ప్రజల వద్దకే విశ్వవిద్యాలయం

కళలపై ఆసక్తి ఉంటే అక్కడికే వెళ్లి నేర్పిస్తాం కనుమరుగవుతున్న కళలకు పునరుజ్జీవం స్నాతకోత్సవంలో 106 పిహెచ్‌డిలు, 79 బంగారు పతకాల ప్రదానం ఉన్నత విద్యను చదువుకోవాలనుకునేవారు… ఏదైనా కళను నేర్చుకోవాలనుకునే ఆయా విద్యా సంస్థల వద్దకు వెళ్లి నేర్చుకోవడం సహజం. కానీ తెలుగు విశ్వవిద్యాలయం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. కళలు నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే చాలు యూనివర్సిటీనే ప్రజల వద్దకు వెళ్తుంది. వర్సిటి ఉపకులపతిగా ఆచార్య ఎస్‌వి సత్యనారాయణ బాధ్యతలు చేపట్టిన తర్వాత వినూత్నమైన కార్యక్రమాలు […]

కళలపై ఆసక్తి ఉంటే అక్కడికే వెళ్లి నేర్పిస్తాం
కనుమరుగవుతున్న కళలకు పునరుజ్జీవం
స్నాతకోత్సవంలో 106 పిహెచ్‌డిలు,
79 బంగారు పతకాల ప్రదానం

ఉన్నత విద్యను చదువుకోవాలనుకునేవారు… ఏదైనా కళను నేర్చుకోవాలనుకునే ఆయా విద్యా సంస్థల వద్దకు వెళ్లి నేర్చుకోవడం సహజం. కానీ తెలుగు విశ్వవిద్యాలయం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. కళలు నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే చాలు యూనివర్సిటీనే ప్రజల వద్దకు వెళ్తుంది. వర్సిటి ఉపకులపతిగా ఆచార్య ఎస్‌వి సత్యనారాయణ బాధ్యతలు చేపట్టిన తర్వాత వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతూ విశ్వవిద్యాలయానికి వచ్చి కళలను నేర్చుకోలేని వర్గాలకు వర్సిటీనే వారికి చేరువ చేస్తున్నారు. గతంలో ఎంతో ప్రఖ్యాతిగాంచి కనుమరుగవుతున్న కళలను, కళాకారులను గుర్తించి వాటికి మళ్లీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. తెలుగు వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా ఆచార్య ఎస్.వి.సత్యనారాయణ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జూలై 3న స్నాతకోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘మన తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వూలో వర్సిటి చేపట్టబోయే కార్యక్రమాల గురించి విసి ఎస్.వి.సత్యనారాయణ వివరించారు.

ప్రజల వద్దకే విశ్వవిద్యాలయం అనేది మా నినాదం. యూనివర్సిటీకి వచ్చి నేర్చుకోవడం కంటే తామే ప్రజల వద్దకు వెళ్లి కళను నేర్చించే కార్యక్రమం చేపట్టాం. మొదటగా వికారాబాద్‌లో 50 మంది మహిళలకు ఒక బ్యాచ్ చొప్పున నాలుగు బ్యాచ్‌లలో 200 మంది మహిళలకు చిడుతలు, కోలాటం, జడకోలాటంలో శిక్షణ ఇచ్చాం. శిక్షణ పూర్తయిన తర్వాత నేర్చుకున్న వారికి యూనివర్సిటీ తరపున సర్టిఫికెట్ అందజేశాం. ఈ కళల్లో శిక్షణ పొందినవారిలో గృహిణులు, ఉద్యోగులు, అధ్యాపకులు ఉన్నారు. మా వద్ద శిక్షణ పొందిన బృందాలు తిరుపతి, శ్రీశైలం దేవస్థానాల ఆహ్వానం మేరకు ఆయా దేవాలయాల బ్రహ్మోత్సవాలలో ప్రదర్శన ఇచ్చారు. అలాగే దిల్‌సుఖ్‌నగర్‌లో 50 మంది మహిళలకు శిక్షణ పూర్తి చేశాం. త్వరలో ఉప్పల్‌లో మరో బ్యాచ్‌కు శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

మెట్ల కిన్నెరకు పునరుజ్జీవం
అంతరించిపోతున్న కళలను, కళాకారులను గుర్తించి వాటికి గుర్తింపు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. అందులో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో 12 మెట్ల కిన్నెర వాద్యాన్ని వాయించే ఏకైక కళాకారుడు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మొగిలయ్య ను గుర్తించి మా వర్సిటీలో విజిటిం గ్ ఫ్యాకల్టీగా నియమించుకున్నాం. ఎంఎ జానపదం విద్యార్థులకు మొగిలయ్య మూడు నెలల పాటు మెట్ల కిన్నెరలో శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం మా వర్సిటీలో మూడు కిన్నెరలు, వాటిని వాయించే విద్యార్థులు ఉన్నారు. జానపదంలో మెట్ల కిన్నెర కళకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ కళలలో భవిష్యత్తులో ఎంతోమంది విద్యార్థులు తర్ఫీదు పొందుతారు.

కొత్త కోర్సులు తీసుకువస్తాం
తెలుగు విశ్వవిద్యాలయంలో ఇప్పటి వరకు ఉన్న కోర్సులను కొనసాగిస్తూనే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త కోర్సులను తీసుకువస్తాం. భవిష్యత్తులో స్వయం ఉపాధి, వృత్తి నైపుణ్యం, ఉపాధి కల్పనకు సంబంధించిన కోర్సులు తీసుకువస్తాం. ఈ సంవత్సరం నుంచి దూరవిద్య ద్వారా ఆరు నెలల కాల వ్యవధి గల యోగా సర్టిఫికెట్ కోర్సును తీసుకువచ్చి, భవిష్యత్తులో యోగాలో డిప్లొమా, పిజి డిప్లొమా కోర్సులను అందుబాటులోకి తీసుకువస్తాం. గ్రామీణ ప్రాంతాలలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు వర్క్‌షాపులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపడతాం.

వర్సిటిని మరింత విస్తరిస్తాం
తెలుగు విశ్వవిద్యాలయ కార్యక్రమాలను మరింత విస్తరిస్తాం. వర్సిటీలో నూతన పరిపాలన భవనం నిర్మిస్తున్నాం. పార్కింగ్ స్థలంలో ఒపెన్ ఎయిర్ ఆడిటోరియం ఏర్పాటు చేయబోతున్నాం. బాచుపల్లిలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు చేపడుతున్నాం. 2002 సంవత్సరంలో నల్గొండలో పీఠం ఏర్పాటు చేసేందుకు శిలాఫలకం వేశారు. అక్కడ విశ్వవిద్యాలయానికి రెండున్నర ఎకరాల స్థలం ఉంది. సాధ్యమైనంత త్వరగా నల్గొండ పీఠాన్ని ప్రారంభించి, అక్కడ ఏడాదిలో 12 నెలలపాటు నిరంతరంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాం. అలాగే వరంగల్‌లో ఉన్న పీఠాన్ని పూర్తిగా ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

దేశవిదేశాలలో విస్తరిస్తున్న వర్సిటి ఖ్యాతి
కళల ద్వారా మనదేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలలో కూడా విశ్వవిద్యాలయం ఖ్యాతి విస్తరిస్తోంది. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలతోపాటు అమెరికా, సింగపూర్ వంటి దేశాలలో శిక్షణాలయాలు ఏర్పా టు చేసుకుని నృత్యం, సంగీతం, జానపదం వంటి కళల్లో శిక్షణ ఇస్తున్నారు. కళనే వృత్తిగా ఎంచుకునేవారికి మంచి ఉపాధి అవకాశాలున్నాయి. మా విద్యార్థులు సినీరంగంలో స్క్రీన్‌ప్లే, దర్శకత్వ విభాగాలలో రాణిస్తున్నారు.

స్నాతకోత్సవంలో పిహెచ్‌డిలు ప్రదానం
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం జూలై 3వ తేదీన రవీంద్రభారతిలో ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నాం. ఈ స్నాతకోత్సవంలో 79 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 106 మందికి పిహెచ్‌డిలు, 66 మందికి ఎం.ఫిల్ ప్రదానం చేస్తున్నాం. స్నాతకోత్సవంలో గవర్నర్ ఇఎస్‌ఎల్ నర్సింహ్మన్ వీరికి పట్టాలు అందజేస్తారు. అలాగే 532 ఎంఎ డిగ్రీలు, 38 బిఎఫ్‌ఎ, సాయం త్రం కోర్సుల్లో డిప్లొమా, పిజి డిప్లొమా పూర్తి చేసిన 400 మందికి, దూరవిద్య విధానంలో పిజి డిగ్రీలు పూర్తి చేసిన 2,139 మందికి సర్టిఫికెట్లు ప్రదానం చేస్తాం.

Comments

comments