భద్రకాళి చెరువులో చారిత్రక సంపద

Bhadrakali-Lake

దక్షిణ భారతదేశం పై దండయాత్రలను అడ్డుకుని సువిశాల సామ్రాజ్యం స్థాపించిన రెండవ పులకేశి నిర్మించిన చెరువుగా ప్రసిద్ధిచెందింది భద్రకాళి చెరువు. ఆనాటి దండకారణ్య ప్రాంతంలో భద్రకాళి మాతను రౌద్రమూర్తిగా ప్రతిష్టించి చెరువు తవ్వించినట్లు చరిత్ర చెపుతుంది. క్రీస్తుశకం 625లో వేంగిపై దండయాత్రకు వెళ్ళే ముందు రెండవ పులకేశి ఇక్కడ పూజలు నిర్వహించినట్లు శాసనాధారాలు ఉన్నాయి. ఉత్తర భారతదేశ దండయాత్రల్లో నర్మదానది దగ్గర జరిగిన యుద్ధంలో రెండవ పులకేశి కనౌజ్ రాజు హర్షవర్థనున్ని జయించకపోతే దక్షణాది మీద ఉత్తరాది పెత్తనం కొనసాగేది. అనంతరం కాకతీయ సామ్రాజ్య స్థాపన జరిగిన అనంతరం భద్రకాళి ఆలయానికి, చెరువు పునరుద్ధరణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. యుద్ధాలకు ముందు భద్రకాళి చెరువులో స్నానమాచరించి అమ్మవారిని పూజించడం ఆనాటి రాజుల ఆనవాయితి. పులకేశి నుంచి ప్రారంభమైన ఈ సంప్రదాయం కాకతీయుల వరకు ఆ తర్వాత కొద్దికాలం వరకు కొనసాగింది. మహారాణి రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు చెరువు పునరుద్ధరణకు శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తుంది. వరంగల్ హన్మకొండకు మధ్యలో ఉన్న ఈ చెరువు రెండు నగరాలకు వారథిగా ప్రభుత్వం సుందరీకరణచేస్తుంది. అయితే గత సమైక్య పాలకుల నిర్లక్షంతో చెరువు శికం భూమి తరిగిపోయింది. మరికొంత భూమి కబ్జాలకు గురైంది. అయితే చెరువు భూములను కాపాడుతూ మిషన్ కాకతీయ ద్వారా భద్రకాళి చెరువు పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి.

సుమారు నాలుగున్నర కోట్ల రూపాయల వ్యయంతో మిషన్ కాకతీయ పనులు కొనసాగుతుండగా హృదయం పథకం ద్వారా కొంతమేరకు ఆర్థిక సహాయం అందుతుంది. అలాగే వరంగల్ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎస్‌ఆర్‌ఎస్‌పి నుంచి నీరు తరలించి సరఫరా చేస్తున్నారు. రెండవ పులకేశి నిర్మించిన చెరువుగా గుర్తింపు ఉన్న భద్రకాళి చెరువు కాకతీయుల కాలంలో ఎంతో అభివృద్ధి సాధించింది. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ చెరువు మరిన్ని చారిత్రక ఆధారాలను ఆవిష్కరిస్తోంది. రెండవ పుల కేశికం ముందే చెరువు నిర్మాణం జరిగి ఉండవచ్చనీ ఆనాటి కీకారణ్యంలో భద్రకాళికి నిత్యం పూజలు జరిగేవని ఇటీవల కొన్ని చారిత్రక ఆధారాలు లభ్యమవుతున్నాయి.

మిషన్ కాకతీయలో భాగంగా చెరువు పూడికతీత జరుగుతుండగా జలగర్భం నుంచి అనేక చరిత్ర ఆధారాలు లభ్యమవుతున్నాయి. ఇందులో వికసితపద్మంలో కూర్చున్న వినాయకుడు, మహిషాసురమర్థిని, విష్ణువు తదితర శిల్పాలు పూడికతీతలో లభ్యమయ్యాయి . అయితే ఈ దేవతామూర్తుల శిల్పాలు జఫర్‌గడ్ గుట్ట, ఆలేరు, రఘునాథపల్లి ఆలయాల్లో ఉన్న పరివార దేవతా విగ్రహాలమాదిరిగా ఉన్నాయని చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 14 వందలసంవత్సరాల క్రితమే ఇక్కడ ఆలయం, చెరువు నిర్మాణం జరిగినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. అయితే రెండవ పులకేశి కాలానికం ముందే ఇక్కడ నిర్మాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయనడానికి పరివార దేవతా విగ్రహాలు చరిత్రకు సాక్షం చెప్పే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ చెరువులో కాకతీయ రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు స్నానమాచరించినట్లు భద్రకాళిని పూజించి హన్మకొండకు అవతల ఉన్న తోటలో సేనలను విడిచిపెట్టినట్లు ప్రతాపరుద్ర చరిత్రతో తెలుస్తుంది. అయితే చెరువు పూడిక తీతతో లభించిన విగ్రహాలను పురావస్తు శాఖ పరిశీలించి శాస్త్రీయంగా కాల నిర్థారణ చేయాల్సిఉంది. అలాగే తెలంగాణాలోని అనేక చెరువుల జలగర్భాల్లో దాగిన చరిత్రను వెలికితీస్తే తెలంగాణ ప్రాచీన చరిత్రకు మరిన్ని ఆధారాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.