ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
జిల్లా ఎస్‌పి ఆధ్వర్యంలో జగిత్యాలలో ద్విచక్ర వాహన ర్యాలీ

Police1

జగిత్యాలటౌన్: నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్‌పి అనంతశర్మ హెచ్చరించారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఎస్‌పి ఆధ్వర్యంలో జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది జగిత్యాల పట్టణంలో శనివారం భారీ ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ, కొత్త సంవత్సరం వేడుకలను బంధు, మిత్రులతో ఆనందంగా జరుపుకోవాలని, వెకిలి చేష్టలతో ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ఒక్కో వాహనంపై ఇద్దరికి మించి ఉండవద్దన్నారు. అతివేగంగా వెళ్లడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశముంటుందని, రాత్రి పూట రోడ్లపైకి రాకుండా ఉంటేనే మంచిదన్నారు. తాగిన మైకంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగిస్తే ఎంతటి వారైనా సహించేది లేదని, రౌడీషీట్ తెరిచి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. పట్టణంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తామని, ప్రజలకు పోలీసులకు సహకరించాలన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆరు మొబైల్ టీంలు, మూడు పికెటింగ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు పోలీస్ అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు తిరుగుతూ తనిఖీలు నిర్వహిస్తారన్నారు. జిల్లా ఎస్‌పి కార్యాలయం నుంచి ప్రారంభమైన పోలీసుల ద్విచక్ర వాహన ర్యాలీ కొత్తబస్టాండ్, పురాణిపేట, టవర్‌సర్కిల్, తీన్‌ఖని చౌరస్తా, బీట్ బజార్, కొత్తబస్టాండ్ మీదుగా అంగడిబజార్, తహసీల్ చౌరస్తా నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు ర్యాలీ కొనసాగింది.

అతి ఖరీదైన వాహనంలో కుయ్… కుయ్ మంటూ సైరన్‌తో తిరిగే జిల్లా ఎస్‌పి పోలీసులతో కలిసి బుల్లెట్ మీద పట్టణమంతా తిరగడం చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమంలో డిఎస్‌పి పుల్ల కరుణాకర్, సిఐలు కరుణాకర్‌రావు, శ్రీనివాస్, సురేందర్, సర్వర్, శ్రీనివాస్ చౌదరి, కృపాకర్, రాజశేఖర్‌రాజు, ప్రతాప్, జిల్లాలోని పలువురు ఎస్‌ఐలు, డిస్ట్రిక్ట్ గార్డు, ఎఆర్ పోలీసులు పాల్గొన్నారు.

పురాణిపేట పోచమ్మ ఆలయంలో ఎస్‌పి పూజలు

పట్టణంలోని లోకమాత పోచమ్మ దేవాలయంలో జిల్లా ఎస్‌పి అనంతశర్మ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ నిర్వహకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌పి కరుణాకర్, టౌన్ సిఐ కరుణాకర్‌రావు, రూరల్ సిఐ శ్రీనివాస్, ఆలయ కమిటీ అధ్యక్షుడు గాజుల రాజేందర్, నిర్వహకులు మనోహర్, చంద్రప్రకాశ్, గంగాధర్, మల్లిఖార్జున్, రాజగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments