‘ఫణి’ కాటు!

నడి వేసవిలో తుపాను, అగ్గి కురుస్తుండగా గాలి వీచినట్టుంటుంది. ఒకవైపు మండు వేసవిలో మలమలమాడుతున్న ప్రజలకు తుపాను సృష్టించే విధ్వంసం పుండు మీద కారాన్ని తలపిస్తుంది. ఒడిశాలో పూరీ పట్నం వద్ద తీరం దాటి ప్రస్తుతం బెంగాల్, బంగ్లాదేశ్‌లను కకావికలం చేస్తున్న ఫణి (ఫొని) తుపానుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయని వాతావరణ శాఖ వెల్లడించిన సమాచారం గమనించదగినది. ఫణి ప్రయాణించే మేర తేమను హరించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని, వడ గాలులు […] The post ‘ఫణి’ కాటు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నడి వేసవిలో తుపాను, అగ్గి కురుస్తుండగా గాలి వీచినట్టుంటుంది. ఒకవైపు మండు వేసవిలో మలమలమాడుతున్న ప్రజలకు తుపాను సృష్టించే విధ్వంసం పుండు మీద కారాన్ని తలపిస్తుంది. ఒడిశాలో పూరీ పట్నం వద్ద తీరం దాటి ప్రస్తుతం బెంగాల్, బంగ్లాదేశ్‌లను కకావికలం చేస్తున్న ఫణి (ఫొని) తుపానుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయని వాతావరణ శాఖ వెల్లడించిన సమాచారం గమనించదగినది. ఫణి ప్రయాణించే మేర తేమను హరించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని, వడ గాలులు కూడా తీవ్రంగా వీయవచ్చునని నిపుణులు హెచ్చరించారు. ఫణి వల్ల రాబోయే రుతు పవనాలపై ఎటువంటి వ్యతిరేక ప్రభావం ఉండబోదన్నది చల్లని కబురు. గత 20 ఏళ్లలో ఎన్నడూ సంభవించనంత శక్తివంతమైన తుపానుగా శాస్త్రజ్ఞులు ఫణిని వర్ణించారు. సాధారణంగా వేసవి కాలంలో తుపానులు రావడం అరుదు. 1990 మేలో ఇలాగే వేసవి తుపాను విరుచుకుపడి తమిళనాడు, కోస్తా ఆంధ్రలను కకావికలు చేసింది.

ఆ తుపానుకు వెయ్యి మంది మరణించి, వేలాది పశువులు చనిపోయాయి, తీవ్ర నష్టం వాటిల్లింది. ఇటీవలి కాలంలో 2014 అక్టోబర్ 12న సంభవించిన హుడ్ హుడ్, 2018 అక్టోబర్ తర్వాత కొంత కాలానికి విరుచుకుపడిన తిత్లీ తుపానుల పంజా దెబ్బలను చవిచూసిన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగరం, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు ఫణి సమాచారం తెలియగానే వణికిపోయారు. అయితే ఫణి ఈసారి శ్రీకాకుళం జిల్లాలో కొద్దిపాటి విధ్వంసం సృష్టించినా ఉత్తరాంధ్రలో ఊహించినంత ఉత్పాతానికి దారి తీయలేదు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రకృతి సుందరమైన ఉద్దానం ప్రాంతాన్ని కొద్దిసేపు భయపెట్టి తర్వాత శాంతించింది. ఇక్కడి దట్టమైన కొబ్బరి తోటలు గత తుపానుల్లో దారుణంగా దెబ్బతిని రైతును క్షోభకు గురి చేశాయి. తిత్లీ నష్టానికి ఇప్పటికీ పూర్తిగా పరిహారం అందలేదన్న ఆవేదన, ఆరోపణ వినవస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫణి ఉత్తరాంధ్రను పెద్దగా బాధించకుండా విడిచిపెట్టడం ఆ ప్రాంతానికి ఊరటే అయినా ఒడిశా రాష్ట్రాన్ని ఇది తీవ్ర నష్టానికి గురి చేసింది. శుక్రవారం ఉదయం అక్కడ తీరం దాటినప్పుడు గంటకు 230 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయంటే ఫణి ఆ ప్రాంతంలో ఎంతటి బీభత్సాన్ని సృష్టించి ఉంటుందో వివరించనక్కరలేదు.

ఒడిశాలో తుపాను మృతుల సంఖ్య శనివారం సాయంత్రం నాటికి 15కు చేరుకున్నది. సాంకేతిక పరిజ్ఞానం పెరిగి, ప్రభుత్వ యంత్రాంగాల్లో ముందస్తు జాగ్రత్త పట్ల గతం కంటె మెరుగైన శ్రద్ధ చోటు చేసుకున్న తర్వాత ప్రజల్లో చైతన్యం కూడా పెరిగిన మీదట పూర్వకాల తుపానుల్లో మాదిరిగా మృతుల సంఖ్య వందలు, వేలు చేరకపోడం ఎంతైనా హర్షించవలసిన అంశం. 1977లో సంభవించిన భయంకరమైన ఉప్పెన ఎపిలోని దివిసీమలో 10,000 మంది ప్రాణాలను బలి తీసుకున్నది. పంటలకు, ఆస్తులకు కలుగుతున్న నష్టాలు మహా వృక్షాలు కూలిపోయి సంభవిస్తున్న విధ్వంసం చెప్పనలవి కానంతగా కొనసాగుతున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం ఒక్క ఒడిశాలోనే 10, 12 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు నాశనమైపోయాయి. తాటాకు గుడిసెలు (పూరిళ్లు) ధ్వంసమైపోయాయి. 160 మందికిపైగా గాయపడి ఆస్పత్రుల పాలయ్యారు.

ప్రకృతి వైపరీత్యాలకు ముందుగా తీవ్రంగా బలైపోయేది, నష్టపోయేది నిరుపేదలేననేది పదేపదే చెప్పుకోనవసరం లేని చేదు వాస్తవం. అట్టడుగు ప్రజలు గాలికి, అగ్గికి అతి సులభంగా దొరికిపోయే తాటాకు ఇళ్లల్లో ఇప్పటికీ నివసిస్తూ ఉండడమే ఈ దేశ దౌర్భాగ్యం. అప్పటికీ ఒడిశా ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల్లోని 4000 మందిని హుటాహుటిన ఖాళీ చేయించడం హర్షించవలసిన విషయం. ఏప్రిల్ 25 నుంచి 1300 కిలోమీటర్ల ప్రయాణం చేసిన ఫణి మధ్యమధ్య వేగం తగ్గుతూ దిశ మార్చుకుంటూ మే 3 తేదీన తీరం దాటడం గమనించవలసిన విషయం. ఇటువంటి సుదీర్ఘ తుపానులు ప్రజల్లో, ప్రభుత్వ యంత్రాంగాల్లో సృష్టించే అభద్రతా భావం, ఉద్రిక్తతలు చెప్పనలవికానివి. భువనేశ్వర్ విమానాశ్రయం అమితంగా నష్టపోయింది.

భువనేశ్వర్, కోల్‌కతాలకు విమానాలు రాకపోకలు రద్దు చేయడం, వందలాది రైళ్లను ఉపసంహరించుకోడం ప్రాణహానిని పరిమితం చేసిందనుకోవాలి. హౌరా చెన్నై మార్గంలో 220 రైళ్లు రద్దు చేశారు. దీనివల్ల ప్రయాణికులకు కలిగిన అసౌకర్యం చెప్పనలవికానిది. కాని అల ఉధృతంగా వచ్చినప్పుడు తల వంచక తప్పదు మరి. ప్రకృతిని జయించే కృషిలో మానవాళి అసాధారణ విజయాలు సాధిస్తున్నప్పటికీ తుపానులు, ఉప్పెనలు, భూకంపాల వంటి వాటిని నిరోధించలేకపోతున్నారు. కనీసం విపత్తు నిర్వహణ నైపుణ్యాలనైనా పెంచుకొని నష్టాలను భారీగా తగ్గించుకోగలిగితే అదే అసాధారణ మానవ విజయమని చెప్పుకోవచ్చు.

Temperatures risen significantly in two states with Cyclone Fani

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ‘ఫణి’ కాటు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: