ఫ్యూచర్ రిటైల్‌లో వాటా కొనుగోలుకు దిగ్గజాల కన్ను

Future retail shares gained over 6 percent

6 శాతానికి పైగా పెరిగిన కంపెనీ షేరు విలువ

న్యూఢిల్లీ : ఫ్యూచర్స్ రిటైల్ షేర్లు సోమవారం ఒక్కసారిగా భారీ 6 శాతానికి పైగా లాభపడ్డాయి. మే 25 నుంచి ఇంతటి స్థాయిలో షేరు విలువ పెరగడం ఇదే. కంపెనీలో వాటాల కొనుగోలు కోసం అంతర్జాతీయ దిగ్గజాలు గూగుల్, అమెజాన్‌లు చర్చలు జరుపుతున్నాయని మీడియాలో వార్తలు హల్‌చల్ చేయడంతో మార్కెట్లో షేరు విలువ ఒక్కసారిగా పెరుగుతూ వచ్చింది. ఫ్యూచర్స్ రిటైల్ 12 నుంచి- 15 శాతం వాటా కొనుగోలుకు ఇకామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా సంప్రదింపులు జరిపినట్టు వార్తలు వచ్చాయి. వాల్‌మార్ట్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాలు కొనుగోలు చేసిన తరుణంలో భారత్‌లో గట్టి పట్టున్న వ్యాపార భాగస్వామి పట్ల అమెజాన్ ఆసక్తి చూపుతోంది.

అందుకే ఫ్యూచర్ రిటైల్‌లో వాటాలు కొనాలని భావిస్తోందని తెలుస్తోంది. మరోవైపు ఆలీబాబాకు చెందిన పేటీఎం మాల్‌తో కలిసి ఫ్యూచర్ రిటైల్‌లో వాటా కొనుగోలుకు గూగుల్ యత్నాలు ఆరంభించిందన్న వార్తలు వస్తున్నాయి. గూగుల్, ఆలీబాబా కలిసి ఫ్యూచర్ రిటైల్‌లో దాదాపు రూ.3,500 నుంచి రూ. 4000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్టు సమాచారం. దీంతో అటు అమెజాన్, ఇటు గూగుల్, ఆలీబాబా మధ్య పోటీ నెలకొన్నట్లయింది. అటు ఆలీబాబా, ఇటు అమెజాన్‌తో బియానీ కొంతకాలంగా వాటాల అమ్మకానికి సంబంధించి చర్చలు జరుపుతున్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా నిధులు సమీకరించేందుకు బియానీ కొంతకాలంగా యత్నిస్తున్నారు. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో ఫ్యూచర్ రిటైల్ షేరు విలువ 5 శాతం పెరిగి రూ.543.15 వద్ద స్థిరపడింది.