ప్రధాన అంశాలపై ప్రత్యేక దృష్టి

Discussion on many topics at the tribal advisory meeting

ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్
ఆదిమ గిరిజన సలహా మండలి సమావేశంలో పలు అంశాలపై చర్చ

మన తెలంగాణ/ఉట్నూర్ : గిరిజన గ్రామాలలో విద్య, వైద్యం, వ్యవసాయం, వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ డి.దివ్య అన్నా రు. బుధవారం ఉట్నూర్ కెబి కాం ప్లెక్స్ సమావేశ మందిరంలో ఆదిమ గిరిజన సలహా మండలి సమావేశంలో కలెక్టర్ పాల్గొని ప్రసంగిస్తూ, విద్యావలంటీర్ల దరఖాస్తులు స్వీకరించామని, వాటిని పరిశీలించి అర్హత గల వారిని ఎంపిక చేస్తామన్నారు. ఎఎన్‌ఎంలను డిప్యూటేషన్‌లపై పంపించినప్పటికే వారు విధుల్లో చేరడం లేదని, వారు విధుల్లో చేరేవిధంగా ప్రోత్సహించాలని సూచించారు. ఆదివాసీ గూడాలలో వైద్య సేవలు జరుగకపోవడం వలన అనర్ధాలు జరుగుచున్నాయని, ఇటీవల గాదిగూడ మండలం రూపాపూర్‌లో మహిళ ప్రసవం అనంతరం శిశువు మరణించడం జరిగిందని తెలిపారు. డిఆర్ డిపోల ద్వారా సరఫరా చేసే నిత్యావసర సరుకులను వర్షాకాలంలో ప్రణాళికలతో సరఫరా చేయాలన్నారు. గిరిజన గ్రామాల్లోని రైతులకు పత్తిపంటను  గులాబిరంగు పరుగు వలన కలిగే నష్టాలను వివరించాలని, లింగాకర్షక బుట్టల ఏర్పాటు వలన నివారించవచ్చని రైతులకు విస్తృతంగా వివరించాలని అన్నారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు సోకకుండా నీటిని కాచి వడబోసి తాగాలని ప్రజలకు ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోని గిరిజనులకు వివరించాలన్నారు. జ్వారాలు, వాంతులు, విరోచనాలు వలన బాధపడే వారిని పిహెచ్‌సి, సిహెచ్‌సి, రిమ్స్‌కు తరలించి వైద్య సేవలు అందించాలన్నారు. రాయిసెంటర్ల సమావేశాల్లో వివరాలను తెలియపరచాలన్నారు. ఎకనామిక్ సపోర్టు కింద అర్హులైన వారికి దశల వారీగా రుణాలు మంజూరు చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కృష్ణ అదిత్య, సలహామండలి చైర్మన్ కనక లక్కేరావు, ఎస్‌డిసి చిత్రు, డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.