మల్టీస్టారర్ ‘వెంకీ మామ’

venky

టాలీవుడ్‌లో ఉన్న కొన్ని పెద్ద ప్రొడక్షన్ బ్యానర్‌లలో లెజెండరీ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ ఒకటి. ఆయన తదనంతరం దాని బాధ్యతలను సురేష్‌బాబు స్వీకరించి సినిమాలు నిర్మిస్తున్నారు. గత కొంతకాలంగా ఈ బ్యానర్‌లో ఒక్క పెద్ద సినిమా కూడా తీయకపోవడంతో ప్రేక్షకులు ఆలోచనలో పడ్డారు. ఈ విషయాన్ని సురేష్‌బాబును అడిగితే త్వరలో ఒక పెద్ద సినిమాకు శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. తాజాగా చిన్న సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’తో పెద్ద  హిట్టు కొట్టిన సురేష్ ప్రొడక్షన్స్ ఇప్పుడు ఒక పెద్ద సినిమా తీయడానికి సిద్ధమవుతోంది. వెంకటేష్, నాగచైతన్యతో ఓ మల్టీస్టారర్ మూవీని నిర్మించబోతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ సినిమాకు ‘వెంకీ మామ’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు తెలిసింది. సురేష్ ప్రొడక్షన్స్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తామని డి.సురేష్‌బాబు తెలిపారు. ఇటీవల సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో చిన్న సినిమాలు మాత్రమే వస్తున్నాయన్న కామెంట్‌పై ఆయన స్పందిస్తూ… “మా బ్యానర్‌లో ఇకనుంచి విభిన్న కథా చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. త్వరలో వెంకటేష్, నాగచైతన్యలతో ఓ మల్టీస్టారర్‌ను తెరకెక్కించబోతున్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ తరహా సినిమాలు మాత్రమే ఆడతాయి అని ఎవరూ చెప్పలేరు. బాహుబలి హిట్ అయింది కాబట్టి పెద్ద సినిమాల వెనుక పడుతున్నారు. అది ఫ్లాప్ అయి ఉంటే ఎవరూ పెద్ద సినిమాల జోలికి వెళ్లేవారు కాదు. సంతోషాన్నిచ్చే, లాభాలు తెచ్చిపెట్టే సినిమాలు తీయాలి”అని సురేష్‌బాబు పేర్కొన్నారు.

Comments

comments