మళ్లీ కెసిఆరే సిఎం

హిందువులకు ఎంతో మేలు చేశారు, దేశానికే ఆయన ఆదర్శం : వ్రతధర జీయరు స్వామి 

Swamy

హైదరాబాద్: హిందూ ధర్మరక్షణ ధ్యేయంగా, సనాతన ధర్మ రక్షణ లక్షంగా శ్రమిస్తున్న కె.చంద్రశేఖర్ రావు మరోసారి ముఖ్యమంత్రి అవుతారని, పంచాంగం ప్రకారం ఆయనకు అనుకూల అవకాశాలు ఉన్నాయని అఖిలభారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు శ్రీరామానుజ వ్రతధర జీయరు స్వామి వ్యాఖ్యానించారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించడం తెలంగాణ ప్రజల అదృష్టమని, దేశంలో ఎక్కడా లేని విధంగా ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, ఆయనకు దేశ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొన్నారు. అద్వితీయంగా నిర్వహించిన ఆయత చండీయాగం యావత్తు హైందవ సమాజాన్ని ఆకట్టుకుందని, భక్తిశ్రద్ధలతో లోకకల్యాణం ఉద్దేశంతో నిర్వహించిన ఈ మహాయాగం సనాతన ధర్మ పరిరక్షణకు దోహదపడిన అపూర్వఘట్టమని ఒక ప్రకటనలో రామానుజ వ్రతధర జీయర్ ప్రశంసించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీకి పూర్తి మద్దతు ఇవ్వడంతో పాటు  ప్రచార కార్యక్రమాల్లో అఖిల భారత హిందూ మహాసభ శ్రేణులు పాల్గొంటాయని ఆయన ప్రకటించారు. సుమారు వేయి కోట్ల రూపాయలతో యాదాద్రి దేవస్థానాన్ని దివ్యక్షేత్రంగా నిర్మిస్తూ, భద్రాచలం, వేములవాడ, బాసర తదితర క్షేత్రాలను అభివృద్ధి చేస్తుండటంతోపాటు పురాతన దేవాలయాల పునరుద్ధరణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి తెలంగాణలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పునరుద్ధరించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును ప్రజలంతా ఆశీర్వదిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణను కేంద్రంగా చేసుకుని అనేక రాజవంశాలు నిర్మించిన ఆలయాలను ముఖ్యమంత్రి కెసిఆర్ పునరుద్ధరించడంతో పాటు ప్రతీ ప్రాచీన ఆలయానికి ధూప దీప నైవేద్య పథకంలో భాగంగా ప్రతీ నెలా ఆరు వేల రూపాయలు ఇస్తూ ధార్మికతను ప్రబోధిస్తున్న ప్రజా నేత కెసిఆర్ అంటూ కొనియాడారు. భారతీయ సంస్కృతి పరిరక్షణకు జవసత్వాలను కలిగించడంతో పాటు హిందూ సమాజానికి మేలుచేసే అనేక కార్యక్రమాలను కెసిఆర్ అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. స్వామిజీలు, పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలను ఆయత చండీయాగం, పుష్కరాలు, ఇతర ధార్మికోత్సవాల్లో గౌరవిస్తూ హిందూ మత వైభవాన్ని చాటిన కెసిఆర్ ను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించడం ప్రజల బాధ్యతగా గుర్తించాలని, తమ సంస్థ తరఫున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని స్పష్టం చేశారు. ధార్మిక సందేహాలను స్వామిజీల ద్వారా తీర్చుకునే మంచి సంప్రదాయాన్ని కెసిఆర్ ప్రతిష్టించారన్నారు. హిందూ పండుగలకు అధిక నిధులు కేటాయిస్తూ ప్రభుత్వ పక్షాన పండుగలను నిర్వహించే సంప్రదాయాన్ని తీసుకురావడం ప్రశంసనీయమని కొనియాడారు. హిందూ సమాజానికి పెద్ద దిక్కుగా, గొప్ప దార్శనికుడిగా ప్రజల మన్నలను అందుకుంటున్న కెసిఆర్‌కు, టిఆర్‌ఎస్ పార్టీకి పూర్తి మద్దతును ప్రకటిస్తున్నట్లు ప్రకటించారు.
రాబోయే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఘనవిజయం సాధించడంతో పాటు ముఖ్యమంత్రిగా కెసిఆర్ మరోసారి ఎన్నికై దేశానికి ఆదర్శం కావాలని అకాంక్షించారు. ధర్మ రాజ్య దిశగా తెలంగాణను తీర్చిదిద్దుతున్న టిఆర్‌ఎస్ పార్టీకి, కె.చంద్రశేఖర్ రావుకు మద్దతుగా హైందవ సమాజం పూర్తిస్థాయిలో కృషి చేయాలని అఖిల భారత హిందూ సభ పక్షాన శ్రీరామానుజ వ్రతధర జీయర్ పిలుపునిచ్చారు. టిఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావును దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకుని ధర్మ పరిరక్షణకు కంకఁబద్దులు కావాలని ఆయన అకాంక్షించారు.

Comments

comments