బంగారు తెలంగాణకు రైతే వెన్నెముక

farmer-suicideఒక రైతుకు వరి ఉరి. మరో రైతుకు నెత్తి మీద వేలాడుతున్న పత్తి కత్తి. ఇంకో రైతుకు నిలువెల్లా కూర‘గాయాలు’. మరో రైతుకు భారంగా మారిన వేరుశెనగ పంట. కంట నీరు తెప్పిస్తున్న ఉల్లి సాగు. చేదుగా మారిన చెరుకు. రైతు ఏ పంట పండించిన పొగిలి పొగిలి వస్తున్న దుఃఖం. మట్టిలో చేతులు పెట్టిదోసిలితో అన్నపు ముద్దను అందించే రైతు, ఈరోజు ఉరితాడును పేనుకుంటున్న దైన్యమైన స్థితి. రోజుకు ఒక్కరు, ఇద్దరు నుంచి మొదలై పదికి చేరిన హృదయ విదారకమైన సంఘటనలు. పన్నెండు వందలకు పైగా జరిగిన రైతు ఆత్మహత్యలు వ్యవ సాయ సంక్షోభాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అత్యధిక ఆత్మహత్యలు మహారాష్ర్ట తర్వాత తెలంగాణ రెండవస్థానంలో ఉంది; చిన్న, సన్నకారు రైతులు అత్యధికంగా ఉన్న తెలంగాణ రాష్ర్టంలో, 90 శాతం మంది అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. వీరంతా సాగు నీటి సౌకర్యంలేక బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులవల్ల చేను ఎండిపోవడంతో పంట చేతికందలేదు.

ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి భరోసా అందక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత 20 సంవత్స రాలుగా ప్రభుత్వాలు కొనసాగిస్తున్న సరళీ కృత ఆర్ధిక విధానాలే వ్యవసాయ సంక్షోభానికి దారి తీసా యి. రైతుల ప్రయోజనాల కంటే కూడా కార్పో రేట్ సంస్థల అనుకూల విధానాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తూ, చిన్న సన్నకారు రైతులను నిర్లక్షం చేయటం సరికాదు. రైతు ఖర్చు పెరిగి ఆదాయం తగ్గడంతో ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుని ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. రైతుల ఆత్మహత్యల సమస్య ఈ ఒక్క ఏడాదికి సంబంధించినది కాదు. ఏళ్ల తరబడిగా సాగుతున్న వ్యథ. విత్తనాల దగ్గర్నుంచీ పంట చేతికి అందేవరకూ రైతును అడుగడుగునా దగా పడుతున్న ఈ మర్కెట్ వ్యవస్థ చివరకు శవంగా మారుస్తున్నది. పెరుగు తున్న పెట్టుబడులకు తోడు కనికరించని ప్రకృతి రైతును నిండా ముంచుతుంది. బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు అందించే రుణాలు రైతు అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ఉమ్మడి రాష్ర్టంలో 1995 నుంచి 2010 మధ్యకాలంలో 31,120 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

2010లో అత్యధి కంగా 2,525 మంది రైతులు ఆత్మహత్య చేసు కున్నారు. ఇందులో 15-29 ఏళ్ల మధ్య వయస్సున్న వారు 728 మందిలో యువకులు 563 మంది, యువతులు 165 మంది. 30-44 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారిలో 824 మంది పురుషులు, 137 మంది మహిళలు ఉన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ఏడాది పన్నెండు వందల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందుకు అతివృష్టి, అనావృష్టి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. బోరుబావిలో నీరు కరవైన ఆవేదన, నమ్ముకున్న వర్షం ముఖం చాటేయడంతో ఆక్రోశం, కుటుంబ పోషణ భారమైన అంతర్మథనం…వెరసి మానసిక క్షోభకు గురైన రైతు ఆత్మహత్యకు మొగ్గుచూపి స్తున్నాడు. చేసిన అప్పులు తడిసిమోపెడై ఆత్మహత్యే శరణ్యమని భావిస్తున్నాడు. దీంతో ఒక్క రోజే డజను మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు సంభవిస్తున్నాయి. ‘మాది రైతు సంక్షేమ ప్రభుత్వం’ అని చెప్పుకొని వచ్చిన ప్రభుత్వాలు కూడా ఆత్మహత్యలను నివారించలేకపోతున్నాయి.

రైతు ఆత్మహత్యలకు అనేక కారణాలున్నాయి. వ్యవసాయంలో పెట్టుబడులు పెరగడం దగ్గర్నుండీ ప్రభుత్వ విధానాల వరకూ చెప్పుకోవచ్చు. బోర్లపై ఆధారపడడం, అవి విఫలం కావడంతో రైతుపై అధిక భారం పడుతోంది. దీన్ని తట్టుకునే ఆర్థిక వెసలుబాటు లేకపోవడం కూడా రైతు కుంగి పోవడానికి కారణమతున్నాయి. అన్నదాత ఆశలను దుర్భిక్షం కూడా కాటేసింది. తొలకరి వానలకు మురిసిపోయి విత్తులేసిన రైతులు, ఆ తర్వాత చినుకు రాక కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తూనే ఉన్నారు. వర్షాభావం ధాటికి పంట ఎండిపోతుంటే మూగగా రోదిస్తున్నారు. లక్షల ఎకరాల్లో పంటలు ఎందుకూ కొరగావని తెలిసి బరువెక్కిన గుండెతో వాటిని దున్నేస్తున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో మొక్కజొన్న, సోయా బీన్, కంది, పత్తి సహా మెట్టపంటలన్నీ ఎండి పోతుండ డంతో దిక్కుతోచని రైతులు ఆత్మహత్యలే శరణ్యంగా భావిస్తున్నారు.
కనీసం పెట్టుబడి కూడా తిరిగి వచ్చే స్థితిలేకపోవడంతో రైతులు ఆత్మహత్యల వైపు మొగ్గు చూపిస్తున్నారు.

ఇవేకాకుండా, సుస్థిరమైన వ్యవ సాయ విధానాలు అనుసరించకపోవడం, వ్యాపార స్వేచ్ఛ, ఎగుమతి, దిగుమతి విధానాలు అనుకూ లించక పోవడం కూడా కారణాలుగా చెప్పవచ్చు. బీమా, మార్కెటింగ్, నిల్వ సదుపాయాలు తగ్గిన స్థాయిలో లేకపోవడం, చిన్న కమతాలు,కౌలు సేద్యం తో కలసి రాకపోవడంతో వ్యవసాయ సంక్షోభం పెరిగి రైతులు నష్టపోతున్నారు. నష్టాల ఊబిలో ఇరుక్కుపోయిన రైతు ఆత్మహత్యే చివరి మార్గంగా ఎంచుకుంటున్నాడు. తెలంగాణ రాష్ర్టంలో సగానికి పైగా జనాభా ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయమే ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. రాష్ర్ట ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న వ్యవసాయ రంగంలో వృద్ధి సాధించడం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ప్రధాన బాధ్యత. ఆత్మహత్యలను నివారించగలిగినప్పుడే రైతు దేశానికి వెన్నెముకలా నిలువగలుగుతాడు. అందుకు గానూ పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి. అంతేకాకుండా రైతులనుంచి పంటను ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలి. ఎగుమతి దిగుమతి విధానాలను రైతుల పరిస్థితుల కు అనుగుణంగా మార్చాలి. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు సకాలంలో ఎక్స్‌గ్రేషియా, రుణ చెల్లింపుకు సహకరించాలి.

మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేనప్పుడు పెట్టుబడి వ్యయంతో పాటు అదనం గా యాభై శాతం ధర చెల్లించే ఏర్పాటు చేయాలి. కల్తీలేని విత్తనాలు, పురుగుమందులను సకాలంలో అందించాలి. కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వడం, ప్రకృతి వైపరీత్యాలకు అండగా నిలవాలి. సామాజిక, ఆర్థిక అవసరాలకు భరోసా ఏర్పడి నప్పుడే రైతు కుదుటపడి ఆత్మస్థైయిర్యంతో జీవించ గలుగుతాడు. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు’గా తెరాస ప్రభుత్వం రైతు ఆత్మహత్యలపై శాసనసభను వేదిక చేయడం బాధకరం. ప్రతి వర్షాకాలం ఆరంభంలోనే రైతులకు మనోధైర్యం నింపే విధానా లను ప్రకటించినట్లయితే ఆత్మహత్యలను చాలా వర కు నివారించే వీలుండేది. విత్తనాలు, ఎరువులు, విద్యుత్ ఇవ్వడం ఎంత ముఖ్యమో, కరవును ఎదు ర్కోనే భరోసాను ఇచ్చివుంటే అన్నదాతల కుటుం బాలను దుఃఖంనుంచి తప్పించగలిగేది. అధికార పక్షం, ప్రతిపక్షాలు రైతుల ఆత్మహత్యల సంఖ్యతో పోటీ పడకుండా, రైతులకు తోడుగా ఉండే ఆలోచన చేయగలిగితే బంగారు తెలంగాణకు రైతు వెన్నెముకగా నిలుస్తాడు.

Kodam pavankumarకోడం పవన్‌కుమార్
– 9848992825

Comments

comments