ప్రమాదంలో ఆ పెద్ద సినిమా..!?

Pre release piracy in Tollywood

హైదరాబాద్: గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీని పైరసీ భూతం పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే. మూవీ రిలీజ్ అవ్వడమే ఆలస్యం గంటల వ్యవధిలోనే సినిమా పైరసీ బయటకు వచ్చేస్తుంది. దాంతో భారీగా నష్టాలు చవిచూడాల్సి వస్తుంది.ఇది చాలదంటూ కోట్లు ఖర్చుతో వందలాది మంది వందల రోజులు కష్టపడి సినిమా తీస్తే.. విడుదలకు ముందే మూవీలోని సన్నివేశాలు లీక్ అయిపోతే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో పవన్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సహా కొన్ని సినిమాల విషయంలో ఇలాగే జరిగింది. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ‘గీత గోవిందం’కు కూడా ఆ బెడద తప్పలేదు. ఈ మూవీకి ఎడిటింగ్ విభాగంలో పని చేసిన ఒక వ్యక్తి చేసిన నిర్వాకానికి ఇందులోని చాలా సీన్లు లీక్ అయ్యాయట. అతడు ఒక విద్యార్థికి ఆ సన్నివేశాల్ని షేర్ చేయగా, ఆయన ఇంకొందరికి పంపించడంతో అవి సామాజికి మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

ఈ విషయమై ‘గీత గోవిందం’ ప్రి రిలీజ్ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడారు. ఈ సందర్భంగా పైరసీని వ్యాప్తి చేసే వాళ్లకు ఆయన తీవ్ర హెచ్చరికలే జారీ చేశారు. అదే సమయంలో ఇండస్ట్రీని కూడా ఆయన హెచ్చరించారు. ఇది ఇండస్ట్రీ సిగ్గు పడాల్సిన విషయమని అరవింద్ పేర్కొన్నారు. ‘గీత గోవిందం’ మాత్రమే కాక.. ఇంకో మూడు సినిమాలు కూడా లీకేజీ ప్రమాదంలో ఉన్నట్లు ఆయన పేర్కొనడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అందులో ఒక పెద్ద సినిమా కూడా ఉందని చెప్పడంతో ఇప్పుడు దీనిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ అరవింద్ చెబుతున్న పెద్ద సినిమా ఏది అంటూ ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. కొన్ని రోజుల ముందు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, తారక్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’ మూవీ స్టిల్స్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. చిత్ర యూనిట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న ఈ లీకుల బెడద మాత్రం తప్పడం లేదు. ఇకపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే మాత్రం మునుముందు లీకులు కూడా భూతంలా దావురించడం ఖాయం.