మన చేపల్లో ఫార్మాలిన్ లేదు

There is no formalin in fish of Telangana: Govt officials

హైదరాబాద్: చేపల్లో ఫార్మాలిన్ వాడుతున్నారని, ఇప్పటివరకు చేపలు తిని ఇక మానేద్దాం అనే ఆలోచనలో ఉన్నారా ? అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేపలు తినకూడదనే కోరికను చంపుకునే అవసరం లేదు. ఎందుకంటే మన చేపలకు ఫార్మాలిన్ వాడే ముచ్చటే లేదని, ఆరోగ్యంగా ఉండేందుకు ఎప్పటిలా మన స్వచ్ఛమైన మంచినీటి చేపలనూ ఇష్టంగా తినవచ్చునని మత్సశాఖ అధికారులు చెబుతున్నారు. మన దగ్గర ఫార్మాలిన్ సమస్య లేదని, బేఫికర్‌గా చేపలను పులుసు, ఫ్రై చేసుకుని తినొచ్చునంటున్నారు. మనం ఇలా చెరువులో పట్టగానే అలా హాట్ కేకుల్లాగా చేపలు అమ్ముడుపోతున్నాయని, మన దగ్గర ఉత్పత్తి అయ్యే చేపలను అధికంగా రాష్ట్ర ప్రజలే తింటున్నారని, కోల్‌కత్తా, నాగ్‌పూర్ వంటి ప్రాంతాలకు దిగుమతి చాలా నామమాత్రమని మత్సశాఖ అధికారులు స్పష్టం చేశారు.

ఒక వ్యవధిలోపే ఆయా ప్రాంతాలకు చేరుకుంటున్నాయని, ఇక ప్రాజెక్టులు, చెరువులు, కుంటలలో పట్టిన చేపలను పట్టణాలలోని మార్కెట్‌లకు సరఫరా చేసేందుకు మన రా ష్ట్రంలో గంటల వ్యవధిలోనే రవాణా అవుతున్నాయని మత్సశాఖ అధికారి శ్రీనివాస్ ‘మన తెలంగాణ’కు స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లేందుకు గంట కంటే ఎక్కువ సమయం పట్టదని, ఆంధ్రప్రదేశ్ నుంచి మన దగ్గరకు వచ్చే చేపలకు కూడా 12 గంటల కంటే ఎక్కువ సమయం పట్టడంలేదని, దీంతో ఫార్మాలిన్ వాడాల్సిన అవసరమే రాదని, ఎటువంటి భయం లేకుండా ఇష్టంగా చేపలు తినవచ్చునని వ్యాఖ్యానించారు. రాష్ట్రం ప్రభుత్వం ఉచిత చేప పిల్ల ల పంపిణీ చేపట్టినప్పటి నుంచి చేపల ఉత్పత్తి పెరిగిందని, ఏటా 2 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉత్పత్తి వ స్తోందని, ఇందులో మన రాష్ట్రంలోనే 70 శాతం వరకు అమ్మకాలు జరుగుతున్నాయని, 30 శాతం పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయని వివరించారు.

అనుమానమే అక్కర్లేదు: డాక్టర్ సువర్ణ
“సాధారణంగా దూర ప్రాంతాలకు పంపే చేపలకు ఫార్మాలిన్ వాడుతున్నారు. మన దగ్గర మాత్రం ఆ సమస్య లేదు. అసలు ఉత్పన్నమయ్యే అవకాశమే లేదు. ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉన్నందున ఫార్మాలిన్‌ను వాడుతున్నారు. తెలంగాణ చేపల్లోనూ ఫార్మాలిన్ అనుమానాలు అసత్య ప్రచారం మాత్రమేకాక అపోహ కూడా. ఒకవేళ ఫార్మాలిన్ అవశేషాలు ఏమైనా ఉన్నాయా? ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకునేందుకు జాతీయ కిట్స్ అందుబాటులోకి వచ్చాయి. త్వర లో వాటిని తెప్పిస్తున్నాం. వాటి ద్వారా పరీక్షించి అపోహలను నివృత్తి చేస్తాం. అసత్యాలను నిగ్గు తేలుస్తాం. మన చేపలన్నీ మంచినీళ్ళో పెరిగేవి కాబట్టి ఎలాంటి అనుమానం, భయం లేకుండా ఇష్టంగా తినవచ్చు”.