బిసిల వందేళ్ల వెనుకబాటు!

BP Mandal hundred Jayanti celebrations

18 ఆగష్టు 1918న పుట్టిన బి.పి. మండల్ శత జయంతి ఈ సంవత్సరమే. మండల్ శత జయంతి సందర్భంగా అన్ని రంగాల్లో బిసిలు, మిగతా సామాజిక వర్గాలు మూడు వ్యవస్థల్లో రిజర్వేషన్లన్లు దామాషా మేరకు పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చుకొని అన్ని స్థానాల్లో ఎదగాలని ప్రతిజ్ఞ తీసుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఉన్నదాంతో సరిపుచ్చుకోవడం బానిసల, అర్ధబానిసల, వేతన జీవులు, అల్పసంతోషిత్వంతో జీవిస్తే పూర్తి స్వాతంత్య్రం, సాధికారికత ఎప్పటికీ సాధ్యం కావు. బిసిలు, మిగతా అణగారిన సామాజికవర్గాలు రిజర్వేషన్ల ద్వారా ఇతరత్రా, సమస్త రంగాల్లో, సమస్త స్థాయిల్లో, దామాషా మేరకు ప్రాతినిధ్యం పొందగలిగినప్పుడే నిజమైన పంద్రాగష్టు.

ఓటు వేసే హక్కు ఉండడం, ఒక స్థాయి స్వేచ్ఛకు ప్రతీక. చట్టసభలకు ఎన్నిక కావడం, పరిపాలనా రంగంలో న్యాయ వ్యవస్థలో జనాభా దామాషా ప్రాతినిధ్యం పొందడం ద్వారానే ఆయా సామాజిక వర్గాలకు నిజమైన స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్య్రం లభించినట్టు. భారత రాజ్యాంగంలో మూడు ప్రధానాంగాలు అవి చట్టసభలు, పరిపాలనా, న్యాయవ్యవస్థలు. ఈ మూడింటిలో జనాభా దామాషా మేర కు బిసిలు ప్రాతినిధ్యం ఇంకా పొందవలసి ఉంది. 1993 లో మండల్ కమిషన్ సిఫారసుల మేరకు సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి బిసిలకు కేంద్ర ప్రభుత్వ రంగంలో 27 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టినప్పటికీ 7.11 శాతం మాత్రమే ఉద్యోగాలు పొందగలిగారు. 52 శాతం జనాభాకు ఇది ఒక లెక్కలోకి రాదు.

చట్టసభలు, పరిపాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థలలో ప్రస్తుతం బిసిలు, ఒబిసిలు, సరియైన ప్రాతినిధ్యం లేని మిగతా సామాజిక వర్గాలు గత శతాబ్దంలో 192040 మధ్య కాలంలో చట్టసభల్లో ఎంతో కొంత ప్రాతినిధ్యం, అధికారాలు పొందిన సామాజిక వర్గాల స్థాయిలోనే నేడూ కొనసాగుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మూడు వ్యవస్థల్లో బిసిలు వందేళ్ళు వెనకబడి కొనసాగుతున్నారు. ఈ మూడింటిలో జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు చక్కగా అమలు జరిగినప్పుడే బిసి సామాజిక వర్గాలకు నిజమైన పంద్రాగష్టు స్వాతంత్య్రం ఫలసిద్ధి లభిస్తుంది. ఈ విషయం అర్థం చేసుకోకపోతే, లక్ష్యం, గమ్యం అగమ్యగోచరంగా ఉంటాయి.

బ్రిటీష్ పాలకులు రూపొందించిన 1935 భారత రాజ్యాంగ చట్టాన్ని అనుసరించి 1949 నవంబర్ 26న నేటి రాజ్యాంగాన్నే ఆమోదించడం జరిగింది. 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. 1947 ఆగష్టు 15 తేదీన స్వాతంత్య్రం వచ్చింది. స్వాతంత్య్రం తర్వాత పరిపాలన, ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా ఉండాలనే అంశంపై రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. అందులో 298 మంది సభ్యులు. వారు 1935 నాటి భారత రాజ్యాంగ చట్టాన్ని స్వతంత్ర భారతానికి అనువుగా మార్చుకొని కొత్త రాజ్యాంగాన్ని సరికొత్తగా రాసుకొని జాతికి అంకితమివ్వడం జరిగింది. పంద్రాగష్టు స్వాతంత్య్ర దినోత్సవం అని బాగా ప్రచారం చేస్తుంటాం గానీ, 1935 నుంచే చాలా రాష్ట్రాల్లో, ప్రావిన్సులలో, సంస్థానాలలో ప్రజాప్రతినిధుల ఎన్నికలు జరగి, ముఖ్యమంత్రులు నియమితులయ్యారు. మంత్రివర్గాలు ఏర్పడ్డాయి. ఇంకా సరిగ్గా చెప్పాలంటే 192627 లలో అనేక బ్రిటీషు ప్రావిన్సులలో పరిమిత అధికారులతో శాసనసభలు, మంత్రివర్గాలు ఏర్పడడం ప్రారంభమైంది.

అలా కొంత కాలంపాటు కొంత అధికారం, అనుభవం సంపాదించినవారు, జాతీయ ఉద్యమంలో పాల్గొన్నవారు కలిసి స్వాతంత్య్రా నంతరం పోటీ చేస్తూ చట్టసభల్లో ఎన్నిక కావడం జరుగుతూ వచ్చింది. అలా స్వాతంత్య్రానికి పూర్వం అందిన అవకాశం, అనుభవం, స్వాతంత్య్రానంతరం వారు పూర్తిస్థాయి చట్టసభల ప్రతినిధులుగా ఎన్నిక కావడానికి ఎంతగానో తోడ్పడ్డాయి. ఈ అనుభవంలేని సామాజిక వర్గాలు, కులాలు స్వాతంత్య్రానంతరం అనుభవం లేక కొంత, ఆసక్తి లేకపోవడం వల్ల కొంత, స్వాతంత్య్రం విలువ తెలువకపోవడం వల్ల కొంత, ఆర్థిక, సామాజిక స్థాయి లేకపోవడం మరి కొంత కలిసి వెనుకబడిపోతూ వచ్చారు.

సంస్థానాధిపతులు, రాజులు, బ్రిటీషు పాలకులు, వెళ్లిపోవడంతో స్వదేశీ సామాజిక వర్గాలు, కులాలు, పూర్తిస్థాయి అధికారం సంపాదించుకోవడం జరుగుతూ వచ్చింది. డా॥ బి.ఆర్. అంబేడ్కర్ నిరంతర ఉద్యమ ఫలితంగా 1932 నుంచి చట్టసభల్లో ఎస్‌సిలకు రిజర్వేషన్లు కొనసాగుతూ వచ్చాయి. 80 ఏళ్ళు గడిచినా బిసిలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అమల్లోకి రాలేదు. స్వదేశీ పాలకులకన్నా, విదేశీ పాలకులు ఉదారంగా ఉంటారని మహాత్మా జ్యోతిబా ఫూలే చెప్పిన విషయం దశాబ్దాలుగా వాస్తవమని రుజువు అవుతూనే ఉంది.

రెండున్నర వేల ఏళ్ళుగా ప్రపంచానికి, దేశానికి సమస్త సంపదను, నైపుణ్యాలను సృష్టించి అందించిన శూద్రులు తమ సామాజిక గౌరవాలనుండి, నైపుణ్యాలనుండి వెనక్కినెట్టివేయబడి అధోగతి పాలు కావడానికి కారణాలేమిటో అన్వేషించడం అవసరం. అప్పుడే బిసిల, ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రాతినిధ్యం లేని ఇతర సామాజిక వర్గాల కర్తవ్యాలు ఎంత గురుతరమైనవో తెలుస్తాయి. ఏదో ఉద్యోగం దొరికింది, ఏదో ఇంత సంపాయించుకున్నాను. ఏదో పిల్లలు ఎదిగారు, ఎదుగుతున్నారు అనే అల్పసంతోషిత్వం కొనసాగితే తమ సాధికారికతను సాధించడం రోజు రోజుకు దూరమవుతూనే ఉంటుంది.

పారిశ్రామిక విప్లవం క్రీ.శ. 1750లో ప్రారంభమై 1810 నాటికి వేగం పుంజుకుంది. అంతకుముందు ఉత్పత్తి రంగం, రవాణా రంగం కుటీర, చేతివృత్తి పరిశ్రమలుగా శతాబ్దాల తరబడి కొనసాగుతూ వచ్చాయి. క్రీ.పూ. 3500 సంవత్సరాల నుండి లోహయుగం కొనసాగుతూ వచ్చింది. లోహయుగంలో రాగి, ఇత్తడి, కంచు, వెండి, బంగారం, ఆ తర్వాతి కాలంలో ఇనుము కనుగొని వాడుకలోకి తెచ్చుకోవడం జరిగింది. వీటికి ముందు తోలు విప్లవం చాలా కాలం సాగింది. తోలు అనేక రకాలుగా ఉపయోగపడింది. బట్టలుగా, డప్పు, డోలక్, మృదంగం, డమరుకం వంటి వాయిద్యాలుగా, నీళ్ళు మోసుకుపోయే సంచులుగా, చలికి కప్పుకునే దుప్పట్లుగా ఉపయోగపడుతూ వచ్చింది. తోలు స్థానంలో నారబట్టలు, ఉన్ని గొంగళ్ళు, బట్టలు, ఆ తర్వాత నూలు బట్టలు, పట్టుబట్టలు విస్తరిస్తూ వచ్చాయి.

లోహ యుగం గణతెగల జనపదాల తండాల కాలంలో ప్రారంభమై క్రమంగా ఆయా వృత్తులుగా, స్థిరపడుతూ వచ్చింది. లోహ యుగానికి ప్రతీకగా, ప్రతినిధిగా విశ్వకర్మ కులాలవారు నేటికీ కొనసాగుతున్నారు. మట్టి కుండలు, అంతకన్నా పాత యుగానికి సంబంధించినవి. భారీ యంత్రాలు, భారీ ఉత్పత్తులు, భారీ మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పడడానికి దారి తీసింది. యూరప్ వారి బంగారం అన్వేషణ కోసం ప్రారంభమైన సముద్ర మార్గాల అన్వేషణ ప్రపంచ చరిత్రను మలుపు తిప్పింది. అంతకుముందు సంచార జీవనం, వలసలు, దాడులు, దండయాత్రలు రాజ్యాల ఏర్పాటు ద్వారా ప్రపంచ చరిత్ర మలుపు తిరిగింది. ఆర్యులు, ద్రవిడులు, గ్రీకులు, మొదలైన వారి పరిణామాలు సాగాయి.

పారిశ్రామిక విప్లవానికి ఆవిరి యంత్రం, నూలు వడికే యంత్రం ఊపిరి పోశాయి. విద్యుత్, ఇనుము ప్రపంచాన్ని మలుపు తిప్పాయి. ఇతర దేశాల్లో ఆయా వృత్తినిపుణులు ఆయా రంగాల్లో పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. భారతదేశంలో కుల వ్యవస్థ పరిమితుల వల్ల ఈ వృత్తుల వారు కార్మికులుగా, కూలీలుగా మారిపోవాల్సి వచ్చింది.

వాలీబాల్, బ్యాట్‌మింటన్‌లో అవతలివైపు బంతి చేరాలంటే బంతిని లేపి వలపైనుంచి అవతలికి బ్యాట్‌తో కొట్టాల్సిందే. ఆరడుగుల గోడను ఎన్నిసార్లు దూకినా పది అడుగుల గోడను దూకినట్టు కాదు. అందువల్ల నిజమైన స్వాతంత్య్రం పూర్తిస్థాయిలో పొందడానికి నాటి జాతీయ ఉద్యమంలో మాదిరిగా బిసిలు మిగతా సామాజిక వర్గాలు అవకాశాలు, అధికారాలు, సాధికారికతను అందినకాడికి అందిపుచ్చుకుంటూ, అందుకోవాల్సిన ఉన్నత లక్ష్యాలను అందుకోవడానికి చైతన్యశీలంగా ముందుకు సాగాలి. రావ్‌ుమనోహర్ లోహియా, బి.పి. మండల్, మాన్యశ్రీ కాన్షీరాం వంటి వారి కృషివల్ల కొద్దికొద్దిగా అవకాశాలు అందిపుచ్చుకోవడం జరుగుతూ వస్తున్నది. సమగ్ర సమాజ వికాసం, సమ్మిళిత అభివృద్ధి కోసం కృషి చేస్తే అందరికి పూర్తిస్థాయి పంద్రాగష్టు కాలక్రమంలో అనుభవంలోకి వస్తుంది. అదే బి.పి. మండల్ శత జయంతికి నిజమైన నివాళి. మండల్ శతజయంతి సందర్భంగా మండల్‌ను ‘భారతరత్న’తో గౌరవించుకోవడం జాతి తనను తాను గౌరవించుకోవడమే.