భార్య కాళ్లు,చేతులు గొడ్డలితో నరికిన భర్త…

Husband Attacked On Wife With Ax
సూర్యాపేట: అనుమానమే పేనుభూతమైంది..కసితో కుట్టుకున్న ఆలినే కడతేర్చడానికి సిద్దపడ్డాడు ఆ పైశాచిక మగాడు..అంతే కాకుండా ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్రమ సంబంధం అనుమానంతో మనస్సు నిండా కక్ష పెంచుకొని గొడ్డలితో కాళ్లు, చేతులు నరికి,ఆ తర్వాత తాను విద్యుత్ వైర్‌ను పట్టుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం జిల్లాలోని కేతేపల్లి మండలం తుంగతుర్తి గ్రామంలో చోటు చేసుకుంది. బాధితురాలు రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండడంతో గ్రామస్థులు చలించిపోయారు. ఈ సంఘటన పై పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. తుంగతుర్తి గ్రామానికి చెందిన జెటంగి శ్రీను(33)కు సూర్యాపేట జిల్లా కేసారం గ్రామానికి చెందిన రజిత(28)కు 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వివాహం అయిన కొన్ని సంవత్సరాల వరకు సంసారం సాఫీగానే కొనసాగింది. వారికి కుమారుడు కార్తీక్, కుమార్తే నవ్య ఉన్నారు. వీరిరువురి మధ్య గత కొంతకాలంగా అనుమానం పేరుతో తరచు గొడవలు జరుగుతుండేవని గ్రామస్థులు తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు పలుమార్లు ఫిర్యాదులు చేసి సమస్యను పరిష్కారం చేసుకొని సంసార జీవితాన్ని కొనసాగించేవారు.

ఈ నేపథ్యంలో కుటుంబ కలహాల కారణంగా మంగళవారం భర్త శ్రీను గొడ్డలితో అతికిరాతకంగా కాళ్లు, చేతులు నరికి హతమార్చేందుకు ప్రయత్నించాడు. ఈ కిరాతకానికి పాల్పడుతుండగా గ్రామస్థులు అడ్డుకొవడంతో శ్రీను సంఘటన స్థలం నుండి వ్యవసాయ బావి వద్దకు వెళ్లిపోయాడు. అక్కడ సమీపంలోని విద్యుత్ మోటర్‌లకు సరఫరా అవుతున్న కరెంటు తీగలను పట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త దాడిలో కాళ్లు, చేతులు విరిగి తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న రజితను స్థానికులు చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఎస్‌ఐ రజినీకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన శ్రీను మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

comments