ప్రజాకోర్టులో పాప ప్రక్షాళన

  ఎన్నికల ప్రచారం సందర్భంగా అరోపణల, ప్రత్యారోపణల దుమ్ము దండిగా రేగింది. ఏడు విడతలుగా ఎన్నికలు ముగిసిన తరవాత 19 వ తేదీన వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలూ అదే స్థాయిలో దుమ్ము రేపాయి. దాదాపు అన్ని సర్వేలు మోడీ నాయకత్వంలోని ఎన్.డి.ఎ. 300 కు పైగా స్థానాలు వస్తాయని చెప్పడంతో ఎగ్జిట్ పోల్ విధానం మీదే అనుమానాలు వ్యక్తం అయినాయి. తీరా ఫలితాలు వెలువడితే కొంచం అటూ ఇటూగా ఎగ్జిట్ పోల్ జోస్యాలే నిజమైనాయి. మోడీ […] The post ప్రజాకోర్టులో పాప ప్రక్షాళన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఎన్నికల ప్రచారం సందర్భంగా అరోపణల, ప్రత్యారోపణల దుమ్ము దండిగా రేగింది. ఏడు విడతలుగా ఎన్నికలు ముగిసిన తరవాత 19 వ తేదీన వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలూ అదే స్థాయిలో దుమ్ము రేపాయి. దాదాపు అన్ని సర్వేలు మోడీ నాయకత్వంలోని ఎన్.డి.ఎ. 300 కు పైగా స్థానాలు వస్తాయని చెప్పడంతో ఎగ్జిట్ పోల్ విధానం మీదే అనుమానాలు వ్యక్తం అయినాయి. తీరా ఫలితాలు వెలువడితే కొంచం అటూ ఇటూగా ఎగ్జిట్ పోల్ జోస్యాలే నిజమైనాయి. మోడీ ఘన విజయం అందరినీ నిర్ఘాంతపరిచింది. ఎన్నికల క్రమం ప్రారంభం కావడానికి ముందూ, ఆ తరవాత మోడీ నాయకత్వంలోని కూటమికి 2014 కన్నా దాదాపు 100 సీట్లు తక్కువ వస్తాయన్న అంచనా తలకిందులైంది. 2014లో వచ్చిన స్థానాలకన్నా ఎక్కువ సంపాదించడమే కాదు ఎన్.డి.ఎ.కు అనుకూలంగా ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. ప్రచారంలోనూ, మోడీకి దీటుగా నినాదాలు ఇవ్వడంలోనూ కాంగ్రెస్ వెనుకబడింది. సీట్ల దగ్గరకు వచ్చే సరికి కాంగ్రెస్ 2014తో పోలిస్తే పెంచుకున్న బలం నామ మాత్రమే. అప్పుడు కాంగ్రెస్‌కు 44 స్థానాలు వస్తే ఇప్పుడు సాధించింది 52 మాత్రమే. యు.పి.ఎ. భాగస్వామ్య పక్షాల విజయాలూ ఉత్సాహకరంగా లేవు.

గత అయిదేళ్ల మోడీ పాలన మీద అనేక విమర్శలు వినిపించాయి. ఆయన మనసులో మాట (మన్ కీ బాత్) చెప్తారు తప్ప ఎదుటి వారి మాట వినిపించుకోరు అన్న వాదన బలంగా వినిపించింది. అనేక చోట్ల గో సంరక్షణ పేరిట మూక దాడుల్లో ఎంత మంది మరణించినా మోడీ పెదవి విప్పలేదు. చివరకు పెదవి విప్పినప్పుడూ ఆ విద్వేషాగ్నిని చల్లార్చడానికి తమ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పకుండా ‘కావాలంటే నన్ను చంపండి’ అని అన్నారు. ఒక ప్రధానమంత్రి నుంచి ప్రజలు ఆశించేది ఇలాంటి సమాధానం కాదు. మూక దాడులకు మూలమైన విద్వేష ప్రచారాన్ని కట్టడి చేయడానికి మోడీ చేసిందేమీ లేదు. హిందుత్వ భావజాలాన్ని ప్రచారం చేయడానికి పరిమితం కాకుండా హిందువేతరుల మీద మోడీ అనుయాయుల విషవమనం అపారంగా సాగింది. వారి నోటికి మోడీ ఎన్నడూ తాళం వేయలేదు. ప్రధాని కాక ముందు మోడీ ఇలాగే మాట్లాడారు. ఆ తరవాత ఈ బాధ్యతను ఇతర బిజెపి నాయకులకు అప్పగించారు. 2014లో చేసిన వాగ్దానాలలో అనేకం నెరవేరలేదు.

‘సబ్ కా సాథ్-సబ్ కా వికాస్’ అన్న నినాదం 2014లో ప్రధానంగా వినిపిస్తే ఈ సారి పుల్వామా దాడి తరవాత బాలాకోట్ మీద మన వాయు సేన దాడిని మోడీ తన ఘనత కింద ప్రచారం చేసుకుని బిజెపికి వోటు వేయని వారికి దేశ రక్షణపై శ్రద్ధ లేదన్న రీతిలో మాట్లాడారు. బిజెపిని సమర్థించని వారందరూ పాకిస్థాన్ మద్దతుదార్లే అన్న అభిప్రాయం కలిగించారు. ఈ దఫా మొదటి సారి ఓటు వేస్తున్న యువత బిజెపిని గెలిపించడానికి పుల్వామా ఘటనను దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలని బాహాటంగానే విజ్ఞప్తి చేశారు. గతంలో జరిగిన కొన్ని యుద్ధాలలో మనం విజయం సాధించిన సందర్భాలున్నాయి. 1971లో పాకిస్తాన్ మీద బ్రహ్మాండమైన విజయం సాధించాం. కానీ ఇందిరా గాంధీ ఎన్నికల ప్రయోజనం కోసం ఆ గెలుపును వినియోగించుకోలేదు. కార్గిల్ యుద్ధం అప్పటి వాజపేయి నాయకత్వంలోని ఎన్.డి.ఎ. విజయానికి తోడ్పడితే తోడ్పడి ఉండవచ్చు కానీ ఆయన కూడా ఇది తన ఘనతే అని చెప్పుకోలేదు. సైనిక విజయాలను ఎన్నికల ప్రచారానికి వాడుకున్నది మోడీ ఒక్కరే.

గత 45 ఏళ్లలో నిరుద్యోగం ఇప్పుడున్నంతగా లేదు అన్న సమాచారాన్ని తొక్కి పెట్టి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నెరవేర్చని కఠిన సత్యాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించారు. మోడీ మీద ఫిర్యాదుల జాబితా అనంతంగా ఉంది. ‘న ఖావుంగా న ఖానే దేవుంగా’ అన్న మోడీ ప్రకటనలోని డొల్లతనం రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో జరిగిన అవకతవకలతో బట్టబయలైంది. ఈ విషయంలో మోడీ అవినీతికి పాల్పడ్డారని ఎవరూ అనడంలేదు. అయితే అక్రమం జరిగిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యాపించి ఉంది. రాఫేల్ వివాదంలో మోడీ ప్రభుత్వమే ముద్దాయి పాత్రను తీర్పరి పాత్రను పోషించింది.

2019 ఎన్నికలకు ముందు ఎలాగైనా మోడీని గద్దె దించాలన్న సంకల్పం బలంగా కనిపించింది. ప్రతిపక్షాలు ఐక్యమై ఈ లక్ష్యం సాధిస్తాయన్న ఆశ కలిగింది. కానీ ప్రతిపక్ష పార్టీలు ఒకదానికి మరొకటి ప్రతిపక్షంగా వ్యవహరించి మోడీని గద్దె దింపాలన్న లక్ష్యాన్ని నీరుగార్చాయి. మహా ఘట్ బంధన్ కేవలం అందమైన నినాదంగా మిగిలి పోయింది. అనేక రాష్ట్రాలలో ప్రతిపక్ష ఐక్యత జల్లెడలాగానో, కప్పల తక్కెడలాగానో మిగిలిపోయింది. వెరసి మోడీ విజయం సునాయాసం అయింది. ప్రతిపక్షాల ఐక్యతకు కాంగ్రెస్ అహంకార ధోరణి, అత్యాశ ఎంత విఘాతం కలిగించిందో ఇతర పార్టీల వ్యవహార ధోరణి తక్కువ కాదు. మోడీకి కాంగ్రెస్ అన్నా, ఆ పార్టీకి నాయకత్వం వహించే కుటుంబం అన్నా ఒళ్లు కంపరమెత్తుతుంది. ఈ విషయంలో ఆయన తన మనసులో మాట దాచుకోలేదు. అయితే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ మీద దాడికి ఆయన నెహ్రూ మీద విమర్శలను ఆసరాగా చేసుకున్నారు. నెహ్రూ కన్నా సర్దార్ పటేల్ ఎంత గొప్పో నమ్మించడానికి శాయశక్తులా ప్రయత్నించారు. తమ కుదురులో జాతీయోద్యమంలో పాల్గొన్న అంతటి నాయకులెవరూ లేనందున నెహ్రూ పక్కన పటేల్‌ను పెద్ద గీతగా చూపించాలనుకున్నారు. అలాగే అంబేద్కర్ విషయంలోనూ తంటాలు పడ్డారు.

అయినా మోడీ సాధించిన విజయాన్ని కాదనలేం. ఇది మోడీ వ్యక్తిగత విజయమా లేక సంఘ్ పరివార్ సిద్ధాంత బలిమికి ఓటర్లు ప్రాధాన్యం ఇచ్చారా అన్న ప్రశ్న తలెత్తక మానదు. ఎందుకంటే మోడీ హయాంలో సకల ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలు ధ్వంసం చేశారన్న ఆరోపణలు గట్టిగానే వినిపించాయి. ఈ సారి మోడీ గెలిస్తే ఇక ఎన్నికలే ఉండవు అని సాక్షాత్తు సంఘ పరివార్ నేతల నోటి వెంటే వినిపించింది. రాజ్యాంగ వ్యవస్థల మీద, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నవాళ్లు ఈ మాట ఎప్పటి నుంచో చెప్తున్నారు. మోడీ నోటి వెంట వెలువడిన అనేక అశాస్త్రీయ వ్యాఖ్యానాలు ఆయనకే కాక దేశానికే తలవంపులు తెచ్చాయి. మేఘాల చాటున విమానాలు ఉండి దాడి చేస్తే శత్రు రాడార్లు కనిపెట్టలేవు అందుకే ఆ సమయంలో దాడి చేయాలని ఆదేశించాను అని మోడీ చెప్పడం దేనికి సంకేతం? మోడీ నోట వెలువడిన అనేక మాటలు అశాస్త్రీయమే కాదు. మౌలిక పరిజ్ఞానం కొరవడిందనడానికి నిదర్శనం. మోడీ మహా వక్తే కావచ్చు. జనాన్ని ఆకర్షించగలిగిన మాటల మాంత్రికుడు కావచ్చు. కానీ మోడీ ప్రసంగాలకు కావలసిన సమాచారాన్ని సేకరించి ఇచ్చే బాధ్యత ప్రధానమంత్రి కార్యాలయానిది. అక్కడున్నవారికైనా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా? లేకపోతే మోడీ వారి సలహాలను విస్మరించి ఉండాలి. తన వాగ్ధాటి ముందు ఏమైనా చెల్లుతుందని అనుకొని ఉండాలి.

ఈ ఎన్నికలలో రాజ్యాంగ పరిరక్షణ కోసం శ్రమించిన కన్ హయా కుమార్, ప్రకాశ్ రాజ్ లాంటి వారిని ఓటర్లు గెలిపించలేదు. శబరిమల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు అమలు కాకుండా ఎదుర్కొన్న కాంగ్రెస్‌కు కేరళలో విజయం దక్కింది. ఇతర చోట్లా జనం ఈ విషయంలో బిజెపి అనుసరించిన వైఖరిని ప్రశ్నించినట్టు కనిపించదు. సమాన హక్కులకన్నా సంప్రదాయాలే ప్రధానం అన్న రీతిలో ప్రధాని మాట్లాడారు. సంప్రదాయాలు నిలవ నీరులాంటివి కావు. అనేక సందర్భాలలో సంప్రదాయాలూ మారతాయి. శబరిమల వ్యవహారంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పు సంప్రదాయాలను కాకుండా రాజ్యాంగంలో పేర్కొన్న సమాన హక్కుల ఆధారంగా ఇచ్చిందే. దేవతారాధన స్త్రీ పురుషులకు సమానంగానే ఉంటుంది. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం సెక్యులర్ పార్టీలు సమర్థంగా చేయలేకపోయాయి. జనానికి శాస్త్రీయ దృక్పథం అలవర్చాలన్న రాజ్యాంగ నిర్దేశాన్ని పట్టించుకునేవారే కనిపిపించడం లేదు.

అంతమాత్రం చేత శబరిమలపై సుప్రీం తీర్పు కొరగాకుండా పోవాల్సిందేనా? కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలోని యు.డి.ఎఫ్. విజయం సుప్రీంకోర్టు తీర్పును ప్రజాకోర్టు నిరసించినట్టేనా? విద్వేష ప్రచారాన్ని జనం ఆమోదించారనుకోవాలా? హామీలు నెరవేర్చడం, నెరవేర్చకపోవడం, ఎన్నికల ప్రణాళికలను అటకెక్కించడాన్ని ఇప్పుడు జనం పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ప్రజాస్వామ్య సూత్రాలు, లక్షణాలు, రాజ్యాంగ ప్రాధాన్యత గురించి వీటిని పరిరక్షించే పార్టీలు ప్రజలకు విడమర్చి చెప్పిన దాఖలాలే లేవు. మౌలికాంశాలపై ప్రజలను చైతన్యవంతుల్ని చేసే ప్రయత్నం సెక్యులర్ పార్టీలు ఎప్పుడు చేశాయి గనక? బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలైన ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ విజయం సాధించడం ఈ దుర్మార్గాలను ప్రజలు సహిస్తున్నారనుకోవాలా? బాంబు పేలుళ్లకు, జన నష్టానికి కారకులైన వారికి షరతులతో కూడిన జామీను లభించడం వారి నిర్దోషిత్వానికి రుజువు అయిపోతుందా? మూల భూతమైన ఈ అంశాలపై జన సమూహాలకు సమగ్ర అవగాహన కల్పించకపోతే ‘మా బురదలో మమ్మల్ని ఉండనివ్వండి- మీ పన్నీరు మాకు అక్కర్లేదు’ అన్న రీతిలో జనబాహుళ్యం అనుకోవడంలో ప్రధాన నింద మోయాల్సింది సెక్యులర్ పార్టీలని చెప్పుకునేవే.

ఈ ఎన్నికల్లో అసలు సమస్యలు ప్రస్తావనకు రాకుండా మోడీ జాగ్రత్త పడ్డారు. ప్రతి పొరపాటుకు ప్రతిపక్షాన్ని దోషిగా నిలబెట్టడం మోడీ విశిష్ట శైలి. న్యాయస్థానాల్లో చుక్కెదురైనప్పుడల్లా ప్రజాకోర్టులో తేల్చుకుంటాం అనడం రాజకీయ నాయకులకు అలవాటైన వ్యవహారమే. ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన అశాస్త్రీయ అంశాలు శాస్త్రీయమైపోతాయా? న్యాయ ప్రక్రియ అంతం కావలసిందేనా? ఇది చట్టబద్ధ పాలనకు తిలోదకాలివ్వడమే. ఎన్.డి.ఎ. గెలిచింది, బిజెపి గెలిచింది అనే వాళ్లకన్నా మోడీ గెలిచారు అన్న మాటే సర్వత్రా వినిపిస్తోంది. వ్యక్తి ఆరాధన శృతి మించుతోంది. ఇందిరా గాంధీ హయాం లో కాంగ్రెస్‌లో పాతుకుపోయిన ఈ దుష్ట సంప్రదాయం బిజెపికి కూడా అంటుకోవడం విలక్షణమైన పార్టీ అని చెప్పుకునే ఆ పార్టీకి వన్నె తెచ్చేది కాదు. మోడీ గెలవడానికి ప్రతిపక్షాల మధ్య శృతి కుదరకపోవడం, ప్రత్యామ్నాయ విధానాలను ప్రతిపాదించే పని ఏ నాడూ చేయకపోవడం ప్రధాన కారణాలు. బిజెపి సాధించిన విజయాలకన్నా ప్రతిపక్షాల బలహీనత, అనైక్యత, కొందరు ప్రతిపక్ష నాయకుల అహంకార పూరిత ధోరణి మోడీకి విజయం సమకూర్చింది. ప్రత్యర్థుల బలహీనతను ఆసరాగా చేసుకుని సాధించిన విజయం ఇది.

Exit polls predict Modi return to power

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రజాకోర్టులో పాప ప్రక్షాళన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: