బతుకు గతుకులు

నా కొడుకో..! కొడుకా..! నీకెంత కట్టమచ్చిందిరో.. కొడుకా..! నీ బతుకు బండలు సేత్తిరో.. కొడుకా..!  నాకు సావన్నా రాకపాయెరా.. కొడుకా..!! అని వల్లిచ్చుకుంట గుడిసె అరుగు మీద కూకోని ఏడ్వబట్టింది ఎల్లవ్వ. బెల్లం సుట్టు ఈగల్లెక్క వాడకట్టోల్లంత మూగిండ్లు. ఇంతల బాలయ్య ఎనుగు దడి తెర్సుకొని వచ్చుడు సూసి మంది మెల్లంగ.. మెల్లంగ.. ఒకలెన్క ఒకలు పిల్లి కూనల్లెక్క జారుకున్నరు. ఏందే.. అవ్వా..! ఎవలో సచ్చినట్లు ఏడ్తానవేంది..? బజాట్లకినత్తాంది. సావు గాక ఇంకేందిర కొడుకా.. మన మొకం […]

నా కొడుకో..! కొడుకా..! నీకెంత కట్టమచ్చిందిరో.. కొడుకా..! నీ బతుకు బండలు సేత్తిరో.. కొడుకా..!  నాకు సావన్నా రాకపాయెరా.. కొడుకా..!! అని వల్లిచ్చుకుంట గుడిసె అరుగు మీద కూకోని ఏడ్వబట్టింది ఎల్లవ్వ. బెల్లం సుట్టు ఈగల్లెక్క వాడకట్టోల్లంత మూగిండ్లు. ఇంతల బాలయ్య ఎనుగు దడి తెర్సుకొని వచ్చుడు సూసి మంది మెల్లంగ.. మెల్లంగ.. ఒకలెన్క ఒకలు పిల్లి కూనల్లెక్క జారుకున్నరు. ఏందే.. అవ్వా..! ఎవలో సచ్చినట్లు ఏడ్తానవేంది..? బజాట్లకినత్తాంది. సావు గాక ఇంకేందిర కొడుకా.. మన మొకం నాదాను సేసిందిరా.. నీపెండ్లాం అంటాంటే ఎల్లవ్వ ఎదలకెల్లి దుక్కం ఎగబోసుకుంట రాబట్టింది. మొకానికి కొంగు కప్పుకొని మల్ల సోకునం పెట్టబోయింది. సైసు.. ఆయెంక తాత్పరంగ ఏడ్తువుగాని.. ముందుగాల ఏమైందో చెప్పు అని అని కైక్కుమన్నడు బాలయ్య.

బాలయ్య ఓపక్క గద్రాయించి పెట్టిండు గాని ఇంకోపక్క పానమంత అగులుబుగులు కాబట్టింది. నర్సమ్మ బొంబైకి బండెక్కంగ కడింటి కన్కడు సూసిండట.. వాడియ్యల్లాకచ్చి చెప్పిండు అన్కుంట ముక్కు చీది పక్కకున్న గడెంచె కోడుకు పూసింది ఎల్లవ్వ. కొసకొంగు తోటి తుడ్సీ తుడ్సీ ఎర్రబడ్డ ముక్కును మల్లోపాలి తుడ్సుకున్నది. ముక్కు మండేటాల్లకు నొసలు చిట్లిచ్చి కండ్లు చిట్లిచ్చింది. బాలయ్య పాణం ధస్సుమన్నది.. సైకిలుపయ్య పంపుచారైనట్టు.. గడెంచెల కూలబడ్డడు. దాని కాల్లకట్టతాడు తెగి.. బాలయ్య నడుం న్యాలకానింది. తల్కాయె కింద రెండు అరచేతులు మెత్తలెక్క పెట్టుకొని అట్లనే గడెంచె తలాపుకొరిగిండు.

కండ్లు నిలబడ్డై.. ఎల్లవ్వ కడ్పుల బెగడు సొచ్చింది. కొడుకు సోయి తప్పిండా.. ఏంది..? అన్నట్టు.. సట్న లేసి కొడుకు నొసలు మీద చెయ్యేసి సూసింది. అవ్వ చెయ్యి తాకెటాల్లకు బాలయ్య పానానికి జరంత నిమ్మలమైంది. తలాపుకున్న ఒక చేయి తీసి నాకేం గాలేదన్నట్టు ఎల్లవ్వకు సైగ సేసుకుంట మల్ల కండ్లు మూసుకున్నడు.ఎంత సల్లని చెయ్యి.. ఎల్లవ్వది రామసక్కని చెయ్యి. ఎన్ని కట్టాల కోర్సింది.. ఎన్ని నట్టాల కోర్సింది. తల్సుకుంటాంటే బాలయ్య పానం ఔసి పోతాంటది. బాలయ్య నాయ్న పేరు ఉప్పలయ్య.

ఉప్పలయ్య బొంబాయిల బట్టల మిల్లుల పనిచేసెటోడు. రెండు సాంచెలు నడుపుకుంట నాలుగు చేతుల సంపాయించేటోడు. కాని ‘ఉన్న నాడు ఉట్ల పండుగ.. లేన్నాడు లొట్ల పండుగ’ అన్నట్టు రేవు తావు లేని కర్సు. తన పెండ్లాం పాపమ్మ కడ్పుల కాయ కాయంది.. కాపాయమెందుకని పైసలు తూర్పార పట్టేటోడు. గిట్లైతే తొవ్వకు రాడని.. వరంగల్ జిల్లా జనగాం దగ్గరి పోసన్నపేటలకెల్లి ఎల్లవ్వను తీసుకచ్చి తన మొగనికి మారు మనువు అంటగట్టింది పాపమ్మ.

అప్పటికే ఎల్లవ్వ ముండరాలు. ఎల్లవ్వ పెద్ద మనిషి గాక ముందే పెనిమిటి కాలం సేసిండు. ఉప్పలయ్యది సుత అదే ఊరు.. ఎల్లవ్వ ఆటు పోట్లన్ని ఎరుకే.. ఎల్లవ్వ వాల్లు కటికె దరిద్రులు.. ఎల్లవ్వ తండ్రి లేని పొల్ల. తల్లి కూలినాలి సేసుకుంట సంసారాన్ని ఈడ్సుకత్తాంది. ఎల్లవ్వకో తమ్ముడు.. ఎంకటేసు వట్టి గాయిదిగాడు. ఎల్లవ్వను పెండ్లి సేసుకొని వాళ్ళ సంసారానికి ఆసరైతామనుకొని ఉప్పలయ్య మారు మాట్లాడకుంట మారు మనువుకొప్పుకున్నడు. ఎంకటేసును బొంబాయి తీసుకచ్చి బట్టల మిల్లుల పనిప్పిచ్చిండు. లగ్గం సుత సేసి పున్నెం మూట గట్టు కున్నడు. ఆ పున్నేమే ఉప్పలయ్య నసీబ్‌ను కులాయించింది. దేవుడు సల్లని సూపు సూసిండు.. యాడాది తిరక్క ముందే తొల్సూరు కొడుకు పుట్టిండు. ఉప్పలయ్య.. పాపమ్మల సంబురం మొగులుకంటింది. వాడకట్టోల్లందరికి శాందాన్ దావతిచ్చిండ్లు.

మల్లో యాడాదికి మల్సూరు కొడుకు బాలయ్య పుట్టిండు. బగ్గ సుఖమైనా.. దుక్కమైనా.. సుక్కేసుడు.. రివాజైన ఈ దినాలల్ల ఉప్పలయ్య సుక్కేసుట్ల సుతి మించిండు. అటు బాలయ్య ఇంట్ల తప్పటడుగులేత్తాందు.. ఇటు ఉప్పలయ్య తప్ప తాగి బజాట్ల యాడబడితే ఆడ కూలబడ్తాండు. ‘గాచారం బాగ లేకుంటే.. ఖుదా క్యా కర్తే..’ అన్నట్టు ఒక రోజు లారి కింద పడ్డడు ఉప్పలయ్య.. పిడాత పానం పోయింది. అప్పటికే ఎల్లవ్వ మల్ల నీల్లు పోసుకున్నది.. పొద్దులు. ‘అయ్య దినాల నాడు పుట్టింది దెశమంతురాలు బిడ్డ’ అని వాడంతా ఆడిపోసుకున్నది. అమ్మలక్కల మాటలు ఇన లేక బొంబాయిల బిచాన ఎత్తేసి.. ముగ్గురు పిల్లలను, పాపమ్మను తీసుకొని సోమన్నపేటకు చేరుకున్నది ఎల్లవ్వ. చెయ్యి తిప్పుకోవాలంటే చేతిల చిల్లి గవ్వ లేదాయే.. ఇంకా నయం ఉప్పలయ్య బొంబాయిల ఆప్పులు చెయ్యలేదు గాని ఎల్లవ్వ పోరు పడలేక.. తిప్పలుపడి సోమన్నపేటల మెన్ రోడ్డుకు ఒక ఇల్లు సంపాయించిండు.

అది దేవుడు ముందు సూపు సూయించిండని ఎల్లవ్వ తన పేరు మీద ఉన్న ఆ ఇంటిని అమ్మింది. అడ్డికి పావుసేరు లెక్కన ఒక సేటు కొన్నడు. ముండరాలంటే లోకంల ఎవ్వలకైనా లోకువే.. వచ్చిన పైసల తోటి అదే ఊల్లె లోపల్కని రెండు గుంటల జాగ కొని గుడిసేసుకున్నది. గుడిసెల మొగ్గం దొరింపు సేసుకున్నది. పట్నం నుంచి మాలు తెప్పిచ్చుకొని చీరెలు నేసుడు సురువు సేసింది. ఊరోల్లంతా ముక్కు మీద వేలేసుకున్నరు. కొందరు ఎల్లవ్వ దైర్నానికి మెచ్చుకున్నరు. పాపం..! అని.. శాన మంది చీరెల కోసరం ఎల్లవ్వకే బయాన ఇచ్చేటోల్లు.

ఎల్లవ్వ రెక్కలు ముక్కలు సేసుకుంట.. గడియ ఇరాం లేకుంట గనారం లెక్క పని సేసేది. మొగ్గం గుంటల కెల్లి లేవక పోయేది. పాపమ్మ ఇంటి పని.. వంటపని సేసుకుంట ఎల్లవ్వకు శాల పనిల ఆసరయ్యేది. దినాలు గడుత్తానై.. పెద్ద కొడుకు చేతికచ్చిండు. మొగ్గం గుంటల ఫాయిదా ఏం పాడైందని అన్నడుపెద్ద కొడుకు. వాని కోసం ఎల్లవ్వ ఒక కుట్టు మిషను కొన్నది. బాంచెను కొడుకా.. పని నేర్సుకోరా పైకత్తవని గీమాలింది. నాలుగొద్దులు మిషను తొక్కిండో.. లేదో.. అవ్వ ఇది నాకు ఇట్టం లేదే.. ఒక్క నాత్రి కట్ట పడితే.. యాడాదంతా కూకోని తినొచ్చే పనులు సూసుకుంట అన్నడు. ఎల్లవ్వకు సమఝ్ కాలేదు.
రెండొద్దులకే పెద్ద కొడుకు బండారం బైట పడ్డది. అడ్డ దారిల రాటు దేలాలని తొలుత చిల్లర మల్లర దొంగ తనాలకు ఎగబడ్డడు. దొంగ సొమ్ము పాపం కొడుకా.. మనకద్దని ఎల్లవ్వ నెత్తీ.. నోరు కొట్టుకున్నది. నిత్తె పోలీసోల్లు ఇంటికి రాను.. కొడుకును ఠాణకు తీసుక పోను.. ఎల్లవ్వకు తల్కాయె కొట్టేసినట్టయ్యేది.

గిట్లైతే తొవ్వకు రాడు.. పెండ్లి చెత్తే రేవుకత్తడని పెండ్లి సేసింది. అది ఇంకా ముప్పుకచ్చింది.. పెండ్లాం మాటలు పట్టుకొని గుడిసెల తన ఇస్సా తనకు కావాలని నిత్తే బాగా తాగచ్చి లొల్లి పెట్టెటోడు.. కుండలు పగుల కొట్టెటోడు. వాని పోరు పడలేక వాని ఇస్సా మందం ఆప్పు సేసి పైకం ఇచ్చింది ఎల్లవ్వ. పైకం పట్టుకొని పెండ్లాన్ని తీసుకొని పరారయ్యిండు. పోయిన పోకట.. మల్ల ఇంటి మొకం సూడలే.. అవ్వ బతికిందో.. సచ్చిందోనన్న రందిరవుసు లేదు.. పత్తాలేదు. బొంబాయిల బతుకుతాండని తెలిసింది.

బాలయ్య ఒక్కనికే సదువు ఒంటబట్టింది. ఎగిలిబారంగ లేసి ఒక బాపనయ్య ఇంట్ల పనికి పోయేటోడు బాలయ్య. ఒక పక్క ఇంటి సారుగమంతా సేసేటోడు. బాసాన్లు కడిగేటోడు.. బట్టలుతికేటోడు.. ఇంకో పక్క బాపనయ్య పిల్లలకు చెప్పే పాఠాలు నేర్సుకునేటోడు. బాలయ్య ఏదైనా ఒక్క సారి ఇంటే మల్ల మర్సి పోయేటోదు గాడు. బాపన్లు సదివే మంత్రాల కాన్నుంచి నేర్సుకున్నడు. బాపనమ్మ పెట్టిన సద్ది కూడు నాలుగు మెతుకులు మాబాగ్యమని గతికి బడికి పోయేటోడు. ఇంట్ల గడుక మాడు చెక్కల కంటే.. ఇది నయం గదా అని సంబుర పడుకుంట. అంత వరకు పడ్డ యాతనంత మర్సిపోయేటోడు.
ఎల్లవ్వ ఆడపిల్లను ఒక అయ్య చేతిల పెట్టింది. వాల్ల నసీబ్ ఖులాయించింది. నాలుగు పైసలు చేతిల ఆడేటాల్లకు బిడ్డకు కండ్లు నెత్తికెక్కినై. పాపమ్మను ఇంట్లకెల్లి ఎల్లగొట్టు. అది ఉండంగా ఇంట్ల అడుగు పెట్టనని ‘మంగమ్మ శఫధం’ సేసింది. ఎల్లవ్వ అరికీసు ఒప్పుకోలేదు. ‘పాపక్క లేకుంటే నా బతుకేమయ్యేదో.. మీకేమెరుక’ అని ఎల్లవ్వ కన్నబిడ్డ దూరమైనా సైసిందే గాని పాపమ్మను దూరం సేసుకోక పోయింది.

ఆ అభిమానమే పాపమ్మ ఎల్లవ్వలకు గట్టి బంధమై నిల్సింది. కాని ఆ బంధం ఎన్నాల్లో నిలువ లేదు. కొద్ది రోజులకే ఆ దేవుడు పాపమ్మను తన దగ్గరికి పిల్సుకున్నడు. ఇక గుడిసెల మిగిలింది ఎల్లవ్వ .. చిన్న కొడుకు బాలయ్య. బొంబాయి నుండి ఎల్లవ్వ తమ్ముడు ఎంకటేసు వచ్చినప్పుడల్లా బాలయ్యను మొగ్గం గుంటల వంగపెట్టుమని ఎల్లవ్వ తోటి నస పెట్టెటోడు. ఎల్లవ్వ పాణం దరియ్యక పోయేది.. ‘నేను మనున్నంత కాలం నా బాలయ్యను మొగ్గం తెరువు రానియ్య’నని తెగేసి చెప్పేది.

బాలయ్య బల్లె పదో తరగతి ఫస్టచ్చిండు. పెద్ద పంతులు ఎల్లవ్వ ఇంటికచ్చి బాలయ్య సదువుల ఉషారున్నడని మెచ్చుకున్నడు. శాతనైన కాడికి బాలయ్యను సదివిత్తనని కంకణం కట్టుకున్నది ఎల్లవ్వ. బాలయ్య బట్టలు కుట్టుడు నేర్సుకున్నడు.. చెట్ల మందుల తోటి వైదుగం సేసుడు నేర్సుకున్నడు. నాలుగు పైసలు సంపాయించుకున్నడు. తన కిట్టమైన హిందీ పండిత్ ధిల్లి దగ్గర ఆగ్రా పట్నంల సేత్తనని పోయిండు. కట్టపడి సదివిండు.. ఎల్లవ్వకు పైసల కోసం కట్ట పెట్టద్దనుకున్నడు. కాని పరీచ్చ పీసుకు పైసలు లేవు. ఎల్లవ్వకు కారటు రాద్దామా.. వద్దా.. అని తక్ మిక్ కాబట్టిండు.
అప్పటికే కొడుక్కు ఎంత తక్లీబ్ అయితాందో ఏమో..! అని గుడిసె పక్కున్న ఖాళి జాగ గిరువు పెట్టి బాలయ్యకు మనార్డరు చెయ్యిమని కడింటి కన్కయ్యకకు పైసలిచ్చింది ఎల్లవ్వ. అవి సరిగ్గ బాలయ్య పరీచ్చ పీసుకు అక్కరకచ్చినై. మనార్దారు ఫారంల కన్కయ్య రాసిన గిరువు సంగతి సదివిన బాలయ్య కండ్లల్ల నీల్లు గిర్రున తిరిగినై.

బాలయ్య ఇంటికి రాంగానే.. పెండ్లి చేసుకొమ్మని పోరు పెట్టింది ఎల్లవ్వ. అది ఎల్లవ్వకు పుర్రెల పుట్టిన బుద్ది కాదు.. తన తమ్ముడు ఎంకటేసు బొంబాయి నుండి కారట్ల మీద కారట్లు రాసుడు.. కొడుక్కు ఎట్లనన్న నౌకరు రాక మానదని నూరి పోసుడు.. మీది కెల్లి మేన సంబందాన్ని కాలదన్నుకోవద్దని పోరు సేసుడు.. ఎల్లవ్వకు మొస మర్ర కుంట సేసింది. బాలయ్యను బతిలాడక తప్పలేదు.. బాలయ్యకు అవ్వ మాటను కాదనకుండా తన కంటే శాన చిన్నదైన నర్సమ్మ మెడల పసుపు తాడు కట్టకా తప్పలేదు. కాని ఒక లంకె పెట్టిండు. ఎల్లవ్వ న్యాత పని బందు పెడితెనే సేసుకుంట అన్నడు. ఎల్లవ్వ సుత ఒప్పుకున్నది. కాని ఈ సందుల నేర్సుకున్న మేర పనిని పండపెట్టలేదు.
ఇంటికి బిడ్డచ్చిన యాల్ల.. గొడ్డొచ్చిన యాల్ల ఆచ్చి రావాలంటరు. నరసమ్మ కడ్పల అట్ల అడుగు పెట్టిందో.. లేదో..! బాలయ్యకు నౌకరి రాదనే వార్త మోసుకచ్చిండు ఆ వాడ కడింటి కన్కయ్య.

బాలయ్య తెలంగాణ కోసరం జరిగిన టైకుల బస్సుల మీద ‘జై తెలంగాణ’ అని రాసిండని పోలీసోల్లు రిపోటిచ్చిండ్లట. నర్సమ్మకామాటలు తుపాకి తూటాలైనై.. నాలుగొద్దులు బాలయ్యకు తన సందిట్ల సయ్యాటలాడిచ్చుకుంట సర్గం సూయించింది. ఐదో రోజు మనసులోని అసలు మాట బైట పెట్టింది. బావా మనం బొంబాయి పోదాం అని బుద్గరిచ్చుకుంట అడిగింది. నౌకరు లేకున్నా ఫరవా లేదు కుట్టు మిషను తీసుకొని పోదా మని సన్నంగ సెగ పెట్టింది. బాలయ్య బుస్సున తాసు పాము లెక్క లేసిండు. కండ్లు చింతనిప్పులైనై. నర్సమ్మ వర్స సూసి ఉగ్ర నర్సిమ్ముడయ్యిండు. కోపాన్నంతా కొత్త పెండ్లాం మ్మీద సూయించితే బాగుండదని తమాయించుకున్నడు. ఒక్కటే మాట కరారు అన్నట్టు.. మా ఎల్లవ్వ నాకు పానం. మా అవ్వనిడ్సి నేను రాను గట్టిగ అన్కుంట గడెంచెల ఉలిక్కి పడ్డడు బాలయ్య. కొడుకా ఏమైందిరా.. కల గిట్లచ్చిందా.. అని బాలయ్య భుజం పట్టి కుదిపింది ఎల్లవ్వ.

రెండు అరచేతుల్తోటి మొకాన్ని రుద్దుకుంట లేసి కూకున్నడు బాలయ్య. ఎదురుంగ ఎల్లవ్వ దీనంగా సూత్తాంది. బాలయ్య కండ్లల్ల సన్నంగ నీల్లు కారబట్టినై. వాడ పొంటి బాలయ్య నడువాలంటేనే,, నారాజ్ కాబట్టిండు. అందరు నన్నే సూత్తాండ్లని.. పెండ్లాం ఇడ్సి పెట్టి పోయిందని.. మన్సుల అనుకుంటాండ్లేమోననే అనుమానం బాలయ్యను పీక్క తింటాంది. కొడుకు కూడనడు.. కుమ్మనడు. ఎల్లవ్వ పానం కలి కలి కాబట్టింది. తాప తాపకు కంట్లె నీల్లూరుతాంటే.. కడ కొంగు తోటి కండ్లనొత్తుకోబట్టింది. ఒక రోజు దంబట్టింది. ఇంకో రోజు చిన్న పిల్ల.. ఏదో తెల్వక అవ్వగారింటికి పోయింది. కొడుకా.. బొంబాయి పోయి కోడలును తీసుకరా.. అని బాలయ్యను బతిలాడింది ఎల్లవ్వ. మన్సును సంపుకొని ఎల్లవ్వ మాట కాదనకుంట బొంబాయికి బండెక్కిండు బాలయ్య. బాలయ్య వచ్చుడు సూసి నర్సమ్మ లబ్బరు చెండు లెక్క ఎగిరింది.

అత్తగారింట సకులం వసతులతోటి బాలయ్యను ఆకట్టుకోవాలని చూసింది నర్సమ్మ. రెండు రోజుల తర్వాత మెల్లంగ నర్సమ్మతోటి.. మన ఇంటికి పోదామని కదిలిచ్చిండు బాలయ్య. రానంటే రానని మొండి కేసింది. బాలయ్య ఇక ఫాయిదా లేదను కొని నర్సమ్మ తొవ్వపొంటే పోయి తన తొవ్వకు తెచ్చుకోవాలనుకున్నడు. బాలయ్యను ఒక పేరున్న దుకాణంల కూలికి బట్టలు కుట్టే పనిలో కుదిర్చిండు ఎంకటేసుమామ. బాలయ్య అప్పటికే దర్జీ పనిలో చెయ్యి తిరిగిన వాడాయే.. పది రోజుల్లోన్నే.. షాపు ఓనరు కూలి పెంచి ఆప్తుడయ్యిండు. అది సమయం ప్రకారం నడిచే షాపుగనుక.. తీరిక సమయంల వైదుగం చేసేటోడు బాలయ్య. చేతి వైదుగుడని మంచి పేరచ్చింది. ఇంకా చిన్నప్పుడు నేర్చుకున్న మంత్రాలను సాన బట్టిండు. నోములు.. వ్రతాలు.. పెండ్లిల్లు.. తద్దినాలు.. గడియ ఇరాం లేకుంట బొంగురం లెక్క తిర్గబట్టిండు. అల్లుని పనితనం సూసి ఎంకటేసు అప్సోస్ కాబట్టిండు. బాలయ్య మూడు నెలల్ల నర్సమ్మను తన తొవ్వకు తెచ్చుకున్నడు. ఎంతైనా బొంబాయిల ఇరుకు కొంపలు.. మొరీల గబ్బు వాసన బాలయ్య ముక్కిర్సిండు.

మన పల్లెటూలల్ల సల్లంగ వచ్చే గాలికి.. బొంబాయిల వచ్చే గాలికి ఎంతో ఫరకున్నది. మీదికెల్లి నర్సవ్వ ఊల్లె ఒక్కత్తే ఉండుడు నారాజైండు. పానమంత ఎల్లవ్వ మీదనే కొట్టుకో బట్టింది. అవ్వ ఒడి లేంది ఈ సంపాదనెందుకనుకున్నడు. ఒక రోజు నిమ్మలంగా నర్సమ్మతోటి అవ్వను సూడక శాన రోజులయ్యింది.. కలలల్ల వత్తాంది. మా ఊరికి పోయి అవ్వను ఈడికి తీసుకత్త అన్నడు బాలయ్య. గయ్యిన లేసింది నర్సమ్మ. ఈడికెందుకు.. అంతగనం సూడబుద్ధైతే..ఓపాలి పోయి సూసిరా.. అన్నది. నువ్వు సుత రారాదు.. అని కాకా పట్టిండు. సరే అంది నర్సమ్మ. ఈ సారి లబ్బరు చెండు లెక్క ఎగురుడు బాలయ్య వంతయ్యింది. సోమన్నపేటకు వచ్చిన తెల్లారే..

బాలయ్య బొంబాయిల సంపాయించుకచ్చిన పైసలతోటి కుదువ పెట్టిన జాగా ఇడ్పిచ్చిందు. ఎల్లవ్వ సంబురం సూడాలే..! తొవ్వపొంటి వచ్చేటోల్లకు.. పోయేటోల్లకు వాల్లు అడిగినా.. అడుగక పోయినా మా కోడలచ్చిందని చెప్పబట్టింది. నర్సమ్మ , బాలయ్య ముసి ముసి నవ్వులు నవ్వసాగిండ్లు. ఒక రోజు పొద్దుగాల్నే.. కడింటి కన్కయ్య ఎల్లవ్వ ఇంటికచ్చిండు. ఎల్లవ్వ ముందల బాలయ్యను, నర్సమ్మను కూకోపెట్టి తన మన్సులోని మాట చెప్పబట్టిండు. అన్నా గాబొంబాయిల ఏం పాడయ్యిందే.. ఈడ అవ్వను ఒన నక్కను సేసి మీరు మల్ల పోకుండ్లి అన్కుంట బతుకుదెరువు బాటల మూట ఇప్పిందు. సికింద్రాబాదుల మా సుట్టాలున్నరు. వాల్లకు రోడ్డు మీద మడిగెలున్నై. ఒక మడిగె మీ కోసం ఇత్తమన్నరు. అండ్లనే టికాణా. మిషను నడుపుకోవచ్చు.. నలుగురికి టూషన్ చెప్పుకోవచ్చు.. వైడుగం సేసుకోవచ్చు బాలయ్య గద్మ కింద చెయ్యి పెట్టి సోంచాయించబట్టిండు. అట్లనే తల్కాయె నర్సమ్మ వైపు

Comments

comments