బతుకులు మార్చిన మెతుకు చెరువులు

నిర్మల్ జిల్లా సదర్‌మట్ ఆనకట్టకు అంతర్జాతీయ సాగునీటి వారసత్వ గుర్తింపు
కామారెడ్డి పెద్ద చెరువుకూ రైతుల భాగ్యవిధాత పరిగణన

International Irrigation Heritage, Recognition,Sadarmatt Dam,

మన తెలంగాణ/ హైదరాబాద్: నిర్మల్ జిల్లాలోని సదర్‌మట్ ఆనకట్టకు సాగునీటి రంగంలో ‘వారసత్వ కట్టడం’గా అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కామారెడ్డి పెద్ద చెరువుకు కూడా ఇరిగేషన్ రంగంలో రైతుల స్థితిగతులు మార్చిన కట్టడంగా గుర్తింపు లభించింది. వందేళ్లకుపై గా రైతుల సేవలో ఉన్న నీటిపారుదల కట్టడాల జాబితాలో సదర్‌మట్ ఆనకట్టకు, కామారెడ్డి పెద్ద చెరువుకు చోటు దక్కింది. ఈ మేరకు ఐసిఐడి (ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ) నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం తరపున అందిన నామినేషన్లను పరిగణనలోకి తీసుకుని సదర్‌మట్ ఆనకట్ట, కామారెడ్డి చెరువులకు గుర్తింపు ఇచ్చినట్లు ఐసిఐడి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించారు. ఇరిగేషన్ స్ట్రక్చర్ ఆన్ హెరిటేజ్ అవార్డులను కెనడాలో ఇటీవలే జరిగిన సదస్సులో కేంద్ర జలసంఘం అధికారులు అందుకున్నారు. ఇరిగేషన్ స్ట్రక్చర్ ఆన్ హెరిటేజ్ అవార్డులకు ఎంపికైన నిర్మాణాలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం లభిస్తుంది. వందేళ్లుగా ఈ ప్రాజెక్టుల ద్వారా రైతులకు అందుతున్న సేవ లు, వారి జీవితాల్లో వచ్చిన మార్పు, నిర్మాణాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న తీరుపై అంతర్జాతీయ స్థాయిలో స్కాలర్లు వచ్చి అధ్యయనం చేస్తారు. విజయగాధలు లిఖిస్తారు. నిర్మాణా ల నిర్వహణలో ఆర్థిక సాయమూ ఐసిఐడి నుంచి లభిస్తుంది.
సదర్‌మట్ ఆనకట్ట : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం, మేడంపల్లి గ్రామంలో గోదావరి నదిపై సదర్‌మట్ ఆనకట్టను గోదావరి నదిపై 189192 ప్రాంతంలో నిర్మించారు. ఇది శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు దిగువ బాగంలో ఉంటుంది. కడెం, ఖానాపూర్ మండలాల్లోని 13,100 ఎకరాల ఆయకట్టుకు నీ రందేలా 4.129 టిఎంసిల
సామర్థంతో నిర్మించారు. గరిష్టంగా 7.76 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకునేలా ఆనాడే ఆనకట్టను డిజైన్ చేయడం గమనార్హం. ఆనకట్టకు ఎడమ కెనాల్ ద్వారా 18 గ్రామాల్లో 5700 ఎకరాలు, కుడి కెనాల్ ద్వారా ఓ గ్రామంలోని 3400 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కలిగింది. అదనంగా డిస్ట్రిబ్యూటరీలతో 7 గ్రామాల్లోని 4000 ఎకరాలు సాగుచేస్తున్నారు. ఫ్రెంచి ఇంజనీర్ జెజె ఓట్లే ఈ ఆనకట్ట నిర్మించారు.
కామారెడ్డి పెద్దచెరువు
కామారెడ్డి జిల్లా కేంద్రానికి కేవలం కిలోమీటర్ దూరంలో పెద్ద చెరువు ఉంది. ఇది 1897లో నిజాం హయాంలో నిర్మించారు. 858 ఎకరాల ఆయకట్టు ఈ చెరువు కింద ఉంది. 175 ఎంసిఎఫ్‌టి సామర్థంతో 14 మీటర్ల ఎత్తుతో నిర్మించిన ఈ చెరువు చారిత్రకతను కేంద్రం గుర్తించింది. కామారెడ్డి, సారంపల్లి, క్యాసంపల్లి, ఉగ్రవాల్ గ్రామాల పరిధిలో ఆయకట్టు ఉండగా, తాగునీటికి స్థానికులకు భరోసాగా ఉండడం, చేపల పెంపకం, మత్సకారులకు పెద్ద చెరువు జీవనాధారంగా నిలిచింది.

Comments

comments