మట్టి కథల ‘పెద్ద బాలశిక్ష’ గూడూరి సీతారాం

gdr

స్వాతంత్య్రానంతర తెలంగాణ తొలితరం కథకుల్లో అగ్రగణ్యులు గూ డూరి సీతారాం. తెలంగా ణ మట్టి భాషకు, యాస కు కథల్లో పటం కట్టి చూపించిన కథకుడాయన.నిఖార్సయిన తెలంగాణ భాషకు 1950 ప్రాంతంలోనే పట్టం కట్టిన గూడూరి జులై 18, 1936న నిన్నటి కరీంనగర్ జిల్లా, నేటి రాజన్న సిరిసిల్లా జిల్లా లోని హనుమాజీ పేటలో పుట్టారు. హనుమాజీ పేట, సిరిసిల్ల, కరీంనగర్‌లలో విద్యను పూర్తిచేసిన గూడూరి సీతారాం 1961లో బి.ఏ కోసం తన మిత్రుడు, గురువు, హితుడు డా.సి.నారాయణ రెడ్డి సలహాతో హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో చేరారు. ఈ సమయంలోనే దాదాపు పది సంవత్సరాలు సినారె -గూడూరి ఒకే ఇంట్లో ఉన్నారు. ఈ సమయంలోనే దాశరథి, కాళోజి, పల్లా దుర్గయ్య, వట్టికోట ఆళ్వార్‌స్వామి, బి.ఎన్.శాస్త్రివంటివారితో సాన్నిహిత్యం ఉండేది. తొలినాళ్ళలో సినారె, కనపర్తిలు కవిత్వం వైపుకు వెళ్ళగా గూడూరి సీతారాం, వీరి తమ్ముడు డా. గూడూరి రాఘవేంద్ర మరో కథకులు గూడూరి శంకరం కథల వైపుకు మొగ్గుచూపారు. సినారె మాటల్లో చెప్పాలంటే “ ఆ రోజుల్లో నన్ను అనుసరించిన యువకులిద్దరు, ఒకరు గూడూరి సీతారాం, రెండవవాడు కనపర్తి లక్ష్మీనర్సయ్య. గూడూరి కథలో దారిలో చరించాడు. కనపర్తి కవితా మార్గంలో సాగిపోయాడు ” అంటారు. విద్యార్థి దశలోనే గోరా, లవణంల ప్రభావంతో సీతారాం మిత్రబృందం ‘ఎథిస్ట్ బాయిస్ క్లబ్’ను ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో వేములవాడ నుండి వీరు, వీరి మిత్రబృందం వెలువరించిన లిఖిత పత్రిక ‘విద్యుల్లత’లో, హెచ్.ఎస్.ఎల్.సి సిరిసిల్ల పాఠశాల నుండి వీళ్ళే స్థాపించి వెలువరించిన సంచిక ‘తరంగిణి’లోనూ సీతారాం కథలు అచ్చయ్యాయి. అప్పటి ప్రముఖ పత్రికలు ప్రజామత, పల్లెటూరు, సుజాత, శోభ, తెలుగుదేశంతో పాటు భారతి, కరీంనగర్ నుండి వెలువడ్డ సారస్వత జ్యోతిలో గూడూరి కథలు, వ్యాసాలు, కవిత్వం వచ్చాయి. 1955 నుండి 1965 మధ్య గూడూరి సీతారాం 85కు పైగా కథలు, రెండు నవలలు, వివిధ అంశాలపై విమర్శ వ్యాసాలు రాసారు. అయితే అందరు తెలంగాణా రచయితల మాదిరిగా రాయడమే తప్ప వాటిని ప్రిజర్వ్ చేసుకోవాలనే సోయి లేకపోవడంతో అరవైకి పైగా కథలు లభించకుండా పోయాయి. మళ్ళీ 1995 ప్రాంతంలో సిరిసిల్లలోని మానేరు రచయితల సంఘం గూడూరి సీతారాం సాహితీ జీవిత స్వర్ణోత్సవం జరపాలనుకున్న సమయంలో తెలుగుదేశంలోని అన్ని ప్రసిద్ధ గ్రంథాలయాలు తిరిగి సేకరించిన 18 కథలతో గూడూరి సీతారాం కథలను ప్రచురించింది. ఇటీవల మరో నాలుగు కథలు లభించాయి. 1960 -65 మధ్యరాసిన రెండు నవలలు ఇంకా అలభ్యాలే. గూడూరి విమర్శకులుగా కూడా ప్రసిద్ధులే. ఆ మధ్య పాత పత్రికలు వెతుకుతున్నప్పుడు తెలుగుదేశంలో కాళోజీ ‘నాగొడవ’ గూర్చి రాసిన వ్యాసం కనిపించింది. ప్రజాకవి కాళోజీ ఒక్కడే అంటారు. అంతేకాక ‘ఇలాతలంలో హేమం పిండగ’ అంటూ రాసిన మహామహా సమాసాలు చదువుకున్న నాలాంటి వాడికే అర్థంకానప్పుడు సామాన్యునికి ఎట్లా అర్థం అవుతాయి. కాబట్టి సామాన్యునికి అర్థమయ్యేలా కవిత్వం రాసిన కాళోజీ ఒక్కరే ప్రజాకవి అంటారు. గ్రామీణ జీవితం నేపథ్యంగా కథకునిగా ఎదిగిన గూడూరి సీతారాం తన రచనల్లో సామాన్యుని జీవిత వలయాలను దాటి రాసేప్రయత్నం ఎక్కడా చేయలేదు. తెల్లవారింది మొదలు పొద్దుగూకేవరకు పల్లెల్లో కంటికి కనిపించే వృత్తులు, జీవితాలు, సంస్కృతి మొదలైనవాటిని సూక్ష్మంగా నమోదు చేసారు గూడూరి. కరీంనగర్ మాండలికంలో 1957లో రాసిన కథ ‘మారాజు’, ఇది అచ్చమైన తెలంగాణ భాషనే కాక జీవన విధానాన్ని, జాగరూకతను చిత్రించిన కథ. ‘రంగడు బొంబాయి పోయచ్చిండు. ఆడెప్పుడో బొంబాయి దాకా ఎల్ల కుంటా ఉండడని చానామంది అనుకున్నరు. ఎర్రిబాగులోడు- ఆ పిచ్చోడు బొంబాయి దాకా ఒక్కడే ఎట్లా ఎళ్ళిండా అనే తర్కాల పడ్డరు. గా నడుమ అదేదో పెద్ద సోపాల సదువంతా సదువుకున్న దొరగారి పిల్లగాడు లష్కరు బోయిండంట’ అంటూ ఈ కథ సరళమైన భాషలో సాగుతుంది. 1950ల్లోని వలస జీవితాలను ఈ కథలో ప్రతిబింబింపజేసారు. పట్నం మోజులో అటు వృత్తికి దూరమై, ఇట్టు మట్టికి నా అనుకున్న మనుషులకు దూరమై అప్పటి తెలంగాణం ఎట్లుందో చూపిస్తారు గూడూరి. భాషరాని, బాట తెలియని ఒక అమాయక పల్లెటూరి బైతు పరాయి ప్రాంతంలో పడ్డ సాదకబాధకాలతో ఈ కథ ఆద్యంతం సాగింది.
