భద్రాద్రిలో సమ్మె తుస్

Problems facing dealers as well as monthly wages

ఖమ్మంలో మూడో వంతు సమ్మెలో లేనట్లే
వెనకడుగు వేస్తున్న డీలర్లు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికార యంత్రాంగం

రేషన్ డీలర్లు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చేపట్టిన సమ్మె ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ముందుకు సాగే సూచనలు కన్పించడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం డీలర్లు సమ్మె నుంచి వైదొలిగారు. రేషన్ సరుకుల కోసం డీడీలు తీసి అధికారులకు అప్పగించారు. ఖమ్మం జిల్లాలో సైతం మూడో వంతు మంది డీలర్లు సమ్మెకు దూరంగా ఉన్నారు. డీలర్లు సమ్మెలో ఉన్నచోట అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది. నిత్యావసర సరుకుల పంపిణీకి ఎటువంటి ఆటంకం కలుగకుండా అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ రేషన్ డీలర్లు మాత్రం సమ్మెను ఉధృతం చేస్తామని తమ డిమాండ్లు సాధించేంత వరకు పోరాటం కొనసాగిస్తామంటున్నారు.

మన తెలంగాణ/ఖమ్మం: నెలసరి వేతనంతో పాటు డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేటి నుండి సమ్మెకు దిగిన విషయం విధితమే. అధికార యంత్రాంగం సమ్మె చేస్తే సహించమని కఠిన చర్యలు తప్పవని ప్రకటించిన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సమ్మె తుస్స్‌మంది. జిల్లా వ్యాప్తంగా 442 మంది డీలర్లు ఉండగా శుక్రవారం సాయంత్రానికి 412 మంది డీలర్లు డిడిలు తీసి అధికారులకు అప్పగించారు. మిగిలిన వారు సైతం శనివారం డిడిలు తీసి ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ సరుకులను పంపిణీ చేసేందుకు సిద్దమంటూ సంకేతం ఇచ్చారు. మొత్తం 442 మంది డిడిలు తీయడంలో ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిత్యావసర వస్తువుల సరఫరా డీలర్ల ద్వారానే యదావిధిగా సాగనుంది. ఖమ్మంజిల్లాలో 669 మంది రేషన్ డీలర్లకు గానూ సాయంత్రం ఏడు గంటల వరకు సుమారు 200 మంది డిడిలు తీసి నిత్యావసర వస్తువుల పంపిణీకి తాము సిద్దమన్నారు. మిగిలిన 469 మంది సమ్మె బాట పట్టారు. అధికార యంత్రాంగం డిడిలు కట్టని డీలర్లు ఉన్న గ్రామాల్లో నిత్యావసర వస్తువులను పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. గ్రామాల్లో ఉన్న ఐకెపి గ్రూపుల ద్వారా పంపిణీ చేసేందుకు సిద్దమైంది. ఇప్పటికే మండలస్థాయి అధికార యంత్రాంగం ఈ ఏర్పాట్లు చేసింది. సమ్మెలో ఉన్న డీలర్ల నుంచి బయోమెట్రిక్ యంత్రాలను స్వాధీనం చేసుకుంటున్నారు. గిరిజనులు ఉన్న మండలాల్లో జిసిసి డిపోల ద్వారా పంపిణీ చేసేందుకు సిద్దమయ్యారు. ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుని డీలర్లను తొలగిస్తే వారి స్థానాల్లో వచ్చే వారు జూలై ఐదు లోపు డిడిలు తీసి 10లోపు పంపిణీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మొత్తం మీద భద్రాద్రి కొత్తగూడెంలో సమ్మె తుస్స్ మనగా ఖమ్మంజిల్లాలో సమ్మెలో ఇంకేంత మంది మిగులుతారనేది చర్చనీయాంశమైంది. రేషన్ డీలర్లకు మద్దతుగా విపక్ష పార్టీలు నిలిచాయి. సామరస్య పూర్వక పద్దతిలో డీలర్ల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడడం సరికాదంటూ విపక్ష నేతలు పేర్కొంటున్నారు.