మన ఊరు మన చెరువు మన గుడి

తెలంగాణాతో సహా యావత్ దక్షిణ భారతదేశాన్ని కాకతీయులు ఒక ఊపు ఊపి  వదిలేశారు. తెలంగాణా నిండా కాకతీయుల కట్టడాలే, నిర్మాణాలే, ఈ కట్టడాలు, నిర్మాణాలు ఒక ఉద్యమంలా కాకతీయుల కాలంలో కొనసాగాయి, వరంగల్, ఖాజీపేట, హనుమకొండ, నల్గొండ, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్…. ఒకటేమిటి? అనేక చోట్ల కాకతీయుల నిర్మాణాలున్నాయి. ప్రస్తుతం తెలంగాణా ప్రభుత్వం ప్రారంభించిన మన ఊరు – మన చెరువు కార్యక్రమం కాకతీయుల కాలంలో ప్రారంభించినదే కావడం విశేషం. సప్తపుణ్య కార్యక్రమాలలో చెరువుతవ్వడం ఒక పుణ్యకార్యమని కాకతీయ రాజులు భావించారు. అదో పవిత్ర కర్తవ్యంగా నిర్వర్తించారు. పదిమంది ప్రజలు కలుసుకోవడం, మాట్లాడు కోవడం, […]

తెలంగాణాతో సహా యావత్ దక్షిణ భారతదేశాన్ని కాకతీయులు ఒక ఊపు ఊపి  వదిలేశారు. తెలంగాణా నిండా కాకతీయుల కట్టడాలే, నిర్మాణాలే, ఈ కట్టడాలు, నిర్మాణాలు ఒక ఉద్యమంలా కాకతీయుల కాలంలో కొనసాగాయి, వరంగల్, ఖాజీపేట, హనుమకొండ, నల్గొండ, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్…. ఒకటేమిటి? అనేక చోట్ల కాకతీయుల నిర్మాణాలున్నాయి.
ప్రస్తుతం తెలంగాణా ప్రభుత్వం ప్రారంభించిన మన ఊరు – మన చెరువు కార్యక్రమం కాకతీయుల కాలంలో ప్రారంభించినదే కావడం విశేషం. సప్తపుణ్య కార్యక్రమాలలో చెరువుతవ్వడం ఒక పుణ్యకార్యమని కాకతీయ రాజులు భావించారు. అదో పవిత్ర కర్తవ్యంగా నిర్వర్తించారు. పదిమంది ప్రజలు కలుసుకోవడం, మాట్లాడు కోవడం, చెరువులు తవ్వడం ఇదే పని కాకతీ యుల కాలంలో జరిగింది. మరి ఉన్నదేమో దక్కన్ పీఠభూమి, నైరుతీ రుతు పవనాలు వల్ల కురిసే ప్రతి వర్షపు చినుకును ఒడిసి
పట్టాలి, చెరువులో దాచిపెట్టాలి. దానితో రెండు పంటలు పండించుకోవాలి అన్న ముందు చూపు కాకతీయుల కాలంలో ఉండింది.

మన ఊరు – మన చెరువు -మన గుడి నినాదం కాకతీయుల కేంద్రం అయింది. సాధారణంగా ఉత్తర భారతదేశంలో నిర్మించే దేవాలయాలను నగర (Nagara) శైలి అంటారు. ఈ దేవాలయాలముందు ధ్వజస్తంభాలు, వెనుక విశాలమైన ఖాళీ స్ధలం ఉంటుంది. కానీ మన దక్షిణాది దేవాలయాలు అలాకాదు. అసలు దక్షిణాది దేవాలయాలకు ఒక సంస్కృతిని ఏర్పాటు చేసినది కాకతీయులు. దేవాలయం లేదా గుడి నిర్మించడం, నిర్మించి గుడివెనుకో, పక్కనో ఖచ్ఛితంగా కొలను కట్టించడం అనేది కాకతీయుల సంస్కృతి. ఈ కొలనులోని నీటినే సాగునీటి సంఘాల ద్వారా భూములకు నీళ్ళను మళ్ళించే వారు. కొలను నుంచి నీటిని భూములకు మళ్ళించడానికి కాలవలను సైతం కాకతీయులు తవ్వినారు. మూసేటి కాలువ, ఇమ్మడి కాల్వ, కృష్ణవేణి కాల్వ, అంతర్గతగంగ కాలువలు ఇలాంటివే. కాకతీయులకాలంలో ప్రజలు, ప్రభుత్వం చేతికి ఎముకలేకుండా చెరువులకు దానాది కార్యక్రమాలను నిర్వహించేవారు. త్రిపురాంతకం శాసనం ప్రకారం ‘కుమార సముద్రం’ అనే చెరువు నిర్మాణానికి 241 మాడలును కాకతీయులు ఖర్చు పెట్టారు. మాడ (Mada) అనగా కాకతీయుల కాలంలో బంగారునాణెం. బయ్యారం చెరువును తవ్విన మైలాంబ గణపతిదేవుని సోదరి, ఈవిడ బయ్యారం చెరువుకట్ట శాసనం వేశి, చెరువుల ప్రాధాన్యతను చెప్పకనే చెప్పింది. చెరువు మూకుమ్మడి సంపద, చెరువులో నీళ్ళుంటే తెలంగాణా ప్రజల ఆనందం అంతా ఇంతకాదు. వర్షం సకాలంలో వచ్చి చెరువు నీటితో కళ కళ లాడుతుంటే రెండు, మూడు పంటలను కాకతీయులకాలంలో పండించు కొనేవారు. కనకనే కాకతీయ రాజులు చెరువుల తవ్వకానికి విశిష్ఠ ప్రాధాన్యం ఇచ్చారు. పాలంపేట రామప్పదేవాలయం వద్ద రామప్ప
చెరువు, హన్మకొండ భద్రకాళిమాత వద్ద భద్రకాళీ చెరువు, పానుగల్లు (నల్గొండ) పచ్చల సోమేశ్వరం వద్ద చెరువు ఇలా గుడి, గుడి వద్ద చెరువు కల్చర్‌ని కాకతీయులు పెంచి పోషించారు.
కాకతీయులతో పోటీపడి, వారి సామంతులు కూడా  చెరువులు తవ్వారు, విశేషం ఏంటంటే కాకతీయుల కాలంలో సాగునీటికి ఒక చెరువు, తాగునీటికి మరో చెరువు ఇలా రెండు చెరువులు వేరు వేరుగా ఉండేవి. మరో విశిష్టత ఏంటంటే కాకతీయులు నిర్మించిన చెరువులన్నీ గొలుసుకట్టు చెరువులే, ఊరు చుట్టూ రెండు, మూడు చెరువులు, ఒక చెరువు నిండితే మరో చెరువులోకి నీరు తూములు ద్వారా తరలించబడేది రాత్రిపూట వెన్నెల్లో పౌర్ణమినాడు ఊరు చివర నీటితో నిండిన చెరువులను చూస్తే తెల్లటి తెరచాపలు గుర్తుకువచ్చేవి. బేసికల్‌గా తెలంగాణా ఊళ్ళల్లో బ్రతకాలంటే గట్స్ ఉండాలి. ప్రకృతితో పోరాడాలి. కొండల మాటున దాగిన చెరువు నీటిని వ్యవసాయానికి మళ్ళించుకోవాలి. వరుణ దేవుడు కరుణిస్తే ఒకే. కానీ కరుణించకపోతే తెలంగాణా పల్లెలు బోసిపోతాయి. గత సంవత్సరం నుంచి జరుగుతున్నదిదే! ఇందుకే ఎంతో ముందు చూపుకల కాకతీయులు అప్పుడు తవ్వించిన చెరువులు ఇప్పటికీ ప్రజలదాహర్తిని, ఆకలిని తీరుస్తూనే ఉన్నాయి. కాకతీయుల కాలంలో ఒక్కో చెరువు ఒక్కో సముద్రంలో తవ్వారు. ఇదొక అపరభగీరధ ప్రయత్నం, మెదక్‌జిల్లా, టెక్మాల్ మండలం లోని వేల్పులకొండ గ్రామంలో శివుడి నర్తనాలయం, చెరువు, గోళకీమఠం ఈ మూడు ఒకచోట ఉండి అద్భుత దృశ్యాన్ని తలపిస్తాయి. ఇక్కడ కాకతీయుల కాలంనాటి చెరువు 200 ఎకరాల్లో విస్తరించి ఉంది. చుట్టూతా నీరు మధ్యలో దేవతల కొండ, అందులో నిలువెత్తు దిగంబర వర్దమానుడి నల్లటి విగ్రహం ఇవన్నీ కాకతీయుల కాళాకట్టడాలే. తెలంగాణా ప్రభుత్వం దయచేసి ఈ వేల్పుల
కొండపై దృష్టిపెడితే, ఒక్కసారి గనక ఆ చెరువును చూస్తే మిషన్‌కాకతీయ కింద ఆ చెరువు ప్రధమ ప్రాధాన్యం వహిస్తుంది. ఒక్కసారి నీటి పారుదలశాఖ మంత్రి గారు ఆ ప్రాంతాన్ని సందర్శిస్తే అక్కడి చెరువు, ప్రజల జీవితం ధన్యమవుతుంది అన్నదాతలు ఆనందపడతారు. ఇక కాకతీయుల పెద్ద గణపతి దేవుడు, అరవై రెండు సంవత్సరాలు పాలన చేశాడు. కాకతీయులలో అత్యధిక కాలంపాలించినది గణపతి దేవుడు.

