బయటపడ్డ టిఆర్‌ఎస్, బిజెపి విభేదాలు

BJP leaders wrath with the MLA Laxman photo on water ATM

హైదరాబాద్: బాగ్‌లింగంపల్లి సుందరయ్యపార్కు వద్ద ఏర్పాటు చేసిన వాటర్ ఎటిఎం ప్రారంభోత్సవంలో ముషీరాబాద్ నియోజకవర్గంలోని అధికార పార్టీ నేతలకు, బిజెపి నేతలకు మధ్య తీవ్ర వాగ్వావాదం జరిగింది. గత కొన్ని నెలలుగా బిజెపి, టిఆర్‌ఎస్ పార్టీల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు మరోసారి ఈ ఘటన ద్వారా బయటపడ్డాయి. వాటర్ ఎటిఎం కేంద్రంపై ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటోలో సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఫొటోలతో పాటు అదనంగా నగరంలో ఏ వాటర్ ఎటిఎంకు లేని విధంగా హోంమంత్రి నాయిని, కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డిల ఫొటోలు ఏర్పాటు చేసి, స్థానిక ఎంఎల్ఎ లక్ష్మణ్ ఫొటో లేకపోవడంతో బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం బాగ్‌లింగంపల్లి సుందరయ్యపార్కు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ఎటిఎం కేంద్రం ప్రారంభోత్సవానికి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, జిహెచ్‌ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు, స్థానిక కార్పొరేటర్ వి.శ్రీనివాస్‌రెడ్డిలు హాజరయ్యారు. ఈ సమయంలోనే వాటర్ ఎటిఎం కేంద్రానికి ఉన్న ప్రభుత్వం అధికారికంగా ముద్రించిన పోస్టర్‌లో సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్, మేయర్ బొంతు రామ్మోహన్‌లే ఉండాలని, తెల్లారేసరికి ఆ పోస్టర్‌లో మంత్రి నాయిని, కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డిల ఫొటోలుండటాన్ని గమనించిన బిజెపి డివిజన్ అధ్యక్షులు కలకోట అరుణ్‌కుమార్, బిజెపి నేతలు జైపాల్‌రెడ్డి, పార్థసారధి, ఉపేందర్, జక్క శ్రీనివాస్ తదితరులు స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డితో ప్రొటోకాల్ ప్రకారం ఎంఎల్ఎ లక్ష్మణ్ ఫొటో లేదని వాగ్వావాదం చేసారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సమక్షంలోనే అధికార పార్టీకి వ్యతిరేకంగా బిజెపి నేతలు నినాదాలు చేశారు. మంత్రి నాయినిని సైతం నిలదీశారు. ప్రొటోకాల్ తెలియని ప్రభుత్వం డౌన్… డౌన్.. అంటూ బిజెపి నేతలు మంత్రి ఎదుటే నినాదాలు చేశారు. షేమ్….షేమ్ అంటూ ఎద్దెవా చేస్తూ నినాదాలు చేశారు. దీనికి స్పందించిన మంత్రి మీరు చెప్పితే తెలుసుకోవాలా ? అని చెప్పుకుంటూ వెళ్లిపోయారు. కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి స్పందిస్తూ ప్రతి సారి నినాదాలు చేస్తున్నారని, మేము కూడా వ్యతిరేకంగా చేస్తామని అనడంతో ప్రతి అభివృద్ధి కార్యక్రమం ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్ ప్రకారం ఎంఎల్ఎ లక్ష్మణ్ ఫొటో పెట్టకపోవడం, పేర్లు పెట్టకుండా మీరు చేస్తున్నారని కార్పొరేటర్‌తో వాగ్వాదం చేశారు. కొద్ది సేపటికి పరిస్థితి సద్దుమణిగింది. అయితే ఎమ్మెల్యే రావడం ఆలస్యం కావడంతో ఈ ప్రొటోకాల్ విషయం తెలుసుకున్న లక్ష్మణ్ ప్రారంభోత్సవానికి రాలేదు. ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి సర్కిల్-15 డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ కృష్ణశేఖర్, ఎఎంహెచ్‌ఒ డాక్టర్.భార్గవ నారాయణ, ఈఈ లక్ష్మీనారాయణ, టీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షులు రేషం మల్లేష్, సిరిగిరి శ్యామ్, వాహెద్ అలీ, శివ కుమార్, వార్డు కమిటీ సభ్యులు దామోదర్‌రెడ్డి, పాశం శ్రీనివాస్, ముదిగొండ మురళి, బిజెపి నేతలు ఉదయ్ భగవత్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.