మరీ ఇంత చులకనా

నివేదికలు ఉండవు- అధికారులు రారు ప్రాధాన్యత కోల్పోతున్న జెడ్పి పాలక మండలి సమావేశం అధికారులది, ప్రజాప్రతినిధులది అదే తీరు ప్రశ్నించలేని స్థితిలో విపక్షం  ఒకప్పుడు జిల్లా పరిషత్ సమావేశం అంటే ప్రజాప్రతినిధులు, అధికారులు అత్యంత ప్రాధాన్యత గల అంశంగా పరిగణించే వారు. సమస్యలపై అధికార పార్టీ ప్రతినిధులు సమాచారం తెప్పించుకుని అధ్యయనం చేసేవారు. విపక్ష సభ్యులు సమస్యలను సమావేశం దృష్టికి తెచ్చి పరిష్కారం కోసం పట్టుపట్టేవారు. అధ్యక్ష స్థానంలో ఉన్న వారు సభ్యులు ప్రస్తావించిన సమస్యలపై అధికారుల […]

నివేదికలు ఉండవు- అధికారులు రారు
ప్రాధాన్యత కోల్పోతున్న జెడ్పి పాలక మండలి సమావేశం
అధికారులది, ప్రజాప్రతినిధులది అదే తీరు
ప్రశ్నించలేని స్థితిలో విపక్షం 

ఒకప్పుడు జిల్లా పరిషత్ సమావేశం అంటే ప్రజాప్రతినిధులు, అధికారులు అత్యంత ప్రాధాన్యత గల అంశంగా పరిగణించే వారు. సమస్యలపై అధికార పార్టీ ప్రతినిధులు సమాచారం తెప్పించుకుని అధ్యయనం చేసేవారు. విపక్ష సభ్యులు సమస్యలను సమావేశం దృష్టికి తెచ్చి పరిష్కారం కోసం పట్టుపట్టేవారు. అధ్యక్ష స్థానంలో ఉన్న వారు సభ్యులు ప్రస్తావించిన సమస్యలపై అధికారుల నుంచి సమాధానం చెప్పించేందుకు ప్రయత్నించే వారు. అధికారులు జిల్లా పరిషత్ సమావేశమంటే పూర్తి సమాచారంతో వచ్చే వారు. ముందుగానే నివేదికలు ఇచ్చే వారు. జిల్లా పరిషత్ పాలక వర్గ సమావేశ నివేదిక అంటే పూర్తి సమాచారం ఉండేది. నివేదిక వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేది. ఇప్పుడు పరిస్థితి పూర్తి విరుద్దం. నివేదికలు అందజేసే తీరిక అధికారులకు లేదు. సమావేశంలో పాల్గొనే తీరిక ప్రజాప్రతినిధులకు లేదు. నిధులు లేక నీరసపడటమే కాదు మరీ చులకనైపోయింది.

మన తెలంగాణ/ఖమ్మం : జిల్లా పరిషత్ సమావేశం రాను రాను ప్రాధాన్యతను కోల్పోతుంది. కాదు చులకనైపోతుంది. అత్యంత ప్రాధాన్యత గల సమావేశం మొక్కుబడిగా సాగుతుంది. ప్రజాప్రతినిధులకు, అధికారులకు పట్టింపులేకుండా పోతుంది. ఏదో జరపాలి కాబట్టి జరుపుతున్నాం అన్నట్లుంది చైర్‌పర్సన్, అధికారుల తీరు. అధికారులు హాజరు కావడం లేదు. సభ్యులకు అందజేయాల్సిన నివేదికలు అందించడం లేదు. గతంలో రెండు రోజుల పాటు జరిగే సమావేశాలు కొద్ది గంటలకే పరిమితమవుతున్నాయి.

హాజరు కానీ ప్రజాప్రతినిధులు : జిల్లా పరిషత్ సమావేశానికి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్లమెంటు సభ్యులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు విధిగా హాజరయ్యే వారు. జెడ్పిటిసి, ఎంపిపిల హాజరు అంతంత మాత్రంగానే ఉంటే కొందరు ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సిలు సమావేశ మందిరం ముఖం చూడటమే మానేశారు. శాసన సభ్యుల్లో పువ్వాడ అజయ్‌కుమార్, సండ్ర వెంకటవీరయ్య, శాసన మండలి సభ్యుల్లో పొంగులేటి సుధాకర్‌రెడ్డి మినహా మిగిలిన వారు సరిగ్గా హాజరు కావడం లేదు. మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు మొత్తం నాలుగేళ్లలో ఒకట్రెండు సార్లు మాత్రమే హాజరు కాగా కొందరు ఎంఎల్‌సిలు జిల్లా పరిషత్ సమావేశాలను మరచిపోయి చాలా కాలమైంది.

అదే బాటలో అధికారులు : ప్రజాప్రతినిధుల బాటలోనే అధికారులు నడుస్తున్నారు. జిల్లాల విభజన తర్వాత నాలుగు జిల్లాలుగా విభజన చేయడం జరుగగా నాలుగు జిల్లాల కలెక్టర్లు, ముఖ్య అధికారులు హాజరైన సందర్బం లేదు. గురువారం నాటి సమావేశం పరిస్థితి మరీ ఘోరం. రాజుల కాలం అయినా ప్రధానమైన రెండు జిల్లాల డిఎంఅండ్‌హెచ్‌వోలు హాజరు కాలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సంబంధించి అసలు నివేదికే అందకపోవడం గమనార్హం. పోడు భూములకు సంబంధించి సభ్యులు పలు ప్రశ్నలు అడిగినా కనీస సమాధానం చెప్పించే ప్రయత్నం చేయలేదు. అధికారులను ప్రశ్నించడానికి కూడా అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. అధికారులు హాజరు కారు అయితే పూర్తి సమాచారం ఉండదు ఇది ప్రతి సమావేశంలోనూ జరుగుతున్న తంతు.

విపక్షం విఫలం : అధికారులను ప్రశ్నించి సమాచారం రాబట్టడంలో విపక్షం విఫలమవుతుంది. సంఖ్యాబలం తక్కువగా ఉండడం వల్ల ఏం అడిగినా ఏం లాభం లేదు అనుకుంటున్నారో తెలియదు కానీ సరైన రీతిలో విపక్షం వ్యవహరించడం లేదు. కొందరు సభ్యులు సన్నాయి నొ క్కులు నొక్కుతున్నారు. బాగా లేదంటూనే బాగుందంటున్నారు. విపక్షంలోనూ అడ్డదిడ్డంగా ఏదో ఒకటి మాట్లాడి అవతల పడదాంలే అన్న విధంగా కొందరు నేతలు వ్యవహారిస్తున్నారు. ఇక అధికారుల తీరు మాత్రం ప్రశ్నలకు సమాధానం చెప్పేవిధంగా లేదు. ఎవరు ఏం అడిగినా తాము చెప్పాలనుకున్నది చెప్పి కూర్చుంటున్నారు.
నిధులు లేక నీరసం : కేంద్ర ప్రభుత్వ వైఖరితో జిల్లా పరిషత్‌లకు నిధుల కేటాయింపు లేకపోవడంతో నీరస పడుతున్నారు. దీనికి తోడు జవాబుదారితనం లోపించింది. జెడ్పిటిసి, ఎంపిపిలకు తమ పరిధిలోని సమస్యలను ప్రస్తావించి పరిష్కారం కనుగోనే వేదికైనా జిల్లా పరిషత్ సమావేశాలు గాడి తప్పాయి. మరో తొమ్మిది మాసాలే గడువు ఉన్నప్పటికీ పద్దతి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులు, చట్టసభల ప్రతినిధులు తమ తీరు మార్చుకుంటే సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడి ప్రజా సమస్యల పరిష్కార వేదిక అవుతుంది. లేకుంటే తూతూ మంత్ర సమావేశాలతో పాలక మండలి పదవీ కాలం ముగుస్తుంది.

Related Stories: