భక్తుల కొంగు బంగారం.. చెన్న కేశవాలయం

Laxmi chennakeshava Temple in Nagarkurnool districtప్రకృతి సోయగాలు, పక్షుల కిలకిలారావాలతో ఆహ్లాదకరంగా ఉండే నల్లమల అటవీ ప్రాంతం పురాతన ఆలయాలకు నిలయం. నల్లమల కొండలను భూలోక కైలాసంగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఎన్నో చారిత్రాత్మకమైన, శిల్పసంపద కలిగిన ఆలయాలకు నెలవు నల్లమల. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో చరిత్ర కలిగిన ఆలయాలు ఉన్నా అవి నిరాదరణకు గురైనాయి. ఇలాంటి ఆలయాలలో ఒకటి లక్ష్మీ చెన్న కేశవాలయం.

ఆలయ చరిత్ర: నల్లమల అటవీ ప్రాంతంలోని
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట తాలూకా బల్మూర్ మండలం కొండనాగుల గ్రామంలో పురాతన చెన్నకేశవ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని దేవరకొండ మాధవరాజు నిర్మించారు. వీరు గోదల్ సంస్థనాదీశులు. దేశ్‌ముఖ్ వంశస్థులు ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. శాలి వాహన శకం ప్రకారం 1720లో ఆలయానికి అసూరి వంశస్థులు ధర్మకర్తలుగా, పూజారులుగా వ్యవహరిస్తున్నారు. ఆనాడు వెంకటాచార్యులను పూజారిగా నియమిస్తూ తెలుగు, ఉర్దూలో పత్రాన్ని రాసి ఇచ్చినట్లు తెలిపారు. దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం గచ్చుతో ఆలయ గోపురాన్ని నిర్మించారు. ఆలయం దాదాపు వంద అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆలయం మొత్తం చేప ఆకారంలో ఉండటం విశేషం.

ఆలయంలోని గర్భగుడి రెండున్నర గజాల స్థలం లో ఉంటుంది. గర్భాలయ ద్వారానికి పై దర్వాజా కు రెండు ఏనుగులతో కూడిన గజలక్ష్మి విగ్రహం ఉంది. ద్వారానికి ఇరు వైపులా ద్వార పాలకుల విగ్రహాలు ఉంటాయి. కింది గడపకు రెండు హంసలు, రెండు సింహాలు ఉంటాయి. పదహారు రాతి స్తంభాలతో ఆలయ మండపం ఉంది. గర్భగృహం, అర్థ మండపం, రంగమండపం కలిపి 36 స్తంభాలతో ఆలయ మండపం కనబడుతుంది. ప్రధాన ద్వారానికి రెండు వైపులా నాగుపాముల శిల్పాలు దర్శనమిస్తాయి. ఆలయానికి తూర్పు, దక్షిణం, ఉత్తరం వైపులా ద్వారాలు ఉన్నాయి. ఉత్తర ద్వారానికి పై గడపకు రెండు ఏనుగులతో కూడిన గజలక్ష్మి, రెండు వైపులా పూర్ణ కుంభాలు ఉన్నాయి. ఆలయమెట్లపై కుడి పూర్ణకుంభం కనిపిస్తుంది. ఆలయం శిథిలావస్థకు చేరడంతో గత కొన్నేళ్లుగా ఆలయ పూజారి తన సొంత ఖర్చుతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నాడు.

ఆలయం ఏ కాలం నాటిది: ఇక్షాకులు, విష్ణు కుండినులు, చోళులు, కాకతీయులు, నాగుల వంశస్థులతో ఈ ప్రాంతం అనుబంధం కలిగి ఉంది.
ఆలయ విశిష్టత: కొండనాగుల గ్రామ శివారులో చిన్న గుడిబండ, పెద్ద గుడిబండ అనే రెండు గుట్టలు ఉంటాయి. నాటి రాజులు చిన్న గుడిబండ లో చెన్న కేశ వ ఆలయాన్ని, పెద్ద గుడిబండ లో రామలింగేశ్వర ఆలయా న్ని నిర్మించారు. ఈ రెండు ఆలయాలు గ్రామానికి దక్షిణ ముఖంగా ఉంటాయి. రెండు గుట్టలపై ఆకర్షణీయంగా కనబడుతాయి. కొండపై దేవాలయం నిర్మించడంతో పాటు నాగుల వంశస్థులు పాలించడంతో ఈ గ్రామానికి కొండనాగులుగా పేరు వచ్చిందని స్థానికులు తెలిపారు.

ఆలయ నిర్మాణం ఎలా ఉంది: చెన్న కేశవ ఆలయం లోపల ఆగ్నేయం మూలన కోనేరు ఉన్నది. ఆలయంలో స్వామి వారితో పాటు లక్ష్మీదేవి కొలువుదీరి ఉంటుంది. ఆలయం లోపల రామానుజ, శంకరా చార్యుల విగ్రహాలు ఉండడం ఆలయానికి మరో ఆకర్షణగా చెప్పుకోవచ్చు. గోదల్ పట్టీని పాలించే దేశ్‌ముఖ్‌లు, దేశినేని వంశస్థులు ఆలయానికి ధర్మకర్తలుగా ఉండే వారు. పూజారులుగా అసూరి వంశస్థులు ఉండేవారు. గోకులాష్టమి రోజున ఇక్కడి యాదవులు ఉట్లు కొట్టి సంబురాలు నిర్వహించేవారు. దానికి సంబంధించిన ఉట్లు కొట్టే స్తంభాలు ఆనవాళ్లుగా ఉన్నాయి. ఆలయానికి ఈశాన్యం, ఆగ్నేయం వైపుల ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉండడం మరో విశేషం.

ఎలా వెళ్లాలి: హైదరాబాద్ నుంచి వెళ్లాలనుకునే వారు అచ్చంపేటకు చేరుకుని అక్కడి నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండనాగులకు వచ్చి ఆలయానికి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుండి 130 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. శ్రీశైలం వెళ్లే భక్తులు ఉమామహేశ్వరాన్ని దర్శించుకుని అక్కడి నుండి కేవలం 17 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ చెన్న కేశవ ఆలయాన్ని వెళ్లేందుకు వీలుంటుంది.

ఆలయాన్ని వెలుగులోకి తేవాలన్నదే లక్ష్యం: అసూరి కారంచెడు వేణుగోపాల్ (ఆలయ పూజారి)
పూర్వం నుంచి చిన్న గుడి బండలో శ్రీలక్ష్మి చెన్న కేశవ దేవాలయంలో అసూరి వంశస్థులకు చెందిన వారమే పూజలు చేస్తున్నాం. ప్రతిరోజు స్వామి వారికి ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తున్నాం. సొంత ఖర్చులతో ఆలయాన్ని రూ.7.50 లక్షలతో అభివృద్ధి చేశాం. ఆలయానికి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నాం.

-బాలరాజు, అచ్చంపేట, మన తెలంగాణ ప్రతినిధి