ప్రభుత్వ దవాఖానలో గర్భిణీ మృతి…

 Pregnant death in government hospital
ఖమ్మం: కులాంతర వివాహాం చేసుకోవడమే వారు చేసిన తప్పు అందరూ ఉండి అనాథల్లాగా బతుకు దెరువు కోసం వేరే రాష్ట్రంకు వచ్చి నిండు చూలాలు మృతి చెందిన సంఘటన ఖమ్మం నగరంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా యటపాక మండలం చుక్కలపాడు గ్రామానికి చెందిన నూప జోగయ్య, శ్రీకాకుళంకు చెందిన లలిత రాజమండ్రిలో చదువుకునే సమయంలో ప్రేమించుకున్నారు. కానీ వారి కులాలు వేరు కావడంతో లలిత తల్లిదండ్రులు వారి ప్రేమను నిరాకరించారు. దీంతో రెండు సంవత్సరాల క్రితం వారు పెళ్లి చేసుకున్నారు. అందరూ ఉండి కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో బతుకు దెరువు కోసం రాష్ట్రం దాటి నెల రోజుల క్రితం ఖమ్మం వచ్చి రిక్కాబజార్ సెంటర్‌లో అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో జోగయ్య అనారోగ్యంతో బాధపడుతూ వారం రోజులుగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వారికి ఎవరు లేకపోవడంతో నిండు చూలాలైన లలిత ఆసుపత్రిలో భర్త వద్ద ఉంటూ సేవలు చేస్తుంది.

ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం లలితకు కడుపునొప్పి రావడంతో వెంటనే వైద్యులు పరీక్షించి లలితకు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తుండడా పాప కడుపులోనే మృతి చెందింది. చనిపోయిన పాపను బయటకు తీసి లలితను ఐసియుకు తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారు జామున లలిత చనిపోయింది. అనారోగ్యంతో బాధపడుతున్న జోగయ్య భార్య మృతి చెందిన వార్త తెలుసుకుని కుదేలయ్యాడు. నా అనే వాళ్లు ఎవరు తమకు ఇక్కడ లేకపోవడంతో ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో నిమ్మకుండి పోయాడు. లలిత మృతి చెందిన వార్తను వారి తల్లిదండ్రులకు సమాచారం అందించినప్పటికీ వారు స్పందించలేదు. దీంతో జోగయ్య ఆసుపత్రిలో అటు ఇటు తిరుగుతుండడంతో అక్కడ ఉన్న వారిని కలచివేసింది. ప్రేమించుకున్న నేరానికి అందరూ ఉండి అనాథలాగా మృతి చెందాల్సిన పరిస్థితి లలితకు ఏర్పడింది.