మట్టి సుగంధం వఝల కవిత్వం

వఝల శివకుమార్ అంటే ఒక ఆత్మీయ సమీర స్పర్శ. పాలకంకుల పురిటి బీజాల కల. మట్టి సుగంధాల పరిమళం. సస్యశ్యామల పైరు సాలు. నిరంతరం అల్లుకుని సాగే కలం జోరు. జోడెడ్ల సమన్వయం. అందులో కరుకైన ములుగర్ర. మనసొలికే పాల నురుగు. పరిమళించే హాస్యం. తోవ చూపే దార్శనికత. సునిశితమైన వ్యంగ్యం. ఆయన జీవితంలాగే కవిత్వం కూడా స్వచ్ఛం. దాపరికంలేని నిష్కల్మష స్వభావి వఝల. ఆగస్టు మూడో తేదీన 1956లో వేములవాడలో వఝల శివకుమార్ జన్మించారు. రాధాబాయి, […]

వఝల శివకుమార్ అంటే ఒక ఆత్మీయ సమీర స్పర్శ. పాలకంకుల పురిటి బీజాల కల. మట్టి సుగంధాల పరిమళం. సస్యశ్యామల పైరు సాలు. నిరంతరం అల్లుకుని సాగే కలం జోరు. జోడెడ్ల సమన్వయం. అందులో కరుకైన ములుగర్ర. మనసొలికే పాల నురుగు. పరిమళించే హాస్యం. తోవ చూపే దార్శనికత. సునిశితమైన వ్యంగ్యం. ఆయన జీవితంలాగే కవిత్వం కూడా స్వచ్ఛం. దాపరికంలేని నిష్కల్మష స్వభావి వఝల.

ఆగస్టు మూడో తేదీన 1956లో వేములవాడలో వఝల శివకుమార్ జన్మించారు. రాధాబాయి, వఝల సాంబశివశర్మ ఆయన తల్లిదండ్రులు. ఐదు దశాబ్దాల సాహిత్య ప్రస్థానానికి బీజం ఆయన ఏడో తరగతి చదువుతున్నప్పుడే పడింది. తొలిసారి సాహిత్య సమావేశంలో వేదిక ఎక్కినప్పుడు ఆయన వయసు 12 సంవత్సరాలు. చిరుప్రాయంలోనే పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా జరిగిన ఉపన్యాస పోటీల్లో ‘స్వాతంత్య్రం విద్యార్థుల కర్తవ్యం’ అనే అంశంపై ఉపన్యసించడం తర్వాతి రోజుల్లో సాహిత్యం వైపు అడుగులు వేసేందుకు ప్రేరణగా నిలిచింది. “మేడిపండులాగున్నది స్వాతంత్య్రం/నీకెవరిచ్చారు స్వాతంత్య్రం” అనేవి ఆయన తొలి కవితాపాదాలు. అన్యాయం, అక్రమాలు, అవినీతి జరుగుతున్న తీరుపట్ల ఆయన మనసు స్పందనే ఈ పాదాలు. చొప్పకట్ల చంద్రమౌళి అనే ఉపాధ్యాయుడు ఆ కవిత్వాన్ని విని చాలా పరిపక్వతతో రాశావని ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహం శివకుమార్‌లో కొండంత ధైర్యాన్ని నింపింది.

