భూమి కోల్పోతానన్న బెంగతో మహిళా రైతు మృతి

Women Farmer Dies In Medak District

మన తెలంగాణ/రామాయంపేట : కాళేశ్వరం కాలువ పరిధిలో ఉన్న భూమిని కోల్పోతున్నామన్న బెంగతో ఓ మహిళా రైతు గుండె పోటుతో మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని రాయిలాపూర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రాయిలాపూర్ గ్రామానికి చెందిన పోచమైన భూదవ్వ(60) గ్రామంలోని చెరువు కింద సుమారు 25 గుంటల భూమి ఉంది. అక్కడ బోరు వేసి భూమిని సాగు చేసుకుంటుంది. ఈ క్రమంలో గత మూడు రోజుల క్రితం కాళేశ్వరం కాలువ కోసం సర్వే జరిపారు. ఇందులో భూదవ్వకు చెందిన 25 గుంటల భూమితో పాటు బోరుబావి కోల్పోతుంది. సర్వే జరిపిన రోజు అక్కడ ఎంతో రోధించింది. గత రెండు రోజులుగా భూమి కోల్పోతున్న బెంగతోనే ఉంది. ఆదివారం ఇంటి నుండి పోలం వద్దకు వెళ్తూ మార్గ మధ్యంలో కుప్పకూలింది. వెంటనే స్థానికులు రామాయంపేట ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. దీంతో గ్రామంలో విషాధచాయలు అలముకున్నారు. మృతిరాలి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు.