ప్రభాస్ నయా సినిమా షురూ

Prabhas New Movie Start

ప్రభాస్ హీరోగా గోపికృష్ణా మూవీస్ బ్యానర్‌లో సీనియర్ నటుడు కృష్ణంరాజు సమర్పణలో ఓ త్రిభాషా చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లోని కృష్ణంరాజు కార్యాలయంలో జరిగింది. గోపికృష్ణ మూవీస్ బ్యానర్, యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ‘జిల్’ వంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను అందించిన కె.కె.రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో ప్రభాస్ సరసన పూజాహెగ్డే నటించనుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ “కె.కె.రాధాకృష్ణ దర్శకత్వంలో నేను నటించబోయే త్రిభాషా చిత్రం ప్రారంభమైనందుకు ఆనందంగా ఉంది. గోపికృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తాయి”అని అన్నారు. దర్శకుడు రాధాకృష్ణ మాట్లాడుతూ “ప్రభాస్‌తో ఈ చిత్రం ప్రారంభం కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూశాను. గోపికృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవెల్‌లో నిర్మించనున్నాయి. ప్రభాస్, పూజాహెగ్డే పాల్గొనే సన్నివేశాలతో రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలో మొదలుపెట్టనున్నాం”అని తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ః మనోజ్ పరమహంస, మ్యూజిక్‌ః అమిత్ త్రివేది, ఎడిటర్‌ః శ్రీకర్ ప్రసాద్.