‘నారిగాని బతుకు’ మరో మంచి కథ. కథలోని నారి వృత్తిరీత్యా గీత కార్మికుడు. కల్లు గీసితేవడం అతడి దిన చర్య. పల్లెల్లో భర్తతో పాటు భార్య, ఇంటిల్లిపాది వృత్తిలో పాల్గొనడం మామూలే. వృత్తిని కేంద్రంగా చేపుకుని గూడూరి ఈ కథలో విభిన్న స్త్రీల మనస్తత్వాలను, గ్రామీణ జీవనంలో కులవృత్తుల స్థానాన్ని చెబుతారు. నారిగానికి ముగ్గురు భార్యలు, లసుము, ఎల్లి, మూడో భార్య పాత్రలతో మూడు రకాల మానవ మనస్తత్వాలు గోచరిస్తాయి. లసుము కుటుంబపరమైన వ్యాపారంలో భర్తకు సహకరిస్తూ పరువుగా బతుకుతుంది. ఎల్లి నారిని మోసం చేసి లేచిపోతుంది. ఎల్లి మోసంచేయడంతో నారిగాడు చివరకు మూడోపెళ్ళి చేసుకుంటాడు. తనవృత్తి ధర్మంగా కల్లు వంచుతున్న మూడో భార్యను ఒక వ్యక్తి కొంగుపట్టి లాగగా నారిగాడు ఆవేశంగా అతనిమీద చేయిచేసుకుంటాడు. ఇక్కడ రచయిత కల్లుగీత వృత్తిలోని చాలా విషయాలను చర్చిస్తారు. తరాలు మారిపోయి కులవృత్తిపై యాజమాన్యం సంతానానికి సంక్రమించి పూర్వ యజమానిది ప్రేక్షకపాత్రే అయినప్పుడు ఆయన పడుతున్న సంఘర్శనను, మానసికస్థితిని, పల్లెజీవికకు భూమికగా నిలిచిన కులాల సంస్కృతి మూల బిందువుగా చక్కటి కథనం ద్వారా మెప్పించారు గూడూరి. అంతేకాకుండా శ్రామిక కుటుంబాల్లో ఇల్లాలు భర్తతో పాటు కులవృత్తిలో పాల్గొనే గ్రామీణ కుటుంబ సంస్కృతిని వివిధ కోణాల్లో చిత్రించారు.
‘రాజమ్మ రాజరికం’ కథ ఐహిక సుఖాలు, కోరికలు, విలాసవంతమైన జీవితం పట్ల ఆకర్శితురాలై మోసపోయి చివరకు భిక్షగత్తెగా మారిన స్త్రీ కథ. కథను ఎత్తుకోవడంలోనే ఒక కొత్త ఒరవడిని చూపిన గూడూరి సెన్గ సేన్ల నిలుచుని నీవు, చేయి జాపవే పూసలోల్ల రాజమ్మ, కంది సేన్ల నిలుచుని నువ్వు కన్నుగీటవే పూసలోల్ల రాజమ్మ’ తెలంగాణ జానపదంతో ప్రారంభిస్తారు. సంస్కృతిలో వస్తున్న మార్పులతో కొత్తగా వస్తున్న వస్తువుల మోజులో సామాజిక జీవనం, నియమాలకు భిన్నంగా ప్రవర్తించి భర్తను కాదనుకున్న రాజమ్మ తాను పెళ్ళి చేసుకున్నా మార్పులకు లొంగని భర్తను కాదనుకుని వికటించిన నాగరికత ప్రభావంతో, కోరికలతో భర్తతో వైవాహిక జీవనానికి దూరమై రెంటికి చెడిన రేవడిలా అవుతుంది. రాజమ్మ పాత్రద్వారా గూడూరి చూపించిన వాస్తవాలు దాదాపు నాలుగు దశాబ్దాల నాటి సామాజిక పరిస్థితులు, అప్పుడప్పుడే తెలంగాణ బతుకులపై ప్రభావం చూపుతున్న సినిమాల పరిణామాలు చూడవచ్చు. ఇంచుమించు ఇదే సమయంలో వచ్చిన మరో రెండు కథలు ‘రంగడు’, ‘లచ్చి’. భాష, ఇతివృత్తం, ఆనాటి సమయ కాలాల విషయంలోనే కాక రచయిత గూడూరి సీతారాం కథలకు పేర్లు పెట్టడంలో కూడా తన ప్రాంతం, ప్రజలపై ఉన్న మమకారాన్ని వదులుకోలేదు. ఆయనకుగల అభిమానం, ప్రేమ ఆయన రచనల్లో ప్రతివాక్యంలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంగా విలువల గురించి, అప్పుడప్పుడే వస్తున్న మార్పుల గురించి ఎంతో చర్చించారు గూడూరి. 1957లోనే అణగారిన బతుకుల జీవనవిధానాన్ని, సంస్కృతిని పరిశీలించి ఒక డాక్యుమెంటులాగా మలిచి, పరిశీలించి రాసిన కథ లచ్చి. సంచార తెగకు చెందిన బిక్షగాళ్ళ బతుకుతెరువుకు సంబంధించిన కథ ఇది. చాపలు అల్లుతూ, భిక్షాటన చేస్తూ బతికే ఒక కుటుంబం అందరిలాగే పట్నం మోజులోకి వచ్చి వృత్తిమారి, ఆర్థికంగా ఎదిగి ఈ క్రమంలోనే సామాజికంగా ఎదగలేక చిన్నాభిన్నమై ఎలా నాశనమైందో దీనిలో చూడవచ్చు. పరిగెత్తి, పరిగెత్తి ఎన్నో అపార్థాలు, అనుమానులకులోనై చతికిలబడి చివరికి బతుకు పరుగు పందెంలో అలసటచెంది పూర్వపు జీవితాల్ని మళ్ళీ గెలుచుకున్న క్రమంలో జరిగిన పరిణామాలు, పరిస్థితులు సామాన్యుని జీవితంలో మార్పులు ఎందుకు అనుకూల స్థితిని కలిగించలేకపోతాయో లచ్చి కథ అందుకు తార్కాణంగా నిలుస్తుంది.
ఇంకా ‘అందని ఆకాశం’, ‘అబ్బాయి-అమ్మాయి’, ‘దెబ్బతిన్న అహంభావం’, ‘ఎర్రని పువ్వు’, ‘బస్సచ్చింది’, ‘పిచ్చోడు’ వంటి ఎనభై అయిదు కథలను రాసారు గూడూరి సీతారాం. గూడూరి కథలన్నిటిలో పాత్రోచితమైన సంభాషణలతో జీవభాష ఉట్టిపడుతుంది. గూడూరి సీతారాం కథలు స్వాతంత్య్రానంతరం రాయడం మొదలు పెట్టిన తెలంగాణ నవతరం రచయితలకు ఒక దిక్సూచిగా పనిచేసాయి. కథా సాహిత్యంలో నిజాయితిగా, నిస్సంకోచంగా గ్రామీణ పేదల జీవితాలను, వాళ్ళ ఇతివృత్తాలను ప్రవేశపెట్టేందుకు గూడూరి కథలు ఎంతగానో తోడ్పడ్డాయి. కథల్లో గూడూరి వాడిన తెలంగాణా జీవభాష అటుతరువాత తరం రచయితలకు ఒక పెద్దబాలశిక్ష లాగా ఉపయోగపడింది. తాను తన హనుమాజీపేట, వేములవాడ, సిరిసిల్లల్లో చూసిన జీవితాలను నేపథ్యంగా చేసుకుని పల్లెజీవితాన్ని కథనం చేసారు గూడూరి. తెలంగాణా భాషకు సాహిత్య గౌరవాన్ని కల్పించిన రచయిత గూడూరి సీతారాం. అంతేగాక ఆనాటి తెలంగాణా సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను, పరిణామ క్రమాన్ని అధ్యయనం చేయడానికి గూడూరి సీతారాం కథలు ఆకరాలుగా నిలుస్తాయి.

డా.పత్తిపాక మోహన్
9966229548

Comments

comments