గణపతి దేవుడు అంతకాలం కంటికి రెప్పలా తెలంగాణాను కాపాడుకోగలిగాడంటే కారణం ఆయన చెరువులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం. స్వయంగా గణపతి దేవుడే పలుగూ, పార తీసుకొని చెరువు త్రవ్వకం ప్రారంభించేవాడని పాలంపేట శాసనాలు తెలియపరుస్తున్నాయి. గణపతి దేవుడు గణపురం, వరంగల్, రామప్ప, భద్రకాళి చెరువులను దగ్గరుండి తవ్వించాడు. రాజు, ప్రజలు, సామంతులు, సేనానులు ఉద్యోగులు ఒకరే మిటి, కాకతీయుల కాలంలో ప్రతివారు చెరువు తవ్వకంలో భాగస్వామ్యం కావలిసిందే. గణపతి దేవుడి సేనాని రేచెర్లరుద్రుడు (గురువు కూడా) గణపతికి రాజ్యాన్ని అప్ప చెప్పిన తరువాత, ఆయన చేసిన పని చెరువులను త్రవ్వడమే. త్రవ్వించడమే! రేచెర్ల రుద్రుడు పాకాల చెరువును 12 చ.మైళ్ళ విస్తీర్ణంలో తవ్వించాడు. ఈ చెరువువల్ల 17 వేల 258 ఎకరాలకు సాగునీరు లభించింది.
మరేం చేస్తాం? ఉన్న ఊరు వదలలేం, కన్న వారిని వదలలేం, ప్రకృతితో పెనవేసుకున్న బంధాన్ని వదలలేం, ఊరుచుట్టూ ఉన్న చెరువుల్లో నీరుంటే, ఇంట్లో సంపద, సంతోషాలు ఉన్నట్లే, ఇది తెలంగాణా సంప్రదాయం. పోయిన సంవత్సరం వర్షాలు కురవనందున చెరువులలో నీళ్ళు లేవు. చాలా మంది రైతులు పంట పండించలేక పోయారు.

ఈ మాట వారు చెపుతున్న ప్పుడు వారి కళ్ళల్లో కన్నీళ్ళు తిరగడం వారి గుండె కోతకు నిదర్శనం. తెలంగాణాలోని ఊళ్ళల్లో చెరువు ఒక దేవత, చెరువు ఒక పుణ్యకార్యం, చెరువు ఒక చలవ, చెరువు ఒక సంతోషం, చెరువు ఒక జీవితం, చెరువు ఒక సంస్కృతి, చెరువు ఒక పేగుబంధం, హాట్సాప్‌టు మిషన్ కాకతీయ.

Comments

comments