బోధనా వైద్యులకు నిర్ణీత కాల పదోన్నతులు

Specific term promotions for teaching physicians

ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం
నేడో రేపో ఉత్తర్వులు జారీ

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో బోధనాస్పత్రుల్లో పని చేసే వైద్యులకు పనిచేసిన కాలపరిమితికి అనుగుణంగా ఇక పదోన్నతులు లభించనున్నాయి. అందుకు సంబంధించి యాంత్రిక పదోన్నతుల విధానం (సిఎఎస్) ఫైలుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సోమవారం సంతకం చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. దీర్ఘకాలికంగా ఉన్న డిమాండు మేరకు వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేష్‌రెడ్డి, మంత్రి లక్ష్మారెడ్డిలు పంపిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి యథాతథంగా ఆమోదించారు. ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నాయి. తాజా నిర్ణయాల ప్రకారం బోధనాస్పత్రుల్లో నాలుగేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్‌గా, ఆరేళ్లు సర్వీస్ పూర్తయిన అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్‌గా ఆటోమేటిక్ పద్ధతిలో పదోన్నతి లభించనుంది. దీంతోపాటు అసోసియేట్ ప్రొఫెసర్‌గా మూడేళ్లు పూర్తయినవారి ‘పే స్కేల్’లో మార్పులు చేస్తారు. ప్రస్తుతం బోధనా వైద్యుల పదోన్నతులు అశాస్త్రీయంగా ఉన్నాయన్న విమర్శల నేపథ్యంలో తాజా ప్రభుత్వ నిర్ణ యం ఊరట కలిగించింది.

కొందరికి మాత్రమే పదోన్నతులు లభిస్తుండడం, ఒక్కోసారి పదిహేనేళ్లకు పదోన్నతులు వస్తుండటం తదితర విధానాలను మార్చాలని వైద్యులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కొత్త విధానాలు అమలవుతున్నాయి. బోధనాసుపత్రుల్లో ప్రొఫెసర్ల రిటైర్మెంటు వయో పరిమితిని 65 సంవత్సరాలకు పెంచాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం తీసుకురావటంతో బోధనాస్పత్రుల్లో పనిచేసే వైద్యుల్లో మరింత ఆందోళన నెలకొంది. ఆందోళన బాటపట్టిన నేపథ్యంలో సిఏఎస్ విధానం తెరపైకి వచ్చింది. సిఏఎస్ అమలైతే రాష్ట్రంలో బోధనాస్పత్రుల్లో పనిచేస్తున్న దాదాపు 2, 700 మంది వైద్యులకు ప్రయోజనం కలగనుంది. అంతేగాక వారికి పదోన్నతి వచ్చిన ప్రతిసారీ వేతనంలో మార్పులు జరుగుతాయి. ఇక ప్రొఫెసర్ గా ఉన్నవారికి తదుపరి పదోన్నతులు లేకపోయినా నిర్ణీత సమయం ప్రకారం వారి వేతనంలో మార్పులు చేస్తారు.

ప్రభుత్వ వైద్యుల సంఘం హర్షం
సిఏఎస్ విధానానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలపడం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం కేంద్ర విభాగం నాయకులు డాక్టర్ నరహరి, డాక్టర్ ప్రవీణ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం వారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డిని కలిసి వారు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

comments