భగీరథ పనుల్లో అధికారుల అలసత్వం

dissatisfied on neglect of contractors
కామారెడ్డి-సదాశివనగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ ఆడపడుచులందరికి ఇంటింటికి మంచి నీరు అందించాలనే కృతనిశ్చయంతో మిషన్ భగీరథ పనులను అట్టహాసంగా ప్రారంభించారని సిఎం ముఖ్యకార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. రాష్ట్రంలోని ప్రతి మారుమూల గ్రామానికి మిషన్ భగీరథ నీళ్ళను అందించడమే సంకల్పంగా ఆయన ముందుకు వెళ్తున్నారని గుర్తు చేశారు. కాగా భగీరథ పనుల్లో అధికారుల అలసత్వం పై స్మితా సబర్వాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామ సమీపంలోని మల్లన్నగుట్ట వద్ద చేపడుతున్న మిషన్ భగీరథ పనులను ఆమె పరిశీలించారు. పనులు మందకోడిగా కొనసాగడం పై ఆర్.డబ్లు.ఎస్. అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆగస్టు 14 తేదిన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల ప్రజలకు మిషన్ భగీరథ నీళ్ళను ఖచ్చితంగా అందిస్తామని సిఎం ప్రకటించిన అధికారులు మొద్దునిద్రలో ఉండి పనులను ఆలస్యం చేయడం పై ఆమె అసహనం వ్యక్తం చేసింది. మల్లన్నగుట్ట వద్ద చేపట్టే భగీరథ పనులను ఆగస్టు 2వ తేదిలోగా పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. పనుల్లో నిర్లక్షం వహిస్తున్న రాఘవ కన్స్‌ట్రక్షన్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసి మెగా వాటర్ కన్స్‌ట్రక్షన్స్ వారికి అప్పజెప్పాలని స్థానిక జిల్లా కలెక్టర్ డా॥ ఎన్. సత్యనారాయణకు సూచించారు. భగీరథ పైప్‌లైన్‌లు ఇటీవల జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల పగిలిపోవడం పట్ల పనుల్లో నాణ్యత లోపం కారణంగానే పలు చోట్ల పైప్‌లైన్‌లు లీకేజిలు కావడంపట్ల అసంతృప్తి వ్యక్తం చేసారు. బాల్కొండలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ద్వారా భగీరథ క్రింద 309 గ్రామాలకు 157 గ్రామాలకు ప్రస్తుతం నీటిని సరఫరా చేస్తున్నారని ఇంకా 152 గ్రామాలకు నీరందించేందుకు పనులు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ డా॥ ఎన్.సత్యనారాయణ పేర్కొన్నారు. ఆగస్టు 14వ తేదిలోగా పూర్తిస్థాయిలో అన్ని గ్రామాలకు భగీరథ నీరు అందిస్తామని ఆయన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 14 తేదిలోగా అన్ని గ్రామాల ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా నీళ్ళను అందించాలని సూచించారు. ఇందుకోసం అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి పనులను పర్యవేక్షించాలని ఆమె ఆదేశించారు. మిషన్ భగీరథ పంప్‌హౌస్ వద్ద కలెక్టర్ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్.డి.డబ్లు.ఎస్. సి.ఈ. ప్రసాద్‌రెడ్డి, ఎస్.ఈ. రమేష్, ఎల్లారెడ్డి ఆర్.డి.ఓ. దేవేందర్ రెడ్డి, ఆర్.డబ్లు.ఎస్. బాన్సువాడ ఈ.ఈ. చౌదరిబాబు, డి.ఈ.లు రాకేష్, లక్ష్మినారాయణ, వెంకట్‌స్వామి, సదాశివనగర్ తహశీల్దార్ అమీన్‌సింగ్, జెడ్.డి.పి.టి.సి. పడిగెల రాజేశ్వర్‌రావు, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గడిల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments