 కోట్లకు చేరింది.

ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల వ్యవధిలో అవుట్‌ఫ్లో(పెట్టుబడులు వెనక్కి వెళ్లడం)ఎక్కువగా ఉంది. అయితే జూలై,ఆగస్టులో విదేశీ పెట్టుబడులు మళ్లీ రావడం ప్రారంభించాయి. మార్నింగ్‌స్టార్ సీనియర్ అనలిస్ట్ హిమాన్షు శ్రీవాత్సవ మాట్లాడుతూ, స్థూల ఆర్థిక గణాంకాలు,మెరుగైన కార్పొరేట్ త్రైమాసిక ఫలితాల కారణంగా ఇటీవల విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరిగిందని అన్నారు. మిడ్, స్మాల్ క్యాప్ సూచీల్లో దిద్దుబాటు, భారత్‌పై ఐఎంఎఫ్(ఇంటర్నేషనల్ మోనెటరీ ఫండ్)సానుకూల దృక్పథం కూడా విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌పై ఆసక్తి చూపడానికి కారణమయ్యాయని అన్నారు.ప్రస్తుతం సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయని,అయితే గతం తో పోలిస్తే ఇన్‌ఫ్లో పరిమాణం తక్కువగానే ఉందని అన్నారు. విదేశీ ఇన్వెస్ట్ మెంట్లు పెరగడం, ఇతర కారణాల వల్ల మార్కెట్లు కూడా జోష్‌లో ఉన్నాయి. నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు జీవితకాల గరిష్టాలకు చేరుకున్నాయి. నిఫ్టీ 11 వేల మార్క్‌కు చేరువ అవుతోంది. క్యూ2పై సానుకూలంగా ఉండడంతో పెట్టుబ డుల వరద ఉండనుందని నిపుణులు అంటున్నారు.

విదేశీ ఇన్వెస్టర్లకు ఒకే ఫారమ్

దేశీయ మూలధన మార్కెట్లోకి ప్రవేశించేందుకు విదేశీ ఇన్వెస్టర్లకు ఒకే దరఖాస్తు ఫారమ్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సులభతర వ్యాపారం మెరుగు పరిచే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఈ విధానం ప్రారంభించింది. ఇంతకుముందు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ వద్ద రిజిస్టర్ చేసుకునేందుకు ప్రత్యేక ఫారమ్‌ను విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐ) దాఖలు చేసేవారు.  దీంతో పాటు వారు బ్యాంక్ ఖాతాను తెరిచేందుకు బ్యాంకును సంప్రదించే వారు, అలాగే పాన్ కార్డు కోసం ఆదాయం పన్ను శాఖను సంప్రదించే వారు. ఇక డిమ్యా ట్ ఖాతా కోసం మార్కెట్ మధ్యవర్తులను ఆశ్రయించేవారు. 201718 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విదేశీ పెట్టుబడిదారుల కోసం ఒకే దరఖాస్తు ఫారమ్ విధానాన్ని తీసుకొస్తామని, సులభతర వ్యాపారానికి అనువుగా ఉండేందుకు ఈ సౌలభ్యం కల్పించనున్నామని అన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఫారమ్ ద్వారా రిజిస్ట్రేషన్, బ్యాంక్ ఖాతా ఓపెనింగ్, పాన్ కార్డు, డిమ్యాట్ ఖాతాలను ఒకేసారి తెరవొచ్చు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సింగిల్ ఫామ్ విధానంతో విదేశీ ఇన్వెస్టర్లకు సమయం ఆదా అవుతుంది. ఈ సింగిల్ ఫారమ్‌ను సెబీ, ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్), సిబిడిటి(కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు)లు సంయుక్తంగా రూపొందించాయి. గతవారం సెబీ విదేశీ ఇన్వెస్టర్లకు గడువును డిసెంబర్ వరకు పొడిగించింది.