భారీ ఆశలతో సౌతాఫ్రికా

South-Africa

మన తెలంగాణ/ క్రీడావిభాగం : ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లలో ఒకటైన దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ వేదికగా జరుగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో కప్పును గెలుచుకోవాలనే పట్టుదలతో ఉంది. 1998లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన సౌతాఫ్రికా ఆ తర్వాత ఎప్పుడూ కూడా కనీసం ఫైనల్‌కు కూడా చేరుకోలేక పోయింది. హేమాహేమీ ఆటగాళ్లతో కూడిన దక్షిణాఫ్రికా గతంలో ప్రపంచ క్రికెట్‌ను ఏలింది. అయితే ప్రతిష్టాత్మకమైన ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీల్లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేక పోయింది. తొలి ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇప్పటి వరకు సౌతాఫ్రికా ఖాతాలో ప్రపంచ స్థాయి టైటిల్స్ ఏమీ లేవు. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ట్రోఫీలో దక్షిణాఫ్రికాకు మంచి అవకాశాలున్నాయి. డివిలియర్స్ సారథ్యంలోని జట్టులో ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బౌలర్లు, బ్యాట్స్‌మెన్ జట్టుకు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం జట్టు వన్డేల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

డివిలియర్స్ కీలకం..
ఇక, ఈ టోర్నమెంట్‌లో సౌతాఫ్రికా విజయవకాశాలన్నీ కెప్టెన్ ఎ.బి.డివిలియ ర్స్‌పైనే ఆధారపడి ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత విధ్వంసక బ్యాట్స్‌మన్‌గా డివిలియర్స్‌కు పేరుంది. ఎంతటి పెద్ద బౌలర్‌కైన చుక్కలు చూపించే సత్తా అతని సొంతం. తనదైన రోజు అతన్ని కట్టడి చేయడం ఏ బౌలర్‌కైన చాలా కష్టం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా ఉన్న డివిలియర్స్ చెలరేగితే అడ్డుకోవడం అంత తేలిక కాదు. ఈసారి డివిలియర్స్ భారీ ఆశలతో ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమయ్యాడు. జట్టును ఎలాగైన విజేతగా నిలపాలనే పట్టుదలతో అతనిలో కనిపిస్తోంది. ఇక, హాషిం ఆమ్లా, డు ప్లెసిస్, క్వింటన్ డికాక్‌ల వంటి అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లను కూడా తక్కువ అంచన వేయలేం. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆమ్లా, డికాక్‌లు ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఇద్దరు వరుస సెంచరీలతో ఇతర జట్ల బౌలర్లను హడలెత్తిస్తున్నారు. ఛాంపియన్స్‌లో వీరు చెలరేగితే సౌతాఫ్రికాకు విజయాలు నల్లేరుపై నడకే. ఇటీవల ముగిసిన ఐపిఎల్‌లో ఆమ్లా రెండు సెంచరీలు కొట్టి జోరుమీదున్నాడు. ఇదే ఊపును ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కనబరచాలనే పట్టుదలతో ఉన్నాడు. జీన్ పాల్ డుమినీ రూపంలో మరో పదునైన అస్త్రం సౌతాఫ్రికాకు అందుబాటులో ఉంది.
తిరులేని బౌలింగ్ దళం..
మరోవైపు బౌలింగ్‌లో సౌతాఫ్రికాకు ఎదురేలేదని చెప్పవచ్చు. ప్రపంచ క్రికెట్‌లోని అత్యుత్తమ బౌలర్లుగా పేరొందిన మోర్ని మోర్కెల్, పార్నెల్, కగిసొ రబడా, ఇమ్రాన్ తాహిర్‌లు జట్టుకు అండగా నిలువాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. కొంతకాలంగా వీరంత నిలకడైన బౌలింగ్‌తో జట్టుకు వరుస విజయాలు అందిస్తున్నారు. ఇంగ్లాండ్ పిచ్‌లు ఫాస్ట్ బౌలర్లకు సహకరించే అవకాశాలున్నాయి. దీంతో సౌతాఫ్రికా బౌలర్లను ఎదుర్కొవడం ప్రత్యర్థి జట్లకు కష్టమే. ఇక, డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్, బెహార్దిన్ వంటి అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లు జట్టులో ఉన్నారు. దీంతో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా బలంగా కనిపిస్తున్న సౌతాఫ్రికాకు కప్పు గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయని విశ్లేషకులు అంచన వేస్తున్నారు. సౌతాఫ్రికా, భారత్, శ్రీలంక, పాకిస్థాన్‌లు ఒకే గ్రూపులో ఉన్నాయి. దీంతో ఈ గ్రూపులో పోరు నువ్వా నేనా అన్నట్టు సాగడం ఖాయం.అయితే కీలక సమయాల్లో ఒత్తిడిని తట్టుకోక పోవడం సౌతాఫ్రికా అతి పెద్ద బలహీనత.

Comments

comments