ప్రభుత్వరంగ సంస్థలే..

అత్యున్నత ప్రమాణాలు పాటించేది ప్రభుత్వరంగ సంస్థలే..  ఎన్‌సిఎల్‌టి వద్ద ఉన్నవన్నీ ప్రైవేటు కంపెనీలే..  అద్దాల మేడలో ఉంటూ రాళ్లు విసరొద్దు..  బ్యాంకుల ప్రైవేటీకరణపై విరుచుకుపడిన ఎస్‌బిఐ చైర్మన్ రజనీష్ కుమార్ న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలంటూ వస్తున్న విమర్శలను ఎస్‌బిఐ చైర్మన్ రజనీష్ కుమార్ తిప్పికొట్టారు. అద్దాల మేడలో ఉంటూ ఇతరులపై రాళ్లు విసరొద్దని విరుచుకుపడ్డారు. మొండి బకాయిలు, తక్కువ స్థాయి ప్రమాణాలున్న కేసులు దాదాపు ప్రైవేటు రంగంలోనే ఉన్నాయని.. ప్రభుత్వ సంస్థలే అత్యున్నత పరిపాలనా ప్రమాణాలు […]

అత్యున్నత ప్రమాణాలు పాటించేది ప్రభుత్వరంగ సంస్థలే..

 ఎన్‌సిఎల్‌టి వద్ద ఉన్నవన్నీ ప్రైవేటు కంపెనీలే..
 అద్దాల మేడలో ఉంటూ రాళ్లు విసరొద్దు..
 బ్యాంకుల ప్రైవేటీకరణపై విరుచుకుపడిన ఎస్‌బిఐ చైర్మన్ రజనీష్ కుమార్

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలంటూ వస్తున్న విమర్శలను ఎస్‌బిఐ చైర్మన్ రజనీష్ కుమార్ తిప్పికొట్టారు. అద్దాల మేడలో ఉంటూ ఇతరులపై రాళ్లు విసరొద్దని విరుచుకుపడ్డారు. మొండి బకాయిలు, తక్కువ స్థాయి ప్రమాణాలున్న కేసులు దాదాపు ప్రైవేటు రంగంలోనే ఉన్నాయని.. ప్రభుత్వ సంస్థలే అత్యున్నత పరిపాలనా ప్రమాణాలు పాటిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ బ్యాంకుల్లో మొండి బకాయిలు, దివాలా కేసులు పెరిగిన నేపథ్యంలో అత్యున్నత కార్పొరేట్ పాలనా ప్రమాణాలు లోపించాయంటూ వస్తున్న విమర్శలపై రజినీష్ ఈవిధంగా స్పందించారు. ‘ప్రైవేటు రంగంలోని సంస్థల్లో కార్పొరేట్ పరిపాలనా విధానాలు మెరుగ్గా ఉంటే ఏ ప్రభుత్వరంగ సంస్థ  ఇప్పుడు ఎన్‌సిఎల్‌టి (నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్) వద్ద ఉందో చెప్పాలి’ అని రజనీశ్ ప్రశ్నించారు. ప్రస్తుతం లా ట్రైబ్యునల్ వద్ద ఉన్న కంపెనీలన్నీ ప్రైవేటువే కదా అని చెప్పుకొచ్చారు. ‘రుణ ఎగవేత సంస్థలన్నీ పరిశ్రమ సంఘాల ముందు వరసులో కూర్చున్నాయి. ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడినప్పుడు హితబోధనలు చేస్తారు. కానీ ఇప్పుడు జరుగుతున్న వాస్తవం ఇది’ అని రజనీష్ అన్నారు. ఎగవేతదారులంతా ముందు వరుసలో కూర్చుంటే.. బ్యాంకర్లంతా వెనక వరుసలో ఎందుకు కూర్చోవాలి? అని ఆయన ప్రశ్నించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఇటీవల భారీ మోసం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలనే అంశంపై చర్చలు పెరిగాయి. వజ్రాల వ్యాపారులు నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ కంపెనీలు కొందరు బ్యాంక్ ఉద్యోగులతో కుమ్మక్కై  పిఎన్‌బిలో రూ.11,400 కోట్ల మేర మోసం చేశాయి. అనంతరం నీరవ్ మోడీ విదేశాలకు పారిపోయాడు. దీంతో ప్రభుత్వరంగ బ్యాంక్‌లపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పాలనా విధానాలు పటిష్ఠంగా లేవని, ప్రమాణాలు ఘోరంగా ఉన్నాయని, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎక్కువగా అవసరం లేదని కొటక్ మహింద్రా బ్యాంకు ఎక్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ ఉదయ్ కొటక్ విమర్శించారు. ఇటీవల గ్లోబల్ బిజినెస్ సదస్సులో మరికొందరు వ్యాపార వేత్తలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. పిఎస్‌యు బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను తగ్గించుకోవాల్సి సమయం ఆసన్నమైందంటూ పలు నిపుణులు సూచనలు చేశారు. దీంతో ప్రభుత్వ రంగ సంస్థలపై విమర్శలు చేస్తున్న వారిపై ఎస్‌బిఐ ఛైర్మన్ రజనీశ్ ప్రతి విమర్శలు చేశారు. సమాజం మెరుగుపడేందుకు ప్రభుత్వ సంస్థలు ఎంతగానో కృషి చేస్తున్నాయని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తున్నవి ప్రభుత్వరంగ బ్యాంకులేనని అన్నారు. దేశంలోని అనేక మారుమూల ప్రాంతాల్లో..  పల్లెల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో శాఖలను నడుపుతున్న ప్రైవేటు సంస్థలు ఏమైనా ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉదంతంతో ప్రజల్లో బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం పోతుందని తాను భావించడం లేదని అన్నారు. ప్రజల్లో ఇప్పటికే బ్యాంకింగ్ వ్యవస్థపై అపారమైన నమ్మకం ఉందని భావిస్తున్నామని అన్నారు.

Related Stories: