బాలల రక్షణ చట్టానికి తూట్లు పొడుస్తున్న ప్రభుత్వాలు!

childనేటి బాలలే రేపటి దేశ పౌరులు. కౌమార దశలో   నేర్చుకొన్న విద్య, తిన్న తిండి వారి భవిష్యత్తుకు పునాది.    జీవితంలో ఉత్సాహం, ఉత్తేజం, ఉరకలు వేసే ఉజ్వలమైన దశ అది. ఏ దేశానికైనా యువశక్తే గొప్ప సంపద. ఈ విషయంలో భారతదేశం కంటే సంపన్న దేశం ప్రపంచంలో మరొకటి లేదు. కాబట్టి, దేశ బాలలను విద్యకు దూరం చేసే పరిస్థితులు రాకూడదు. అందరికీ విద్య అందజేసి యువతను నాణ్యమైన మానవ  వనరులుగా తీర్చిదిద్దుకోవాలి. కానీ, విద్యాహక్కు అసలు  లక్ష్యానికే తూట్లు పొడిచేలా చట్ట సవరణలు ఉన్నాయన్నది  నిష్ఠురసత్యం. పేదరిక నిర్మూలన లక్ష్యానికి ఇది పూర్తి విరుద్ధం. 

-మన దేశంలో ప్రమాదకర పనుల్లో 14 సంవత్సరాల లోపు పిల్లలను ఉపయోగించరాదని బాలకార్మిక నియంత్రణ చట్టం-1986 చెబుతోంది. తాజా చట్టంలో 14-18 మధ్య వయసు పిల్లలనూ చేర్చారు. ప్రమాదరహిత కుటుంబ వృత్తులు, వ్యాపారాలు, చివరకు వ్యవసాయ పనులూ పిల్లలు చేయడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తోంది. సెలవుల రోజుల్లో బడి గంటలు ముగిసిన తరువాత పిల్లలు పనికి వెళ్ళవచ్చని చెబుతోంది. టీవీ సీరియళ్ళు, సినిమాలు, వ్యాపార వాణిజ్య ప్రకటనలు, ఇతర వినోద, క్రీడారంగాల్లో వారు పని చేయవచ్చని స్పష్టం చేసింది. ప్రమాదకర పనుల, ప్రక్రియల జాబితాలోని అంశాలను 90 నుంచి 31 కి కుదించింది. కార్పెట్, జరీ, బీడీ, మైకా, వజ్రాల కోత, పారిశుద్ధ్యం, ఇటుక బట్టీలు, పొలం పనులు, తదితర ప్రమాదరహిత పనులకు జాబితాలో చోటు కల్పించారు. గనులు, మండే స్వభావం ఉండే పదార్ధాలు, ఫ్యాక్టరీల చట్టం కింద ప్రమాదకర ప్రక్రియలుగా పరిగణించే రంగాలను ప్రమాదకర పరిశ్రమల విభాగంలో చేర్చారు. భవిష్యత్తులో ఏదైనా వృత్తి లేదా పనిని ప్రమాదరహితమైనదని కేంద్రం భావిస్తే, చట్ట సవరణతో పనిలేకుండా ఆ విభాగంలో చేర్చే హక్కు ఉంటుంది. కాబట్టి, ఈ కొత్త చట్టం ప్రకారం ఇంటి చాకిరీ, వ్యవసాయ పనుల్లో పిల్లలను యధేచ్చగా ఉపయోగించుకోవడంతో పాటు, ఏకంగా ప్రమాదకర పరిశ్రమల్లోనూ నియమించుకునే అవకాశం ఉందంటున్నారు. అసలు ఈ చట్టాన్ని సవరించాలని ఎవరూ కోరలేదు. ప్రభుత్వంపై ఒత్తిడి తేలేదు. పలుకుబడి కలిగిన కొంతమంది ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఈ సవరణలకు పూనుకొందన్న విమర్శలు ఆలోచింపజేసేవే. చట్ట సవరణల వల్ల మధ్యలో బడిమానివేసే పిల్లల సంఖ్య పెరుగుతుందని అంటున్నారు. సవరణలోని లోపాలను కొందరు స్వార్థపరులు దుర్వినియోగపరచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త చట్టం ప్రకారం 14ఏళ్ళ లోపు పిల్లలను సైతం కులవృత్తుల్లో ఉన్న బాబాయిలు, మామలు, నాన్నలు, రక్త సంబంధీకులు యధేచ్చగా తమ పనుల్లో పెట్టుకోవచ్చు. ఇష్టానుసారంగా బాల కార్మికులను నియమించుకునే స్వేచ్చ ఇకపై వారికి లభిస్తుందని నోబెల్ బహుమతి గ్రహీత  కైలేష్ సత్యార్ధి ఆవేదన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునిసెఫ్ సైతం చట్టసవరణలపై విమర్శలు గుప్పించింది. వృత్తిపనులు, కుటుంబ వ్యాపారాల్లో తల్లిదండ్రులు బయటకు వెళ్ళినపుడు కొద్దిసేపు పిల్లలు ఆ పనులు చూస్తూ ఉండడం సాధారణంగా జరిదేదేనని చెబుతున్నారు. బాల కార్మిక వ్యవస్థ  నిషేధానికి సంబంధించి కొత్త చట్టం ప్రకారం వ్యాపార సంస్థలపై నియంత్రణ, పర్యవేక్షణ పెద్ద సవాలుగా మారుతోంది. కుటుంబ వృత్తులు, వ్యాపారాలు అన్న పదాలకు చట్టంలో సరైన నిర్వచనాలు లేవు. పనిలో ఉన్న పిల్లలు ఎవరు, యజమానితో వారికున్న సంబంధం ఏమిటన్న అంశాలను తనిఖీ అధికారులు గుర్తించగలరా? ప్రశ్నించిన అధికారులకు యజమానులు తప్పుడు సమాచారం అందజేసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. దగ్గరి బంధువుల పిల్లలు అంటూ పక్కదారి పట్టించవచ్చు. చట్ట సవరణ ద్వారా కౌమార దశ పిల్లలను ప్రమాదకర పనుల్లో పెట్టకూడదంటూ ఒకపక్క చెబుతూనే, మరోవైపు ప్రమాదకర పనుల జాబితానూ బాగా కుదించడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?  నేటి బాలలే రేపటి దేశ పౌరులు. కౌమార దశలో నేర్చుకొన్న విద్య, తిన్న తిండి వారి భవిష్యత్తుకు పునాది. జీవితంలో ఉత్సాహం, ఉత్తేజం, ఉరకలు వేసే ఉజ్వలమైన దశ అది. ఏ దేశానికైనా యువశక్తే గొప్ప సంపద. ఈ విషయంలో భారతదేశం కంటే సంపన్న దేశం ప్రపంచంలో మరొకటి లేదు. కాబట్టి, దేశ బాలలను విద్యకు దూరం చేసే పరిస్థితులు రాకూడదు. అందరికీ విద్య అందజేసి యువతను నాణ్యమైన మానవ వనరులుగా తీర్చిదిద్దుకోవాలి. కానీ, విద్యాహక్కు అసలు లక్ష్యానికే తూట్లు పొడిచేలా చట్ట సవరణలు ఉన్నాయన్నది నిష్ఠురసత్యం. పేదరిక నిర్మూలన లక్ష్యానికి ఇది పూర్తి విరుద్ధం. ప్రభుత్వాలు ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇకనైన ఈ విషయంలో పునరాలోచన జరిపితే బాలల బతుకులకు మరింతగా భరోసా కల్పించినట్లే.

శ్రీనివాస్ చిరిపోతుల