చంద్రమౌళిలోని అభ్యుదయ దృక్పథం శివకుమార్‌కు కూడా అబ్బింది. ఆ తర్వాత కేశన్నగారి రాజశర్మ, మధు, మృత్యుంజయశర్మల మార్గదర్శకత్వంతో పాటు తండ్రి తోడ్పాటుతో సాహిత్యం వైపు స్థిరమైన అడుగులు పడ్డాయి. ఎక్కడ సాహిత్య సమావేశాలు, కవి సమ్మేళనాలు జరిగినా తప్పనిసరిగా హాజరు కావాలనే ఉబలాటం వఝలకు చిన్ననాటినుండే ఉంది. అదే సమయంలో ఊరిలో జరిగే డా.సి.నారాయణ రెడ్డి సాహిత్యోత్సవాలకు బాలకవిగా ఆహ్వానించబడడం, ఆ సభలో జె.బాపురెడ్డి, దాశరథి, సినారెలతో పాటు కూర్చుని కవిసమ్మేళనంలో పాల్గొనడం వఝలకు దిశానిర్దేశం చేసింది. దాశరథి ఆ బాలకవిని చూసి అబ్బురపడ్డారు. శివకుమార్ తండ్రి సాంబశివశర్మతో సినారె ‘మీ కొడుకు రంగంలోకి వచ్చాడు. మీరు విశ్రాంతి తీసుకోవచ్చ’ని ధీమా వ్యక్తం చేశారు. ఆ నాటి కే శివకుమార్‌కు కాళోజీతో ప్రత్యక్ష సం బంధాలు ఏర్పడ్డాయి. క్రమం తప్పకుండా జరిగే సాహితీ మిత్రబృందం కార్యక్రమాలతో మమేకమయ్యారు. అలా చిక్కని కవిత్వం రాయడం మొదలైంది. కామారెడ్డి మిత్ర బృందంలోని డా. అయాచితం శ్రీధర్, డా.వి. ఆర్.శర్మ, శ్యాంరావు మొదలైన ఆలోచనాపరుల సాహచర్యం వఝలను రాటుదేల్చింది. ‘ఆదర్శ కళాసమితి’లోవారందరితో స్నేహం మంచి పుస్తకాలు చదివే అలవాటుకు దారి తీసింది.

సమాజంపట్ల అవగాహన కలుగుతున్న దశ లో ప్రగతిశీల రచయితలు జింబో, వారాల ఆనంద్, పి.ఎస్.రవీంద్ర తదితరుల సాహచర్యంతో ఒక సాహిత్య సంస్థను నెలకొల్పారు. దేశంలో అత్యవసర పరిస్థితి వల్ల ఏర్పడ్డ నిర్బంధం కారణంగా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ‘కళానికేతన్’ అనే మరో సాహిత్య సాంస్కృతిక సంస్థను నెలకొల్పారు. ఏళ్ల తరబడి చేసిన కృషి ఫలితంగా ఆ సంస్థ శాఖోపశాఖలుగా ఎదిగింది.
అనతికాలంలోనే లిఖిత మాసపత్రిక ‘నవత’ను తీసుకొచ్చారు శివకుమార్. ఆగాచార్య, అలిశెట్టి ప్రభాకర్ మొదలైనవారి సహకారంతో ప్రముఖ కవులు జ్వాలాముఖి, నగ్నముని మొదలైనవారి ఉపన్యాసాలు ఏర్పాటు చేసి, వారి అడుగుజాడల్లో కవిత్వాన్ని బలంగా రాశారు.
ఎమర్జెన్సీ దమనకాండ నేపథ్యంగా వఝల శివకుమార్, అలిశెట్టి ప్రభాకర్, జింబో, పి.ఎస్.రవీంద్ర, వారాల ఆనంద్ ఈ ఐదుగురూ కలిసి ‘లయ’అనే కవితాసంకలనాన్ని వెలువరించారు. ఆ కవితాసంకలనం ఈ ఐదుగురికీ లయకవులుగా ప్రఖ్యాతి తెచ్చింది.
నిరంతరం కొత్త కవులను ప్రోత్సహిస్తూ కవిసమ్మేళనాలను కోల్‌బెల్ట్ ప్రాంతంలో వఝల శివకుమార్ నిర్వహించారు. అది అనంతర కాలంలో సాహిత్య సమాఖ్య వ్యవస్థాపనకు పునాదిగా నిలిచింది. తొలినాళ్లలో ఆయన నిర్వహించిన కవి సమ్మేళనాలు విజయవంతం కావడంతోఆ స్ఫూర్తి తో ఎఫ్.సి.ఐ. సాహితీ సమా ఖ్య, ఎన్.టి.పి.సి.లో జ్యోతి సాహిత్య సమాఖ్యలను ఏర్పర్చారు. ఆ ప్రయత్నంలోనే మల్లావఝల సదాశివుని సహవాసం లభించింది. ఆయన తో కలిసి గ్రంథాలయోద్యమంలో పాల్గొన్నారు శివకుమా ర్. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సాహిత్య కార్యక్రమాల్లో చురుకైన పాత్ర నిర్వహించారు. ఆ అనుభవాలు తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి అవగాహననిచ్చాయి.
వఝల శివకుమార్ స్వతంత్రంగా ప్రచురించిన తొలి కవితాసంపుటి ‘గోగుపువ్వు’ను ఆత్మీయ మిత్రు డు అలిశెట్టి ప్రభాకర్‌కు అంకితమిచ్చారు. సమకాలీన ప్రజాపోరాటాలకు అద్దం పట్టిన ఆ కవితాసంపుటి పలువురి ప్రశంసలందుకోవడంతోపాటు ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు అందుకుంది. చాలా సీరియస్ అంశాన్ని కవిత్వంలోకి పొదగడం ఎలాగో ‘గోగుపువ్వు’ పేర్చడంతో సాధన చేసిన శివకుమార్ ‘పాలకంకుల కల’తో మరింత చిక్కనయ్యారు. “వర్షానికి తడిసిన జొన్నచేల పూల మీంచి/ ఆకుల మీదికి జారుతున్న బిందువుల / అవ్యక్తాలాపనల వ్యక్త సౌందర్యాలు/ పసి ఊహల మొగ్గల్లోకి పారాడిన / మంచు ముక్కల సౌకుమార్యాలు” ఎన్ని చెప్పినా కవి దారి తప్పలేదు. ‘పాలకంకుల కల’కు సినారె పురస్కారం లభించింది. మచిలీపట్నంలోని ఆంధ్ర సారస్వత సమితి ఉత్తమ వచనకవితాపురస్కారం అందజేసింది.
శివకుమార్ కవితా ప్రస్థానంలో ‘దాఖలా’ మూడవది. ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాల విచ్ఛిన్నం కావడాన్ని ఈ కవితాసంపుటి సమాజం ముందు కు తెచ్చింది. కవిత్వోద్యమాలలో సాహిత్య సంస్థల వ్యవస్థాపనతో రాటుదేలిన శివకుమార్ తెలంగాణ భావవ్యాప్తిని నలుచెరగులా చాటేందుకు డా.నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, జూలూరి గౌరీశంకర్ మొదలైన ప్రముఖులతో కలిసి విస్తృతంగా కృషి చేశారు. ‘తెలంగాణ సాహిత్య సమాఖ్య’ను స్థాపించి; కూకట్‌పల్లి, బిహెచ్‌ఇఎల్ లాంటి ప్రాంతాల్లో తెలంగాణ భావవ్యాప్తి చేయడం వెనుక వఝల కృషి ప్రశంసనీయం.
దోపిడీకి గురైన తెలంగాణ చిత్రపటాన్ని పద చిత్రాల్లో ఆవిష్కరించారు వఝల శివకుమార్. ఆ దిశలో ఇటీవల ‘కలల సాగు’ అనే కవితాసంపుటిని వెలువరించారు. తెలంగాణ కవులకు వస్తు విస్తృతి ఎక్కువని రుజువవుతున్న దశలో వెలువడ్డ కలల సాగు తెలంగాణ నిర్మాణ కవిత్వం. వస్తు శిల్పాలు పదునెక్కిన కవితాసంపుటి ‘కలల సాగు’.
దాశరథి కృష్ణమాచార్యులు అతిథిగా పాల్గొన్న సాహిత్య సభలో బాలకవిగా రంగప్రవేశం చేసిన వఝల శివకుమార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి మహాకవి దాశరథి పురస్కారం పొందేవరకు సుదీర్ఘ సాహిత్య జీవన పయనముంది. దాశరథి అభ్యుదయ వాదాన్ని, తిరుగుబాటు తత్త్వాన్ని, ధిక్కార స్వరాన్ని అందిపుచ్చుకున్నారు. ఆయన కవిత్వమై కరచాలనం చేస్తారు. ఆప్తవాక్యమై అందరి గుండెల్లో కదలాడుతారు.