ఫోన్ల తయారీలో భారత్ నెంబర్ 2

modi

రెండు నుంచి 120కి చేరిన ఉత్పత్తి కేంద్రాలు

సామ్‌సంగ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తూ ప్రధాని మోడీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ద.కొరియా అధ్యక్షుడు మూన్

 మేకిన్ ఇండియాకు అనుసంధానంగా మొబైల్ తయారీ

నోయిడా : మేకిన్ ఇండియా పథకంతో భారతదేశం ప్రపంచంలోనే రెండవ మొబైల్ ఫోన్ల తయారీదారుగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. నాలుగేళ్ల క్రితం దేశంలో కేవలం రెండు మొబైల్ ఉత్పత్తి ఫ్యాక్టరీలు ఉండేవి. అవి ఇప్పుడు 120కి చేరాయి. ఇదంతా కూడా మేకిన్ ఇండియా వల్లనే సాధ్యం అయిందని ప్రధాని తెలిపారు. దేశ రాజధానికి శివార్లలోని నోయిడాలో సోమవారం ప్రధాని ప్రపంచ స్థాయి అతి పెద్ద మొబైల్ ఫోన్ల యూనిట్‌ను ప్రారంభించారు. ఈ ఫ్యాక్టరీని దక్షణి కొరియా కంపెనీ సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ వారు నిర్మించారు. ఈ కంపెనీ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మాట్లాడారు. ఇప్పుడు ప్రారంభిస్తున్నది ప్రపంచంలోనే అతి ఎక్కువగా సెల్ ఫోన్ల తయారీ కంపెనీ అని ప్రధాని తెలిపారు. నాలుగేళ్లలో మొబైల్ ఫోన్ల తయారీలో ఇండియా రెండో స్థానానికి చేరిందని పేర్కొన్నారు. అత్యధిక సంఖ్యలో ఈ కంపెనీలు వెలియడంతో నాలుగు లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు దొరికాయని ప్రధాని వివరించారు. భారత్‌ను ప్రపంచ స్థాయి ఉత్పత్తి కేంద్రంగా రూపొందించడంలో ఈ రోజు కీలకమైన రోజు అని ప్రధాని చెప్పారు. కేవలం లక్షలాది మందికి ఉద్యోగాలు, వేలాది మంది పరోక్ష ఉపాధి దక్కడమే కాకుండా ఇతరత్రా కూడా ఈ లాభం ఉంటుందని ప్రధాని తెలిపారు. ఇలాంటి ఫ్యాక్టరీలలో భారీ పెట్టుబడుల రాకతో దేశ ఆర్థిక పురోగతికి దారితీస్తుంది. అంతేకాకుండా దక్షిణకొరియా వంటి దేశాలతో వాణిజ్య సంబంధాలకు కూడా ఇటువంటి ఫ్యాక్టరీల ఏర్పాటుతో సాధ్యం అవుతుందని ప్రధాని వివరించారు. ప్రపంచంలోనే ఇప్పుడు భారతదేశం శరవేగపు ప్రగతితో దూసుకుపోతోందని, ఇదే సమయంలో నయా మధ్య తరగతి వర్గాలకు అపరిమిత అవకాశాలు ఏర్పడుతాయని తెలిపారు. మేకిన్ ఇండియా పథకం కేవలం స్వదేశీ బాగు కోసం కాదని, ఇందులో విస్తృత అంశాలు చాలా ఉన్నాయని తెలిపారు. దక్షిణ కొరియా వంటి పురోగామ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల కట్టుబాట్లకు అనుగుణంగా ఈ పథకం రూపొందిందని వివరించారు. ప్రస్తుతం దక్షిణ కొరియా దేశాధినేత మూన్ జె భారత పర్యటనలో ఉన్న నేపథ్యంలో ప్రధాని ఈ అం శాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. మూన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక పట్టణ ప్రాంతాలలో ఉచిత వైఫై సౌకర్యం ఏర్పడటంతో పేద, మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలకు రెక్కలు వచ్చాయని వివరించారు. ఇప్పుడు ప్రారంభించిన నోయిడా సామ్‌సంగ్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే ఫోన్లను బయటి దేశాలకు ఎగుమతి చేయడం జరుగుతుందని ప్రధాని తెలిపారు. కొరియా ఉత్పత్తులు భారతదేశంలో ఇప్పుడు మధ్య తరగతి ప్రజలకు చిరపరిచితంగా ఉన్నాయని, ఇప్పటివరకూ ఈ కంపెనీకి ఇండియాలో పరిశోధక అభివృద్ధి కేంద్రం ఉండేది, ఇప్పుడు ఈ ఫ్యాక్టరీతో ఉత్పత్తి కేంద్రం కూడా జోడయిందని ప్రధాని తెలిపారు.
భారత్ ప్రగతిలో భాగస్వామ్యం : మూన్
దక్షిణ కొరియాకు చెందిన పలు కంపెనీలు భారతదేశ త్వరితగతి పగతిలో పాలుపంచుకుంటున్నాయని దక్షిణ కొరియా అధ్యక్షులు మూన్ తెలిపారు. సామ్‌సంగ్ వంటి ఫ్యాకర్టీలు భారతదేశంలో ఎందరికో ఉద్యోగాలు కల్పిస్తాయని, ఈ ఒక్క ఫ్యాక్టరీతోనే రెండు వేల కొత్త ఉద్యోగాలు వస్తాయని వివరించారు. ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే స్మార్ట్‌ఫోన్లను మిడిల్ ఈస్టు, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తారని చెప్పారు. యువ ఔత్సాహిక భారతీయ పారిశ్రామికవేత్తల పట్టుదల, ప్రతిభను కొరి యా నేత కొనియాడారు. దేశం సాఫ్ట్‌వేర్‌లో శక్తివంతం అయిందని ఇక తమ దేశ బలం వాణిజ్య సాంకేతికత, హార్ట్‌వేర్‌లో ఉందని తెలిపారు.
మెట్రో రైలులో మోడీ, మూన్ ప్రయాణం
దేశ రాజధాని ఢిల్లీ నుంచి ప్రధాని మోడీ, దక్షిణ కొరియా అధినేత మూన్ జె మెట్రో రైలులో నోయిడాలో శాంసంగ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి తరలివచ్చారు. ఇరువురు ఢిల్లీ మెట్రో రైలులో కూర్చుని వెళ్లుతున్న దృశ్యాలను ప్రధాని కార్యాలయం వారు విడుదల చేశారు. యమునా తీరపు మెట్రో స్టేషన్‌లో ఇరువురు నేతలు ఉన్నప్పటి చిత్రాలు కూడా క్లిక్ మన్పించారు. మండీ హౌస్‌స్టేషన్‌లో ఇరువురు మధ్యాహ్నం 4. 36కు రైలు ఎక్కారు. బ్లూ లైన్‌లోని బొటానికల్ గార్డెన్ స్టేషన్ వరకూ ఇందులో అంతకు ముందు కలిసి ప్రయాణించారు. ఇతర ప్రయాణికులతో కలిసి వారు ప్రయాణం సాగించారని, ఇద్దరు ప్రముఖుల రాక వల్ల రైలు సర్వీసులకు జాప్యం జరగలేదని అధికార వర్గాలు తెలిపాయి. నోయిడా నుంచి తిరిగి వారు మెట్రో రైలులోనే ఢిల్లీకి తిరిగి వచ్చారు. దక్షిణ కొరియా అధ్యక్షులు ప్రస్తుతం నాలుగు రోజుల భారతదేశ పర్యటనలో ఉన్నారు. ఇప్పుడు వారు జరిపింది కేవలం రైలు ప్రయాణం కాదని, ప్రగతి దిశలో సంయుక్త పయనం అని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ ఈ ఫోటోలకు వ్యాఖ్యానాలు జోడించారు.